కీర్తన 119 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథంకీర్తన 119 א ఆలెఫ్ א ఆలెఫ్ 1 నిందారహిత మార్గాలను అనుసరిస్తూ, యెహోవా ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకునేవారు ధన్యులు. 2 ఆయన శాసనాలను పాటిస్తూ తమ హృదయమంతటితో ఆయనను వెదకేవారు ధన్యులు, 3 వారు అన్యాయం చేయక ఆయన మార్గాలను అనుసరిస్తారు. 4 అత్యంత జాగ్రత్తగా పాటించాలని మీరు వారికి శాసనాలిచ్చారు. 5 మీ శాసనాలను అనుసరించుటలో నా మార్గాలు సుస్థిరమై ఉంటే ఎంత బాగుండేది! 6 అప్పుడు మీ ఆజ్ఞలను లక్ష్యపెట్టినప్పుడు నేను అవమానపాలు కాను. 7 నేను మీ నీతి న్యాయవిధులను తెలుసుకున్న కొలది యథార్థ హృదయంతో నేను మిమ్మల్ని స్తుతిస్తాను. 8 నేను మీ శాసనాలకు లోబడతాను. దయచేసి నన్ను పూర్తిగా ఎడబాయకండి. ב బేత్ ב బేత్ 9 యువత పవిత్ర మార్గంలో ఎలా ఉండగలరు? మీ వాక్యాన్ని అనుసరించి జీవించడం వల్లనే. 10 నేను నా హృదయమంతటితో మిమ్మల్ని వెదకుతున్నాను; మీ ఆజ్ఞల నుండి నన్ను తొలగిపోనివ్వకండి. 11 నేను మీకు విరోధంగా పాపం చేయకూడదని మీ వాక్యాన్ని నా హృదయంలో దాచుకున్నాను. 12 యెహోవా, మీకు స్తుతి కలుగును గాక; మీ శాసనాలను నాకు బోధించండి. 13 మీ నోట నుండి వచ్చే న్యాయవిధులన్నిటిని నా పెదవులతో వివరిస్తాను. 14 ఒకడు గొప్ప ఐశ్వర్యాన్ని బట్టి సంతోషించునట్లు నేను మీ శాసనాలను పాటించడంలో సంతోషిస్తాను. 15 మీ శాసనాలను నేను ధ్యానిస్తాను మీ మార్గాలను పరిగణిస్తాను. 16 మీ శాసనాలను బట్టి నేను ఆనందిస్తాను; నేను మీ వాక్యాన్ని నిర్లక్ష్యం చేయను. ג గీమెల్ ג గీమెల్ 17 నేను బ్రతికి ఉండి మీ వాక్యానికి లోబడేలా, మీ సేవకునిపట్ల దయగా ఉండండి. 18 మీ ధర్మశాస్త్రంలో ఉన్న ఆశ్చర్యకరమైన వాటిని నేను చూడగలిగేలా నా కళ్లు తెరవండి. 19 ఈ లోకంలో నేను అపరిచితున్ని; మీ ఆజ్ఞలను నా నుండి దాచిపెట్టకండి. 20 అన్నివేళల్లో మీ న్యాయవిధుల కోసం తపిస్తూ నా ప్రాణం క్షీణించిపోతుంది. 21 శపించబడినవారైన అహంకారులను మీరు గద్దిస్తారు, వారు మీ ఆజ్ఞల నుండి తొలగిపోయినవారు. 22 నేను మీ శాసనాలను పాటిస్తున్నాను, వారి అపహాస్యాన్ని ధిక్కారాన్ని నా నుండి తొలగించండి. 23 పాలకులు కలిసి కూర్చుని నన్ను అపవాదు చేసినప్పటికీ, మీ సేవకుడు మీ శాసనాలను ధ్యానిస్తాడు. 24 మీ శాసనాలే నాకు ఆనందం; అవి నాకు ఆలోచన చెప్తాయి. ד దాలెత్ ד దాలెత్ 25 నేను నేల మీద పడిపోయాను; మీ మాట ప్రకారం నా జీవితాన్ని కాపాడండి. 26 నా జీవిత పరిస్థితులను మీకు వివరించాను, మీరు నాకు జవాబిచ్చారు; మీ శాసనాలు నాకు బోధించండి. 27 నేను మీ కట్టడల అర్థాన్ని గ్రహించేలా చేయండి, తద్వారా మీ అద్భుత కార్యాలను నేను ధ్యానిస్తాను. 28 దుఃఖం చేత నా ప్రాణం క్రుంగిపోతుంది; మీ వాక్యం ద్వారా నన్ను బలపరచండి. 29 మోసపూరిత మార్గాల నుండి నన్ను తప్పించండి; నా మీద దయచూపి మీ ధర్మశాస్త్రం నాకు బోధించండి. 30 నేను నమ్మకత్వం అనే మార్గం ఎంచుకున్నాను; మీ న్యాయవిధులపై నా హృదయాన్ని నిలుపుకున్నాను. 31 యెహోవా, మీ శాసనాలను గట్టిగా పట్టుకుని ఉంటాను; నాకు అవమానం కలగనివ్వకండి. 32 మీ ఆజ్ఞల మార్గాన నేను పరుగెడతాను, ఎందుకంటే మీరు నా గ్రహింపును విశాలపరిచారు. ה హే ה హే 33 యెహోవా, మీ శాసనాల విధానాన్ని నాకు బోధించండి, అంతం వరకు నేను వాటిని అనుసరిస్తాను. 34 మీ ధర్మశాస్త్రం నేను అనుసరించేలా హృదయపూర్వకంగా వాటికి విధేయత చూపేలా, నాకు గ్రహింపు దయచేయండి. 35 మీ ఆజ్ఞల మార్గాన నన్ను నడిపించండి, అక్కడే నాకు ఆనందము. 36 నా హృదయాన్ని అన్యాయపు లాభం వైపు కాక మీ శాసనాల వైపుకు త్రిప్పండి. 37 పనికిరాని వాటినుండి నా కళ్లను త్రిప్పండి; మీ మార్గాల ద్వార నా జీవితాన్ని కాపాడండి. 38 మీ సేవకునిపట్ల మీ మాటను నెరవేర్చండి, తద్వారా ప్రజలు మిమ్మల్ని ఘనపరుస్తారు. 39 నాకు భయం కలిగిస్తున్న అవమానాన్ని తొలగించండి, ఎందుకంటే మీ న్యాయవిధులు మేలైనవి. 40 మీ కట్టడల కోసం నేను ఎంతగా తహతహ లాడుతున్నాను! మీ నీతిలో నా జీవితాన్ని కాపాడండి. ו వావ్ ו వావ్ 41 యెహోవా, మీ మారని ప్రేమ, మీ వాగ్దాన ప్రకారం, మీ రక్షణ నాకు వచ్చును గాక. 42 అప్పుడు నన్ను నిందించే వారెవరికైనా నేను సమాధానం చెప్పగలను, ఎందుకంటే మీ మాట మీద నాకు నమ్మకము. 43 మీ సత్య వాక్యాన్ని ఎప్పుడూ నా నోటి నుండి తీసివేయకండి, ఎందుకంటే నేను మీ న్యాయవిధులలో నా నిరీక్షణ ఉంచాను. 44 నేను ఎల్లప్పుడు అంటే నిరంతరం, మీ ధర్మశాస్త్రానికి లోబడతాను. 45 నేను మీ కట్టడలను వెదికాను, కాబట్టి స్వేచ్ఛలో నడుచుకుంటాను. 46 రాజుల ఎదుట కూడా నేను మీ శాసనాల గురించి మాట్లాడతాను నేను సిగ్గుపడను, 47 నేను మీ ఆజ్ఞలలో ఆనందిస్తాను ఎందుకంటే అవంటే నాకు ప్రేమ. 48 నేను ప్రేమించే మీ ఆజ్ఞల వైపు నా చేతులెత్తుతాను, తద్వారా నేను మీ శాసనాలను ధ్యానిస్తాను. ז జాయిన్ ז జాయిన్ 49 మీ సేవకునికి మీరిచ్చిన మాట జ్ఞాపకం చేసుకోండి, ఎందుకంటే మీరు నాకు నిరీక్షణ కలిగించారు. 50 నా శ్రమలో నా ఆదరణ ఇదే: మీ వాగ్దానం నన్ను బ్రతికిస్తుంది. 51 అహంకారులు కనికరం లేకుండా నన్ను ఎగతాళి చేస్తున్నారు, కాని నేను మీ ధర్మశాస్త్రం నుండి తిరిగిపోను. 52 యెహోవా, మీ అనాది న్యాయవిధులు నాకు జ్ఞాపకం ఉన్నాయి, వాటిలో నాకెంతో ఆదరణ. 53 మీ ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టిన దుష్టులను బట్టి, నాకు చాలా కోపం వస్తుంది. 54 నేను ఎక్కడ బస చేసినా మీ శాసనాలే నా పాటల సారాంశము. 55 యెహోవా, నేను నీ ధర్మశాస్త్రాన్ని పాటించడానికి రాత్రివేళ మీ పేరును జ్ఞాపకం చేసుకుంటున్నాను. 56 నేను మీ కట్టడలకు విధేయత చూపుతాను ఇది నాకు అభ్యాసంగా ఉన్నది. ח హేత్ ח హేత్ 57 యెహోవా, మీరే నా వాటా; మీ మాటలకు లోబడతానని నేను మాటిచ్చాను. 58 నేను నా హృదయపూర్వకంగా మీ దయ కోసం వెదికాను; మీ వాగ్దానం మేరకు నా మీద దయచూపండి. 59 నేను నా మార్గాలను గమనించి నా అడుగులను మీ శాసనాల వైపుకు త్రిప్పుకున్నాను. 60 మీ ఆజ్ఞలను అనుసరించడానికి నేను ఆలస్యం చేయకుండ త్వరపడతాను. 61 దుష్టులు నన్ను త్రాళ్లతో ఉచ్చులా బిగించినా, నేను మీ ధర్మశాస్త్రం మరచిపోను. 62 మీ నీతిగల న్యాయవిధులను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లించడానికి నేను మధ్యరాత్రి లేస్తున్నాను. 63 మీకు భయపడేవారందరికి, మీ కట్టడలను అనుసరించే వారందరికి నేను స్నేహితుడను. 64 యెహోవా, ఈ లోకమంతా మీ మారని ప్రేమ చేత నిండి ఉంది; మీ శాసనాలు నాకు బోధించండి. ט టేత్ ט టేత్ 65 యెహోవా, మీ మాట ప్రకారం మీ సేవకునికి మేలు చేయండి. 66 నేను మీ ఆజ్ఞలను నమ్ముకున్నాను, నాకు సరియైన వివేచనను గ్రహింపును బోధించండి. 67 నాకు బాధ కలుగకముందు నేను త్రోవ తప్పి తిరిగాను, కాని ఇప్పుడు నేను మీ వాక్కుకు లోబడుతున్నాను. 68 మీరు మంచివారు, మీరు మంచి చేస్తారు; మీ శాసనాలు నాకు బోధించండి. 69 అహంకారులు నన్ను అబద్ధాలతో అరిచినప్పటికీ, నేను హృదయపూర్వకంగా మీ కట్టడలను అనుసరిస్తాను. 70 వారి హృదయాలు క్రొవ్వులా మందగించాయి, కాని నేను మీ ధర్మశాస్త్రంలోనే ఆనందిస్తాను. 71 నాకు బాధ కలగడం మేలైంది తద్వారా నేను మీ శాసనాలు నేర్చుకోగలను. 72 వేలాది వెండి బంగారు నాణేలకంటే మీ నోట నుండి వచ్చిన ధర్మశాస్త్రం నాకు అమూల్యమైనది. י యోద్ י యోద్ 73 మీ హస్తములు నన్ను నిర్మించి నన్ను రూపించాయి; మీ ఆజ్ఞలను నేర్చుకునేలా నాకు గ్రహింపును ఇవ్వండి. 74 మీకు భయపడేవారు నన్ను చూసినప్పుడు సంతోషించుదురు గాక, ఎందుకంటే నేను మీ మాటలో నా నిరీక్షణ ఉంచాను. 75 యెహోవా, మీ న్యాయవిధులు నీతిగలవని నాకు తెలుసు, నమ్మకత్వంలో మీరు నన్ను బాధించారని నాకు తెలుసు. 76 మీ సేవకునికి మీరు ఇచ్చిన వాగ్దాన ప్రకారం, మీ మారని ప్రేమ నాకు ఆదరణ కలిగిస్తుంది. 77 నేను బ్రతికేలా మీ కనికరం నా దగ్గరకు రానివ్వండి, మీ ధర్మశాస్త్రంలోనే నాకు ఆనందము. 78 కారణం లేకుండా నాకు అన్యాయం చేసినందుకు అహంకారులు అవమానపరచబడుదురు గాక; కాని నేను మీ కట్టడలను ధ్యానిస్తాను. 79 మీకు భయపడేవారు, మీ శాసనాలు గ్రహించేవారు నా వైపు తిరుగుదురు గాక. 80 నేను అవమానానికి గురి కాకుండ, మీ శాసనాలను పూర్ణహృదయంతో అనుసరించి నిందారహితునిగా ఉంటాను. כ కఫ్ כ కఫ్ 81 మీరు కలిగించే రక్షణ కోసం ఎదురుచూస్తూ నా ప్రాణం సొమ్మసిల్లి పోతుంది; కాని నేను మీ మాట మీద నిరీక్షణ కలిగి ఉన్నాను. 82 మీ వాగ్దానం కోసం ఎదురుచూస్తూ నా కళ్లు క్షీణిస్తున్నాయి; “మీరు నన్ను ఎప్పుడు ఆదరిస్తారు?” అని నేను అంటాను. 83 నేను పొగలో ఆరిన ద్రాక్ష తిత్తిలా ఉన్నా, నేను మీ శాసనాలను మరువను. 84 మీ సేవకుడు ఎన్నాళ్ళు బ్రతుకుతాడు? నన్ను హింసించేవారిని మీరు ఎప్పుడు శిక్షిస్తారు? 85 అహంకారులు మీ ధర్మశాస్త్రానికి విరుద్ధంగా, నన్ను చిక్కించుకోడానికి గుంటలు త్రవ్వారు. 86 మీ ఆజ్ఞలన్నీ నమ్మదగినవి; నేను నిష్కారణంగా హింసింపబడుచున్నాను, నాకు సహాయం చేయండి. 87 వారు దాదాపు నన్ను ఈ భూమి మీద లేకుండ చేసేసారు, అయితే నేను మీ కట్టడలను విడిచిపెట్టలేదు. 88 మీ మారని ప్రేమతో నా జీవితాన్ని కాపాడండి, తద్వార మీ నోటి శాసనాలను నేను పాటిస్తాను. ל లామెద్ ל లామెద్ 89 యెహోవా! మీ వాక్కు శాశ్వతం; అది పరలోకంలో సుస్థిరంగా ఉంది. 90 మీ నమ్మకత్వం తరతరాలకు నిలుస్తుంది. మీరు భూమిని స్థాపించారు, అది సుస్థిరంగా ఉంటుంది. 91 మీ న్యాయవిధులు ఈ రోజు వరకు కొనసాగుతాయి, ఎందుకంటే అన్ని మీకు సేవ చేస్తాయి. 92 ఒకవేళ మీ ధర్మశాస్త్రం నా ఆనందమై ఉండకపోతే, నేను బాధలో నశించి పోయి ఉండేవాన్ని. 93 నేను మీ కట్టడలు ఎన్నడు మరువను, ఎందుకంటే వాటి ద్వార మీరు నా జీవితాన్ని కాపాడారు. 94 నేను మీ వాడను, నన్ను రక్షించండి; నేను మీ కట్టడలను వెదికాను. 95 దుష్టులు నన్ను చంపాలని కాచుకుని ఉన్నారు, కాని నేనైతే మీ శాసనాలను గురించి ఆలోచిస్తాను. 96 సంపూర్ణతకు కూడా ఉంది పరిమితి! కానీ, మీ ధర్మశాస్త్రోపదేశం అపరిమితము. מ మేమ్ מ మేమ్ 97 ఓ, మీ ధర్మశాస్త్రం అంటే నాకెంత ఇష్టమో! నేను రోజంతా దానిని ధ్యానిస్తాను. 98 మీ ఆజ్ఞలు ఎల్లప్పుడు నాతో ఉండి నా శత్రువుల కన్నా నన్ను జ్ఞానిగా చేస్తాయి. 99 నేను మీ శాసనాలను ధ్యానిస్తాను కాబట్టి నా ఉపదేశకులందరి కంటే నేను ఎక్కువ పరిజ్ఞానం కలిగి ఉన్నాను. 100 నేను మీ కట్టడలను ఆచరిస్తాను కాబట్టి వృద్ధులకు మించిన గ్రహింపు నేను కలిగి ఉన్నాను. 101 మీ వాక్యం చెప్పినట్లే చేద్దామని చెడు మార్గాల నుండి నా పాదాలు తొలగించుకున్నాను. 102 నేను మీ ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టలేదు, ఎందుకంటే మీరే నాకు బోధించారు. 103 మీ వాక్కులు నా నోటికి ఎంతో మధురం, అవి తేనెకంటె తియ్యనివి! 104 మీ కట్టడల వల్ల నేను గ్రహింపు పొందాను; కాబట్టి తప్పుడు త్రోవలంటే నాకు అసహ్యము. נ నూన్ נ నూన్ 105 మీ వాక్కు నా పాదాలకు దీపం, నా త్రోవకు వెలుగు. 106 నేను మీ నీతిగల న్యాయవిధులను పాటిస్తానని ప్రమాణం చేసి ధృవీకరించాను. 107 యెహోవా, నేను చాలా బాధపడ్డాను; మీ వాక్కు ప్రకారం నా జీవితాన్ని కాపాడండి. 108 యెహోవా, నా నోటి యొక్క ఇష్టపూర్వకమైన స్తుతిని స్వీకరించండి, మీ న్యాయవిధులు నాకు బోధించండి. 109 నేను నిరంతరం నా జీవితాన్ని నా చేతుల్లోకి తీసుకున్నప్పటికీ, నేను మీ ధర్మశాస్త్రాన్ని మరవను. 110 దుష్టులు నన్ను చిక్కించుకోవాలని ఉరులు ఒడ్డారు, అయినా నేను మాత్రం మీ కట్టడల నుండి తొలగిపోలేదు. 111 మీ శాసనాలు నాకు శాశ్వత వారసత్వం; అవి నా హృదయానికి ఆనందం. 112 అంతం వరకు మీ శాసనాలను పాటించాలని నేను నా హృదయాన్ని నిలుపుకున్నాను. ס సామెక్ ס సామెక్ 113 ద్విమనస్కులంటే నాకు అసహ్యం, కాని మీ ధర్మశాస్త్రం నాకు ఇష్టం. 114 మీరు నా ఆశ్రయం నా డాలు; నేను మీ మాటలో నిరీక్షణ ఉంచాను. 115 నేను నా దేవుని ఆజ్ఞలను పాటించేలా, కీడుచేసేవారలారా, నాకు దూరంగా ఉండండి! 116 మీ వాగ్దానం ప్రకారం నన్నాదుకోండి, నేను బ్రతుకుతాను; నా నిరీక్షణను బద్దలు కానివ్వకండి. 117 నన్ను ఎత్తిపట్టుకోండి, నేను విడిపించబడతాను; మీ శాసనాలను నేను ఎల్లప్పుడు గౌరవిస్తాను. 118 మీ శాసనాల నుండి తప్పుకున్న వారిని మీరు తిరస్కరిస్తారు, వారి భ్రమలు ఏమీ కాకుండా పోతాయి. 119 భూమి మీద ఉన్న దుష్టులందరిని మీరు లోహపు మడ్డిలా విస్మరిస్తారు; కాబట్టి నేను మీ శాసనాలను ప్రేమిస్తాను. 120 మీ భయానికి నా శరీరం వణకుతుంది; మీ న్యాయవిధులకు నేను భయపడుతున్నాను. ע అయిన్ ע అయిన్ 121 నేను నీతియుక్తమైనది న్యాయమైనది చేశాను; నన్ను బాధించేవారికి నన్ను వదిలేయకండి. 122 మీ సేవకుడి శ్రేయస్సుకు హామీ ఇవ్వండి; అహంకారులు నన్ను అణచివేయనివ్వకండి. 123 మీ నీతియుక్తమైన వాగ్దానం కోసం, మీ రక్షణ కోసం ఎదురుచూస్తూ, నా కళ్లు క్షీణిస్తున్నాయి. 124 మీ మారని ప్రేమకు తగినట్టుగా మీ సేవకునితో వ్యవహరించండి అలాగే మీ శాసనాలు నాకు బోధించండి. 125 నేను మీ సేవకుడను; మీ శాసనాలు నేను గ్రహించేలా నాకు వివేచన ఇవ్వండి. 126 మీ ధర్మశాస్త్రం ఉల్లంఘించబడుతుంది; యెహోవా, మీరు చర్య తీసుకోవలసిన సమయం ఇదే. 127 ఎందుకంటే నేను మీ ఆజ్ఞలను బంగారం కంటే, మేలిమి బంగారం కంటే ఎక్కువ ప్రేమిస్తాను, 128 నేను మీ కట్టడలన్నిటిని యథార్థమైనవిగా పరిగణిస్తాను, ప్రతి తప్పుడు మార్గం నాకసహ్యము. פపే פపే 129 మీ శాసనాలు అద్భుతం; కాబట్టి నేను వాటికి లోబడతాను. 130 మీ వాక్కులు వెల్లడి అవడంతోనే వెలుగు ప్రకాశిస్తుంది. అది సామాన్యులకు గ్రహింపునిస్తుంది. 131 మీ ఆజ్ఞల కోసం ఆరాటపడుతూ, నేను నా నోరు తెరిచి రొప్పుతున్నాను. 132 మీ పేరును ఇష్టపడేవారికి మీరు ఎప్పుడూ చేసినట్టు, నా వైపు తిరిగి నాపై దయచూపండి. 133 మీ వాక్కు ప్రకారం నా అడుగుజాడలను నిర్దేశించండి; ఏ దుష్టత్వం నన్ను ఏలకుండును గాక. 134 నేను మీ కట్టడలకు లోబడేలా, మనుష్యుల దౌర్జన్యం నుండి విడిపించండి. 135 మీ సేవకుడి మీద మీ ముఖకాంతిని ప్రకాశింపనివ్వండి మీ శాసనాలను నాకు బోధించండి. 136 ప్రజలు మీ ధర్మశాస్త్రానికి లోబడకపోవడం చూసి, నా కళ్ల నుండి కన్నీరు ప్రవహిస్తుంది. צ సాదె צ సాదె 137 యెహోవా, మీరు నీతిమంతులు, మీ న్యాయవిధులు యథార్థమైనవి. 138 మీరు విధించిన శాసనాలు నీతియుక్తమైనవి; అవి పూర్తిగా నమ్మదగినవి. 139 నా శత్రువులు మీ మాటలను విస్మరిస్తారు కాబట్టి, నా ఆసక్తి నన్ను తినేస్తుంది. 140 మీ వాగ్దానాలు పూర్తిగా పరీక్షించబడ్డాయి, మీ సేవకుడు వాటిని ప్రేమిస్తాడు. 141 నేను అల్పుడనైనా, తృణీకరించబడినా, నేను మీ కట్టడలు మరచిపోను. 142 మీ నీతి శాశ్వతమైనది మీ ధర్మశాస్త్రం సత్యమైనది. 143 ఇబ్బంది, బాధ నా మీదికి వచ్చాయి, కాని మీ ఆజ్ఞలు నాకు ఆనందాన్ని ఇస్తాయి. 144 మీ శాసనాలు ఎల్లప్పుడు నీతియుక్తమైనవి; నేను బ్రతికేలా నాకు గ్రహింపు ఇవ్వండి. ק ఖాఫ్ ק ఖాఫ్ 145 యెహోవా, నా హృదయమంతటితో నేను మొరపెడుతున్నాను; నాకు జవాబివ్వండి, నేను మీ శాసనాలకు లోబడతాను. 146 నేను మీకు మొరపెడతాను; నన్ను రక్షించండి నేను మీ శాసనాలను పాటిస్తాను. 147 నేను తెల్లవారక ముందే లేచి సహాయం కోసం మొరపెడతాను; నేను మీ వాక్కులలో నిరీక్షణ ఉంచాను. 148 మీ వాగ్దానాలను నేను ధ్యానించేలా, రాత్రి జాములంతా నా కళ్లు తెరిచి ఉంటాయి. 149 మీ మారని ప్రేమను బట్టి నా స్వరాన్ని వినండి; యెహోవా, మీ న్యాయవిధుల ప్రకారం నా జీవితాన్ని కాపాడండి. 150 దుష్ట పథకాలను రూపొందించే వారు దగ్గరలో ఉన్నారు, కాని వారు మీ ధర్మశాస్త్రానికి దూరంగా ఉన్నారు. 151 అయినాసరే యెహోవా, మీరు నా దగ్గరే ఉన్నారు, మీ ఆజ్ఞలన్నీ నిజం. 152 మీ శాసనాలు నిత్యం నిలిచి ఉండేలా మీరు స్థాపించారని, చాలా కాలం క్రితం నేను తెలుసుకున్నాను. ר రేష్ ר రేష్ 153 నా శ్రమను చూసి నన్ను విడిపించండి, ఎందుకంటే నేను మీ ధర్మశాస్త్రాన్ని మరవలేదు. 154 నా కారణాన్ని సమర్థించి నన్ను విమోచించండి; మీ వాగ్దాన ప్రకారం నా జీవితాన్ని కాపాడండి. 155 రక్షణ దుష్టులకు దూరం, ఎందుకంటే వారు మీ శాసనాలు వెదకరు. 156 యెహోవా, మీ కనికరం గొప్పది; మీ న్యాయవిధులను బట్టి నా జీవితాన్ని కాపాడండి. 157 నన్ను హింసించే శత్రువులు చాలామంది, అయినా నేను మీ శాసనాల నుండి తప్పుకోలేదు. 158 నేను ద్రోహులను అసహ్యంగా చూస్తాను, ఎందుకంటే వారు మీ వాక్కుకు లోబడరు. 159 నేను మీ కట్టడలు ఎంతగా ప్రేమిస్తున్నానో చూడండి; యెహోవా, మీ మారని ప్రేమ చేత, నా జీవితాన్ని కాపాడండి. 160 మీ వాక్కులన్నీ నిజం; మీ నీతియుక్తమైన న్యాయవిధులు నిత్యం నిలుస్తాయి. ש సిన్ లేక షీన్ ש సిన్ లేక షీన్ 161 కారణం లేకుండ అధికారులు నన్ను హింసిస్తున్నారు, అయినా నా హృదయం మీ వాక్కుకు వణికిపోతుంది. 162 ఒకడు దోపుడుసొమ్మును చూసి సంతోషించినట్లు నేను మీ వాగ్దానాన్ని బట్టి సంతోషిస్తాను. 163 అబద్ధం అంటే నాకు అసహ్యం ద్వేషం కాని మీ ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తాను. 164 రోజుకు ఏడుసార్లు మిమ్మల్ని స్తుతిస్తాను ఎందుకంటే మీ న్యాయవిధులు నీతియుక్తమైనవి. 165 మీ ధర్మశాస్త్రాన్ని ప్రేమించేవారు గొప్ప సమాధానం కలిగి ఉంటారు, ఏదీ వారిని తొట్రిల్లేలా చేయలేదు. 166 యెహోవా! మీ రక్షణ కోసం నేను ఎదురుచూస్తాను, నేను మీ ఆజ్ఞలను అనుసరిస్తాను. 167 నేను మీ శాసనాలను పాటిస్తాను, ఎందుకంటే నేను వాటిని ఎంతగానో ప్రేమిస్తాను. 168 నేను మీ కట్టడలకు మీ శాసనాలకు లోబడతాను, ఎందుకంటే నా మార్గాలన్నీ మీకు తెలుసు. ת తౌ ת తౌ 169 యెహోవా, నా మొర మీ సన్నిధికి చేరును గాక; మీ మాట ప్రకారం నాకు గ్రహింపును దయచేయండి. 170 నా విన్నపం మీ సన్నిధికి చేరును గాక; మీ వాగ్దానం ప్రకారం నన్ను విడిపించండి. 171 నా పెదవులు స్తుతితో పొంగిపారును గాక, ఎందుకంటే మీరు మీ శాసనాలను నాకు బోధిస్తారు. 172 నా నాలుక మీ మాటను పాడును గాక, ఎందుకంటే మీ ఆజ్ఞలన్నియు నీతియుక్తమైనవి. 173 మీ చేయి నాకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉండును గాక, ఎందుకంటే నేను మీ కట్టడలను ఎంచుకున్నాను. 174 యెహోవా, నేను మీ రక్షణ కోసం ఆశతో ఎదురు చూస్తున్నాను, మీ ధర్మశాస్త్రం నాకెంతో ఆనందాన్నిస్తుంది. 175 నేను మిమ్మల్ని స్తుతించేలా నన్ను బ్రతకనివ్వండి, మీ న్యాయవిధులు నన్ను సంరక్షిస్తాయి. 176 నేను తప్పిపోయిన గొర్రెలా తిరుగుతున్నాను. మీ సేవకుడిని వెదకండి, నేను మీ ఆజ్ఞలను మరవలేదు. |
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.
Biblica, Inc.