కీర్తన 138 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథంకీర్తన 138 దావీదు కీర్తన. 1 యెహోవా, నా పూర్ణహృదయంతో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను; “దేవుళ్ళ” ఎదుట నేను మీకు స్తుతులు పాడతాను. 2 మీ పరిశుద్ధాలయం వైపు నమస్కరిస్తూ, మీ మారని ప్రేమను బట్టి మీ నమ్మకత్వాన్ని బట్టి, మీ నామాన్ని స్తుతిస్తాను, ఎందుకంటే మీ ప్రఖ్యాతి కంటే మీ శాసనాలను మీరు అధికంగా ఘనపరిచారు. 3 నేను మొరపెట్టినప్పుడు మీరు నాకు జవాబిచ్చారు; మీరు నన్ను ధైర్యపరిచారు. 4 యెహోవా, భూరాజులందరూ మీ నోటి నుండి మీ శాసనాలు విన్నప్పుడు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. 5 యెహోవా మహిమ గొప్పది కాబట్టి, వారు యెహోవా యొక్క మార్గాల గురించి పాడుదురు గాక. 6 యెహోవా మహోన్నతుడైనప్పటికి ఆయన దీనులపై దయ చూపిస్తారు; ఆయన దూరం నుండే గర్విష్ఠులను పసిగడతారు. 7 నేను కష్టంలో చిక్కుకున్నా మీరు నా జీవితాన్ని కాపాడండి. నా శత్రువుల కోపం నుండి నన్ను కాపాడడానికి మీ చేతిని చాచారు; మీ కుడిచేతితో నన్ను రక్షిస్తారు. 8 యెహోవా నాకు శిక్ష విముక్తి చేస్తారు; యెహోవా, మీ మారని ప్రేమ శాశ్వతమైనది, మీ చేతిపనిని వదిలిపెట్టకండి. |
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.
Biblica, Inc.