కీర్తన 69 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథంకీర్తన 69 సంగీత దర్శకునికి. “కలువ పువ్వులు” అనే రాగము మీద పాడదగినది. దావీదు కీర్తన. 1 దేవా, నన్ను రక్షించండి, నీళ్లు నా మెడ వరకు పొంగి వచ్చాయి. 2 లోతైన ఊబిలో నేను దిగబడిపోతున్నాను, నేను నిలబడలేకపోతున్నాను. నేను అగాధ జలాల్లో ఉన్నాను; వరదలు నన్ను ముంచేస్తున్నాయి. 3 సాయం కోసం అరిచి అలసిపోయాను; నా గొంతు ఆరిపోయింది. నా దేవుని కోసం చూస్తూ, నా కళ్లు క్షీణిస్తున్నాయి. 4 నిష్కారణంగా నన్ను ద్వేషించేవారు నా తలవెంట్రుకల కన్నా ఎక్కువగా ఉన్నారు. నాకు చాలామంది శత్రువులు ఉన్నారు, వారు నిష్కారణంగా నన్ను నాశనం చేయాలని చూస్తున్నారు. నేను దొంగతనం చేయని దానిని నేను బలవంతంగా తిరిగి ఇవ్వవలసి వచ్చింది. 5 దేవా! నా బుద్ధిహీనత మీకు తెలుసు; నా అపరాధాలు మీ నుండి దాచబడలేదు. 6 సైన్యాల అధిపతియైన యెహోవా, మీలో నిరీక్షణ ఉంచినవారు నా వలన అవమానానికి గురికావద్దు; ఇశ్రాయేలు దేవా, మిమ్మల్ని వెదకేవారు నా వలన సిగ్గుపడకూడదు. 7 మీ కోసం నేను నిందల పాలయ్యాను, సిగ్గు నా ముఖాన్ని కప్పేసింది. 8 నా కుటుంబానికే నేను పరాయివాడిని అయ్యాను, నా సొంత తల్లి కుమారులకే నేను అపరిచితుని అయ్యాను; 9 మీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను దహించి వేస్తుంది, మిమ్మల్ని అవమానపరచే వారి అవమానాలు నా మీద పడును గాక. 10 నేను ఉపవాసముండి ఏడ్చినప్పుడు అది నా నిందకు కారణమైంది. 11 నేను గోనెపట్ట కట్టుకున్నప్పుడు వారు నన్ను హేళనకు సామెతగా చేశారు. 12 గుమ్మం దగ్గర కూర్చునేవారు నన్ను ఎగతాళి చేస్తారు, త్రాగుబోతులు నా గురించి పాటలు పాడుతున్నారు. 13 అయితే యెహోవా, ఇది మీ దయ చూపే సమయమని నేను మీకు ప్రార్థిస్తున్నాను. దేవా, మీ గొప్ప ప్రేమతో, మీ నమ్మకమైన రక్షణతో నాకు జవాబు ఇవ్వండి. 14 ఊబిలో నుండి నన్ను విడిపించండి, నన్ను మునిగి పోనివ్వకండి; నన్ను ద్వేషించేవారి నుండి లోతైన నీటిలో నుండి నన్ను కాపాడండి. 15 వరదలు నన్ను ముంచనీయకండి, అగాధాలు నన్ను మ్రింగనివ్వకండి గుంటలో నన్ను పడనివ్వకండి. 16 యెహోవా, మీ ప్రేమలోని మంచితనంతో నాకు జవాబు ఇవ్వండి; మీ గొప్ప కనికరాన్ని బట్టి నా వైపు తిరగండి. 17 మీ సేవకుని నుండి మీ ముఖాన్ని దాచకండి; నేను ఇబ్బందిలో ఉన్నాను, నాకు త్వరగా జవాబివ్వండి. 18 నా దగ్గరకు వచ్చి నన్ను కాపాడండి; నా శత్రువుల నుండి నన్ను విడిపించండి. 19 నన్ను ఎలా హేళన చేశారో, అవమానపరిచారో, సిగ్గుపరిచారో మీకు తెలుసు; నా శత్రువులంతా మీ ఎదుటే ఉన్నారు. 20 వారు చేసిన అవమానాలకు నా గుండె బద్దలయ్యింది. నేను నిరాశలో ఉన్నాను; నేను సానుభూతి కోసం చూశాను, కానీ ఎవరూ లేరు ఆదరించేవారి కోసం చూశాను, కానీ ఒక్కరూ దొరకలేదు. 21 నా ఆహారంలో వారు చేదు కలిపారు దాహమైతే పులిసిన ద్రాక్షరసం ఇచ్చారు. 22 వారి ఎదుట ఉన్న భోజనబల్ల వారికి ఉరి అవును గాక; వారి క్షేమం వారికి ఉచ్చు అవును గాక. 23 వారు చూడకుండ వారి కళ్లకు చీకటి కమ్మును గాక, వారి నడుములు శాశ్వతంగా వంగిపోవును గాక. 24 మీ ఉగ్రతను వారి మీద కుమ్మరించండి; మీ కోపాగ్ని వారిని తాకనివ్వండి. 25 వారి స్థలం పాడైపోవును గాక; వారి డేరాలలో ఎవరు నివసించకుందురు గాక. 26 మీరు గాయం చేసిన వారిని వారు హింసిస్తారు మీరు బాధపెట్టిన వారి బాధ గురించి మాట్లాడతారు. 27 నేరం మీద నేరం వారిపై మోపండి; మీ నీతిలో వారిని పాలు పంచుకోనివ్వకండి. 28 జీవగ్రంథంలో నుండి వారు తుడిచివేయబడుదురు గాక, నీతిమంతుల జాబితాలో వారి నమోదు చేయబడకుండును గాక. 29 కాని నా మట్టుకైతే నేను బాధించబడి వేదనలో ఉన్నాను, దేవా! మీ రక్షణ నన్ను కాపాడును గాక. 30 నేను పాడుతూ దేవుని నామాన్ని స్తుతిస్తాను. కృతజ్ఞత చెల్లించి ఆయనను కీర్తిస్తాను. 31 ఎద్దును, కొమ్ములు డెక్కలు కలిగిన కోడెను అర్పించడం కంటే, ఆయనను స్తుతించడం యెహోవాకు ఇష్టము. 32 దీనులు చూసి ఆనందిస్తారు; దేవున్ని వెదికేవారి హృదయాలు తిరిగి బ్రతుకును గాక. 33 అవసరత ఉన్నవారి మొర యెహోవా వింటారు, బందీగా ఉన్న తన ప్రజలను ఆయన అలక్ష్యం చేయరు. 34 ఆకాశం భూమి ఆయనను స్తుతించును గాక, సముద్రాలు వాటిలో ఉండే జలచరాలన్నీ ఆయనను స్తుతించును గాక. 35 ఎందుకంటే దేవుడు సీయోనును రక్షిస్తారు, యూదా పట్టణాలను తిరిగి కడతారు. అప్పుడు ప్రజలు అక్కడ నివసించి దానిని స్వాధీనం చేసుకుంటారు. 36 దేవుని సేవకుల సంతానం ఆ భూమిని వారసత్వంగా పొందుతారు. ఆయన నామాన్ని ప్రేమించేవారు అక్కడ నివసిస్తారు. |
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.
Biblica, Inc.