కీర్తన 144 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథంకీర్తన 144 దావీదు కీర్తన. 1 నా కొండయైన యెహోవాకు స్తుతి కలుగును గాక, యుద్ధము కోసం నా చేతులకు శిక్షణ, నా వ్రేళ్ళకు పోరాటం నేర్పారు. 2 ఆయన నా ప్రేమగల దేవుడు, నా కోట, నా బలమైన కోట, నన్ను విడిపించేవారు. ఆయనే ప్రజలను నాకు లోబరచే, నా డాలు నా ఆశ్రయము. 3 యెహోవా, మనుష్యులు ఏపాటివారని లక్ష్యపెడుతున్నారు? వారి గురించి ఆలోచించడానికి మనుష్యులు ఏపాటివారు? 4 నరులు కేవలం ఊపిరిలాంటివారు; దాటిపోయే నీడలా వారి రోజులు ఉంటాయి. 5 యెహోవా ఆకాశాలను చీల్చుకొని క్రిందికి దిగిరండి; పర్వతాలు పొగలు వదిలేలా, వాటిని ముట్టండి. 6 మెరుపులు పంపించండి శత్రువులను చెదరగొట్టండి; బాణాలు వేసి వారిని ఓడించండి. 7 పైనుండి మీ చేయి చాపండి; గొప్ప జలాల నుండి, విదేశీయుల చేతుల్లో నుండి, నన్ను విడిపించండి. 8 వారి నోళ్ళ నిండ అబద్ధాలు, వారి కుడి చేతులు మోసకరమైనవి. 9 నా దేవా, మీకు ఒక క్రొత్త పాట పాడతాను. పదితంతు వీణతో మీకు సంగీతం చేస్తాను. 10 రాజులకు విజయమిచ్చేది, మీ సేవకుడైన దావీదును రక్షించేది మీరే. భయంకరమైన ఖడ్గము నుండి 11 నన్ను విడిపించండి; విదేశీయుల చేతుల నుండి నన్ను కాపాడండి వారి నోళ్ళ నిండ అబద్ధాలు, వారి కుడి చేతులు మోసకరమైనవి. 12 అప్పుడు మా పిల్లలు పెరిగిన మొక్కల్లా, తమ యవ్వన దశలో ఉంటారు. మా కుమార్తెలు, రాజభవనం అలంకరించడం కోసం చెక్కబడిన స్తంభాల్లా ఉంటారు. 13 మా కొట్లు అన్ని రకాల ధాన్యాలతో నిండి ఉంటాయి. మా పచ్చికబయళ్లలో గొర్రెల మందలు వేలల్లో, పది వేలల్లో విస్తరిస్తాయి. 14 మా ఎద్దులు బాగా బరువులు మోస్తాయి. గోడలు నాశనం కాకూడదు. చెరలోనికి వెళ్లకూడదు దుఃఖ ధ్వని వీధుల్లో వినబడ కూడదు. 15 ఇలాంటి స్థితిని అనుభవించే ప్రజలు ధన్యులు; యెహోవా తమకు దేవునిగా కలిగి ఉండే ప్రజలు ధన్యులు. |
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.
Biblica, Inc.