Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

కీర్తన 49 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


కీర్తన 49
సంగీత దర్శకునికి. కోరహు కుమారుల కీర్తన.

1 సర్వజనులారా, ఈ విషయం వినండి; సర్వ లోకవాసులారా, ఆలకించండి,

2 సామాన్యులారా, గొప్పవారలారా ధనికులారా పేదలారా అందరు వినండి:

3 నా నోరు జ్ఞానాన్ని పలుకుతుంది; నా హృదయ ధ్యానం మీకు అవగాహన ఇస్తుంది.

4 నేను నా చెవిని సామెత వైపు త్రిప్పుతాను వీణతో నేను నా పొడుపు కథను విప్పుతాను:

5 దుర్దినాలు వచ్చినప్పుడు, నా శత్రువుల పాపం నన్ను చుట్టుముట్టినప్పుడు నేనెందుకు భయపడాలి?

6 వారు తమ సంపదను నమ్మి, తమ ఐశ్వర్యాన్ని గురించి గొప్పలు చెప్పుకుంటారు.

7 ఎవరు మరొకరి ప్రాణాన్ని విడిపించలేరు వారి కోసం దేవునికి క్రయధనం చెల్లించలేరు.

8-9 వారు కుళ్లు చూడక, నిత్యం బ్రతకాలంటే వారి ప్రాణ విమోచన వెల చాలా ఎక్కువ అది ఎన్నటికి చెల్లించబడలేదు.

10 తమ సంపదను ఇతరులకు వదిలేసి జ్ఞానులు చనిపోవడం, మూర్ఖులు తెలివిలేనివారు నశించడం అందరు చూస్తారు.

11 వారు తమ భూములకు తమ పేర్లే పెట్టుకున్నప్పటికి సమాధే వారి నిత్య నివాసము అక్కడే వారు నిత్యం నివసిస్తారు.

12 మనుష్యులు ఎంత సంపద ఉన్నా నశించకుండ ఉండలేరు; నశించే జంతువుల్లా వారు ఉన్నారు.

13 తమను తాము నమ్ముకొనే బుద్ధిహీనులకు, వారు చెప్పేది వింటూ వారిని అనుసరించేవారికి ఇదే గతి. సెలా

14 వారు గొర్రెల్లా ఉండి మరణానికి నడిపించబడతారు; మరణమే వారికి కాపరి. యథార్థవంతులు ఉదయం వారిని పరిపాలిస్తారు. వారి రాజభవనాలకు దూరంగా, సమాధిలో వారి మృతదేహాలు కుళ్ళిపోతాయి.

15 కానీ దేవుడు పాతాళం నుండి నన్ను విడిపిస్తారు; ఆయన తప్పకుండ నన్ను తన దగ్గరకు తీసుకెళ్తారు. సెలా

16 కాబట్టి ఇతరులు ధనవంతులుగా ఎదిగినప్పుడు, వారి ఇండ్ల వైభవం అధికమైనప్పుడు భయపడవద్దు.

17 ఎందుకంటే వారు చనిపోయినప్పుడు వారు తమతో ఏమీ తీసుకెళ్లరు, వారి వైభవం వారి వెంట దిగిపోదు.

18 వారు బ్రతికి ఉన్నప్పుడు ఆశీర్వదింపబడిన వారిగా తమను తాము పిలుచుకున్నా, వారు అభివృద్ధి చెందినప్పుడు ప్రజలు వారిని పొగిడినా,

19 వారు తమకంటే ముందుగా వెళ్లిపోయినవారిని చేరుకుంటారు, వారు మరి ఎన్నడూ జీవపు వెలుగును చూడరు.

20 సంపద ఉండి వివేకంలేని మనుష్యులు నశించే జంతువుల్లాంటి వారు.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan