కీర్తన 27 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథంకీర్తన 27 దావీదు కీర్తన. 1 యెహోవాయే నాకు వెలుగు నా రక్షణ నేను ఎవరికి భయపడతాను? దేవుడే నా జీవితానికి బలమైన కోట నేను ఎవరికి భయపడతాను? 2 నన్ను మ్రింగివేయాలని దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నా శత్రువులు నా పగవారు తూలి పడిపోతారు. 3 సైన్యం నన్ను ముట్టడించినా, నా హృదయం భయపడదు; నా మీదికి యుద్ధానికి వచ్చినా, నేను ధైర్యం కోల్పోను. 4 యెహోవాను ఒకటి అడిగాను, నేను కోరింది ఇదే; యెహోవా ప్రసన్నతను చూస్తూ ఆయన మందిరంలో ఆయనను వెదకుతూ నా జీవితకాలమంతా నేను యెహోవా మందిరంలో నివసించాలని కోరుతున్నాను. 5 ఆపద సంభవించిన దినాన ఆయన తన ఆశ్రయంలో నన్ను క్షేమంగా ఉంచుతారు; తన పవిత్ర గుడారంలో ఆయన నన్ను దాచిపెడతారు, ఎత్తైన బండ మీద నన్ను నిలుపుతారు. 6 నన్ను చుట్టూ ముట్టిన శత్రువుల కంటే, నా తల పైకెత్తబడుతుంది ఆయన పవిత్ర గుడారం దగ్గర ఆనంద బలులర్పిస్తాను; నేను పాడి యెహోవాను స్తుతిస్తాను. 7 యెహోవా, నేను మొరపెట్టినప్పుడు నా స్వరాన్ని ఆలకించండి; నాపై కరుణ చూపించి నాకు జవాబివ్వండి. 8 “ఆయన ముఖాన్ని వెదకు!” అని నా హృదయం మీ గురించి అంటుంది, యెహోవా, మీ ముఖాన్ని నేను వెదకుతాను. 9 మీ ముఖాన్ని నా నుండి దాచకండి, కోపంతో మీ దాసున్ని త్రోసివేయకండి; మీరే నాకు సహాయము. దేవా నా రక్షకా, నన్ను త్రోసివేయకండి నన్ను విడిచిపెట్టకండి. 10 నా తల్లిదండ్రులు నన్ను విడిచినా, యెహోవా నన్ను చేరదీస్తారు. 11 యెహోవా, మీ మార్గం నాకు బోధించండి; నాకు విరోధులు మాటున పొంచి ఉన్నారు, కాబట్టి మీరే నన్ను సరియైన దారిలో నడిపించాలి. 12 నా శత్రువుల కోరికకు నన్ను అప్పగించకండి, ఎందుకంటే అబద్ధ సాక్షులు నామీదికి లేచి, హానికరమైన ఆరోపణలను చేస్తున్నారు. 13 నేను దీనిపై నమ్మకంగా ఉన్నాను: సజీవులన్న చోట నేను యెహోవా మంచితనాన్ని చూస్తాను. 14 యెహోవా కోసం కనిపెట్టండి నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి యెహోవా కోసం కనిపెట్టండి. |
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.
Biblica, Inc.