Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

కీర్తన 37 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


కీర్తన 37
దావీదు కీర్తన.

1 దుష్టులను బట్టి బాధపడకు తప్పు చేసేవారిని చూసి అసూయపడకు;

2 గడ్డిలా వారు త్వరలోనే వాడిపోతారు, పచ్చ మొక్కల్లా వారు త్వరలోనే ఎండిపోతారు.

3 యెహోవా మీద నమ్మకం ఉంచి మంచి చేయి; దేశంలో నివసించి సురక్షితమైన క్షేమకరమైన పచ్చికను ఆస్వాదించు.

4 యెహోవాయందు ఆనందించు, ఆయన నీ హృదయ కోరికలు తీరుస్తారు.

5 నీ మార్గాన్ని యెహోవాకు అప్పగించండి; ఆయనపై నమ్మకం ఉంచితే ఆయన నీకు సహాయం చేస్తారు.

6 ఆయన నీ నీతిని తెల్లవారు వెలుగులా ప్రకాశింపజేస్తారు, నీ నిర్దోషత్వాన్ని మధ్యాహ్న సూర్యునిలా ప్రకాశింపజేస్తారు.

7 యెహోవా ముందు మౌనంగా ఉండు ఆయన కోసం ఓర్పుతో వేచి ఉండు. ప్రజలు వారి మార్గాల్లో విజయవంతమైనప్పుడు వారు తమ దుష్ట పన్నాగాలు అమలు చేసినప్పుడు చింతించకు.

8 కోపం మాని ఆగ్రహాన్ని విడిచిపెట్టు; చింతించకు అది కీడుకే దారి తీస్తుంది.

9 చెడ్డవారు నాశనం చేయబడతారు, కాని యెహోవా కోసం నిరీక్షించే వారు దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు.

10 దుష్టులు కొంతకాలం తర్వాత కనుమరుగవుతారు; వారి కోసం వెదకినా వారు కనబడరు.

11 కాని సాత్వికులు భూమిని స్వాధీనం చేసుకుంటారు సమాధానం అభివృద్ధి కలిగి జీవిస్తారు.

12 దుష్టులు నీతిమంతుల మీద కుట్రలు పన్నుతారు, వారిని చూసి పళ్ళు కొరుకుతారు.

13 వారి సమయం దగ్గరపడింది, కాబట్టి ప్రభువు దుష్టులను చూసి నవ్వుతారు.

14 దుష్టులు కత్తి దూసి, విల్లు ఎక్కుపెట్టి, అవసరతలో ఉన్న దీనులను నిరుపేదలను పతనం చేయాలని యథార్థవంతులను హతమార్చాలని చూస్తారు.

15 వారి ఖడ్గాలు వారి గుండెల్లోకే దూసుకుపోతాయి, వారి విండ్లు విరిగిపోతాయి.

16 అనేకమంది దుష్టుల ధనం కంటే నీతిమంతుల దగ్గర ఉన్న కొంచెం మేలు.

17 దుష్టుల చేతులు విరిగిపోతాయి, నీతిమంతులను యెహోవా సంరక్షిస్తారు.

18 నిందారహితులు తమ రోజులు యెహోవా సంరక్షణలో గడుపుతారు, వారి వారసత్వం శాశ్వతంగా ఉంటుంది.

19 విపత్తు సమయాల్లో వారు వాడిపోరు; కరువు దినాల్లో వారు సమృద్ధిని అనుభవిస్తారు.

20 కాని దుష్టులు నశిస్తారు: యెహోవా శత్రువులు పొలంలో ఉండే పూవుల్లా ఉన్నా, వారు కాల్చబడతారు పొగలా పైకి వెళ్తారు.

21 దుష్టులు అప్పు తెచ్చుకుంటారు కాని తీర్చరు, కాని నీతిమంతులు దయ కలిగి ఇస్తారు.

22 యెహోవా ఆశీర్వదించినవారు భూమిని స్వాధీనపరచుకుంటారు, కాని ఆయన శపించినవారు నాశనమౌతారు.

23 తనను బట్టి ఆనందించేవారి అడుగులను యెహోవా స్థిరపరుస్తారు;

24 యెహోవా వారి చేతిని పట్టుకుంటారు, కాబట్టి వారు తొట్రిల్లినా పడిపోరు.

25 ఒకప్పుడు నేను యవ్వనస్థుడను ఇప్పుడు ముసలివాడినయ్యాను, అయినాసరే నీతిమంతులు విడిచిపెట్టబడడం వారి పిల్లలు ఆహారం అడుక్కోవడం నేనెప్పుడు చూడలేదు.

26 వారు ఎల్లప్పుడు దయ గలవారై ఉచితంగా అప్పు ఇస్తారు; వారి పిల్లలు దీవెనకరంగా ఉంటారు.

27 కీడు చేయడం మాని మేలు చేయి; అప్పుడు నీవు శాశ్వతంగా దేశంలో నివసిస్తావు.

28 యెహోవా నీతిమంతులను ప్రేమిస్తారు తన నమ్మకస్థులను ఆయన విడిచిపెట్టరు. ఆయన వారిని శాశ్వతంగా భద్రపరుస్తారు; కాని దుష్టుల సంతానం నశిస్తుంది.

29 నీతిమంతులు భూమిని వారసత్వంగా పొందుకొని అందులో చిరకాలం నివసిస్తారు.

30 నీతిమంతుల నోరు జ్ఞానాన్ని పలుకుతుంది, వారి నాలుక న్యాయమైనది మాట్లాడుతుంది.

31 వారి దేవుని ధర్మశాస్త్రం వారి హృదయాల్లో ఉంది; వారి పాదాలు జారవు.

32 దుష్టులు నీతిమంతులను చంపాలని దారిలో పొంచి ఉంటారు.

33 కాని యెహోవా వారిని దుష్టుల చేతికి అప్పగించరు, వారు విచారణకు వచ్చినప్పుడు వారిని శిక్షింపబడనీయరు.

34 యెహోవాయందు నిరీక్షణ ఉంచి ఆయన మార్గాన్ని అనుసరించు. భూమిని వారసత్వంగా పొందేలా ఆయన నిన్ను హెచ్చిస్తారు; దుష్టులు నాశనమైనప్పుడు నీవు చూస్తావు.

35 నేను దుష్టులను, క్రూరులైన మనుష్యులను చూశాను; వారు స్వస్థలంలో ఏపుగా పెరుగుతున్న చెట్టులా ఉన్నారు.

36 కాని అంతలోనే వారు గతించిపోయారు; నేను వారి కోసం వెదికినా వారు కనబడలేదు.

37 నిర్దోషులను గమనించు, యథార్థ హృదయులను గమనించు; సమాధానం వెదకే వారి కోసం భవిష్యత్తు వేచి ఉంది.

38 కాని పాపులందరు నశిస్తారు, దుష్టులకు భవిష్యత్తు ఉండదు.

39 నీతిమంతుల రక్షణ యెహోవా నుండి వస్తుంది; కష్ట సమయంలో ఆయన వారికి బలమైన కోట.

40 యెహోవా వారికి సాయం చేసి వారిని విడిపిస్తారు; వారు ఆయనను ఆశ్రయిస్తారు కాబట్టి, దుష్టుల చేతి నుండి ఆయన వారిని విడిపించి రక్షిస్తారు.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan