కీర్తన 17 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథంకీర్తన 17 దావీదు ప్రార్థన. 1 యెహోవా, న్యాయమైన నా మనవి వినండి; నా మొర ఆలకించండి. నా ప్రార్థన వినండి అది మోసపూరితమైన పెదవుల నుండి రాలేదు. 2 నాకు న్యాయమైన తీర్పు మీ నుండి రావాలి; మీ కళ్లు సరియైన దాన్ని చూడాలి. 3 మీరు నా హృదయాన్ని పరిశీలించినప్పటికి, రాత్రివేళ మీరు నన్ను పరిశీలించి పరీక్షించినప్పటికీ, నాలో ఏ చెడు ఉద్దేశం మీకు కనబడలేదు; నా నోరు అతిక్రమించి మాట్లాడలేదు. 4 మనుష్యులు నాకు లంచం ఇవ్వాలని ప్రయత్నించినా, మీ పెదవులు ఆజ్ఞాపించిన దానిని బట్టి నేను హింసాత్మక మార్గాలకు దూరంగా ఉన్నాను. 5 నా అడుగులు మీ మార్గాల్లో నిలిచి ఉన్నాయి; నా పాదాలు తడబడలేదు. 6 నా దేవా! నేను మీకు మొరపెడతాను, మీరు నాకు జవాబిస్తారు; మీ చెవి నా వైపు త్రిప్పి నా ప్రార్థన ఆలకించండి. 7 మారని మీ ప్రేమలోని అద్భుతాలను నాకు చూపించండి, తమ శత్రువుల నుండి తప్పించుకోడానికి మిమ్మల్ని ఆశ్రయించే వారిని మీ కుడిచేతితో మీరు రక్షిస్తారు. 8-9 నన్ను నాశనం చేయాలని చూస్తున్న దుష్టుల నుండి, నన్ను చుట్టుముట్టి నా ప్రాణం తీయాలనుకుంటున్న శత్రువుల నుండి మీ కనుపాపలా నన్ను కాపాడండి; మీ రెక్కల నీడలో నన్ను దాచండి. 10 వారు తమ హృదయాలను కఠినం చేసుకున్నారు, వారి నోళ్ళు అహంకారంతో మాట్లాడతాయి. 11 వారు నన్ను పసిగట్టి నన్ను చుట్టుముట్టారు, నన్ను నేలకూల్చాలని చూస్తున్నారు. 12 వేట కోసం ఆకలిగొని ఉన్న సింహంలా, చాటున పొంచి ఉన్న కొదమసింహంలా వారు ఉన్నారు. 13 యెహోవా, లెండి, వారిని ఎదిరించండి, వారిని కూలద్రోయండి; మీ ఖడ్గంతో దుష్టుల నుండి నన్ను విడిపించండి. 14 ఈ జీవితకాలంలో మాత్రమే సంపదలు ఉన్న ఈ లోకసంబంధుల నుండి యెహోవా, మీ చేతితో నన్ను రక్షించండి. మీరు దుష్టుల కొరకు దాచిన దానితో వారి కడుపులను నింపుతారు; వారి పిల్లలు దానితో సంతృప్తి చెందుతారు, మిగిలిన దానిని తమ పిల్లలకు విడిచిపెడతారు. 15 నేనైతే, నీతిగలవాడనై మీ ముఖాన్ని చూస్తాను; నేను మేల్కొనినప్పుడు, మీ స్వరూపాన్ని చూస్తూ తృప్తి పొందుతాను. |
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.
Biblica, Inc.