కీర్తన 73 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథంమూడవ గ్రంథము కీర్తనలు 73–89 కీర్తన 73 ఆసాపు కీర్తన. 1 ఇశ్రాయేలుకు, శుద్ధ హృదయులకు దేవుడు ఖచ్చితంగా మంచివాడు. 2 కానీ నా మట్టుకైతే, నా పాదాలు దాదాపు జారిపోయాయి; నా పాదం దాదాపు పట్టును కోల్పోయింది. 3 దుష్టుల క్షేమం నేను చూసినప్పుడు నేను అహంకారుల మీద అసూయ పడ్డాను. 4 వారికి ఏ బాధలు లేవు; వారి శరీరాలు ఆరోగ్యంగా బలంగా ఉన్నాయి. 5 సాధారణంగా మనుష్యులకు ఉండే భారాలు వారికి లేవు; మనుష్యులకు కలిగే అనారోగ్యమనే తెగులు వారికి లేదు. 6 కాబట్టి గర్వం వారికి కంఠహారంగా ఉంది; హింసను వారు వస్త్రంగా ధరించారు. 7 వారి కఠిన హృదయాల నుండి దోషం బయటికి వస్తుంది, వారి చెడు ఊహలకు హద్దులు లేవు. 8 వారు ఎగతాళి చేస్తారు, దురుద్దేశంతో మాట్లాడతారు; అహంకారంతో అణచివేస్తామని బెదిరిస్తారు. 9 వారి నోళ్ళు పరలోకంలో పాలిస్తున్నట్లు మాట్లాడుతాయి, వారి నాలుకలు భూమిపై ఆధిపత్యమున్నట్లు ప్రకటిస్తాయి. 10 అందువల్ల వారి ప్రజలు వారివైపు తిరుగుతారు వారి మాటలను మంచినీరు త్రాగినట్లు త్రాగుతారు. 11 “దేవునికి ఎలా తెలుస్తుంది? మహోన్నతునికి ఏదైనా తెలుసా?” అని వారనుకుంటారు. 12 దుష్టులు ఇలా ఉంటారు. ఎప్పుడూ ఏ జాగ్రత్తలు లేకుండ సంపద కూడబెట్టుకుంటారు. 13 నేను నా హృదయాన్ని పవిత్రంగా ఉంచుకోవడం వ్యర్థమే నేను నా చేతులు కడుక్కుని నిర్దోషంగా ఉండడం వ్యర్థమే. 14 రోజంతా నేను బాధింపబడ్డాను, ప్రతి ఉదయం నూతన శిక్షలు వస్తున్నాయి. 15 నేను అలా మాట్లాడాలని అనుకుని ఉంటే, నేను మీ పిల్లలను మోసం చేసినట్టే. 16-17 ఇదంతా నేను అర్థం చేసుకోవాలని ప్రయత్నించినప్పుడు, నేను దేవుని పరిశుద్ధాలయంలో ప్రవేశించే వరకు అది నన్ను గాఢంగా ఇబ్బంది పెట్టింది; అప్పుడు నేను వారి చివరి గమ్యమేంటో గ్రహించాను. 18 ఖచ్చితంగా మీరు వారిని జారే నేలపై ఉంచారు; మీరు వారిని పతనానికి పడవేస్తారు. 19 వారు అకస్మాత్తుగా నాశనమవుతారు, వారు భయంతో పూర్తిగా నశిస్తారు! 20 ప్రభువా, మీరు లేచినప్పుడు, ఒకరు మేల్కొన్నప్పుడు ఒక కలలో చూసినవి మరచినట్లు; మీరు వారి ఉనికిని తృణీకరిస్తారు. 21 నా హృదయం దుఃఖించినప్పుడు నా ఆత్మ నీరసించినప్పుడు, 22 నేను తెలివిలేని వాడను, అజ్ఞానిని; మీ ఎదుట నేను క్రూరమైన మృగంలా ఉన్నాను. 23 అయినా నేనెల్లప్పుడు మీతో ఉన్నాను; మీరు నా కుడిచేయి పట్టుకున్నారు. 24 మీ ఆలోచనచేత నన్ను నడిపిస్తున్నారు, తర్వాత నన్ను పరలోక మహిమలో చేర్చుకుంటారు. 25 పరలోకంలో మీరు తప్ప నాకెవరున్నారు? మీరు తప్ప ఈ లోకంలో నాకేమి అక్కర్లేదు. 26 నా శరీరం నా హృదయం నీరసిస్తాయేమో, కాని నిత్యం నా దేవుడు నా హృదయానికి బలం నిత్యం నా స్వాస్థ్యం. 27 మీకు దూరంగా ఉన్నవారు నశిస్తారు; మిమ్మల్ని విడిచి వ్యభిచారులుగా ప్రవర్తించే వారందరినీ మీరు నాశనం చేస్తారు. 28 కాని నా మట్టుకైతే, నేను దేవునికి సమీపంగా ఉంటాను. నేను ప్రభువైన యెహోవాను ఆశ్రయంగా చేసుకున్నాను; మీ క్రియలన్నిటిని గురించి నేను ప్రకటిస్తాను. |
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.
Biblica, Inc.