కీర్తన 52 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథంకీర్తన 52 సంగీత దర్శకునికి. దావీదు ధ్యానకీర్తన. ఎదోమీయుడైన దోయేగు సౌలు దగ్గరకు వచ్చి–దావీదు అహీమెలెకు ఇంటికి వెళ్లాడని అతనితో చెప్పినప్పుడు దావీదు ఈ కీర్తన రచించాడు. 1 బలాఢ్యుడా, చేసిన కీడు గురించి ఎందుకు గొప్పలు చెప్పుకుంటున్నావు? దేవుని దృష్టిలో అవమానకరమైన నీవు, రోజంతా ఎందుకు ప్రగల్భాలు పలుకుతావు? 2 మోసం చేసేవాడా, నీ నాలుక పదునైన క్షౌరం చేసే కత్తి; అది నాశనాన్ని చేస్తుంది. 3 మేలు కంటే కీడు చేయడం, నీతి కంటే అబద్ధం చెప్పడమే నీకు ఇష్టం. సెలా 4 మోసపూరితమైన నాలుక గలవాడా, నీకు హానికరమైన మాటలే ఇష్టం. 5 ఖచ్చితంగా దేవుడు నిన్ను నిత్యనాశనానికి గురి చేస్తారు: ఆయన నిన్ను మీ గుడారంలో నుండి పెరికివేస్తారు; సజీవుల దేశంలో నుండి నిన్ను పెరికివేస్తారు. సెలా 6 నీతిమంతులు ఇదంతా చూసి భయభక్తులతో వారు నవ్వుతూ ఇలా అంటారు, 7 “ఇతన్ని చూడండి, దేవున్ని తన బలమైన కోటగా చేసుకోకుండ తనకున్న సంపదలను నమ్ముకుని ఇతరులను నాశనం చేస్తూ బలపడ్డాడు!” 8 కానీ నేను దేవుని నివాసంలో పచ్చని ఒలీవ చెట్టులా ఉన్నాను; నేను ఎల్లప్పుడు, మారని దేవుని ప్రేమను నమ్ముతాను. 9 మీరు చేసిందానికి నేను ఎల్లప్పుడు మీ భక్తుల ఎదుట మిమ్మల్ని స్తుతిస్తాను. మీ నామం ఉత్తమమైనది, కాబట్టి నేను మీ నామంలో నిరీక్షణ కలిగి ఉన్నాను. |
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.
Biblica, Inc.