Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

కీర్తన 44 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


కీర్తన 44
సంగీత దర్శకునికి. కోరహు కుమారులు రచించిన ధ్యానకీర్తన.

1 ఓ దేవా! మా పూర్వికుల రోజుల్లో పురాతన కాలంలో మీరు చేసినదంతా మా పితరులు మాకు చెప్పారు.

2 మీ స్వహస్తంతో దేశాలను వెళ్లగొట్టారు మా పూర్వికులను అక్కడ నిలబెట్టారు; ఆయా జాతుల ప్రజలను నాశనం చేసి మా పూర్వికులను వర్ధిల్లేలా చేశారు.

3 తమ ఖడ్గంతో ఈ దేశాన్ని వారు వశం చేసుకోలేదు, తమ భుజబలంతో విజయం సాధించలేదు; మీరు వారిని ప్రేమించారు కాబట్టి మీ కుడిచేయి మీ భుజబలం మీ ముఖకాంతియే వారికి విజయాన్ని ఇచ్చింది.

4 మీరే మా రాజు, మీరే మా దేవుడు, యాకోబు ప్రజలకు విజయం కలగాలని ఆజ్ఞాపిస్తారు.

5 మీ వలన విరోధులను పడగొట్టగలం; మా మీదికి ఎగబడే వారిని మీ పేరట అణచివేయగలము.

6 మా ధనస్సు మీద మాకు నమ్మకం లేదు, మా ఖడ్గం మాకు విజయం ఇవ్వదు.

7 మా విరోధులపై మాకు విజయమిచ్చేది మీరే, మీరే పగవారికి సిగ్గుపడేలా చేశారు.

8 దేవుని యందు మేము దినమంతా అతిశయిస్తాం మీ నామాన్ని నిత్యం స్తుతిస్తాము. సెలా

9 కాని ఇప్పుడైతే మీరు మమ్మల్ని త్రోసివేసి అవమానపరిచారు; మా సైన్యంతో మీరు రావడం లేదు.

10 శత్రువుల ముందు పారిపోవలసి వచ్చింది, పగవారు మమ్మల్ని దోచుకున్నారు.

11 గొర్రెలను ఆహారంగా ఇచ్చినట్లు మమ్మల్ని వారికిచ్చారు దేశాల మధ్యకు మమ్మల్ని చెదరగొట్టారు.

12 లాభం చూసుకోకుండా నీ ప్రజలను, తక్కువ వెలకు అమ్మేశారు.

13 పొరుగువారు మమ్మల్ని నిందించేలా చేశారు; మా చుట్టూ ఉన్నవారు మమ్మల్ని ఎగతాళి చేసేలా చేశారు.

14 మమ్మల్ని జనాల నోట సామెతలా చేశారు; జనాంగాలు తలలూపుతూ మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు.

15-16 నిందిస్తూ హేళన చేసేవారి కారణంగా పగ తీర్చుకోవాలనుకునే శత్రువుల కారణంగా శత్రువులు మా ఎదుటకు వస్తే, దినమంతా మాకు అవమానమే; సిగ్గు మా ముఖాన్ని కమ్మివేసింది.

17 ఇదంతా మా మీదికి వచ్చిపడినా, మేము మిమ్మల్ని మరవలేదు; మీ నిబంధన విషయం నమ్మకద్రోహులం కాలేదు.

18 మా హృదయం వెనుదీయలేదు; మా పాదాలు మీ మార్గం నుండి తొలగిపోలేదు.

19 నక్కలు తిరిగే చోట మీరు మమ్మల్ని నలగ్గొట్టి పడేశారు; చావు నీడ మమ్మల్ని ఆవరించి ఉన్నది.

20 ఒకవేళ మేము మా దేవుని పేరు మరచినా, పరదేశి దేవుని వైపు చేతులు చాపినా,

21 హృదయ రహస్యాలు తెలిసిన దేవుడు ఆ విషయాన్ని తెలుసుకోకుండ ఉంటారా?

22 అయినా రోజంతా మీ కోసమే మరణ బాధ పడుతున్నాం; వధించ దగిన గొర్రెలమని మమ్మల్ని ఎంచుతున్నారు.

23 ప్రభువా, లెండి! ఎందుకీ నిద్ర? లెండి మమ్మల్ని శాశ్వతంగా విడిచిపెట్టకండి.

24 మీ ముఖాన్ని మా నుండి ఎందుకు దాచుకుంటున్నారు? నా బాధను నా హింసను మరచిపోయారా?

25 మేము క్రుంగి నేలకు ఒరిగిపోయాము; మా దేహాలు నేలకు అంటుకుపోయాయి.

26 లేచి మాకు సాయం చేయండి; మారని మీ ప్రేమతో మమ్మల్ని విడిపించండి.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan