Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

కీర్తన 106 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


కీర్తన 106

1 యెహోవాను స్తుతించండి. యెహోవా మంచివాడు, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి; ఆయన మారని ప్రేమ నిరంతరం నిలుస్తుంది.

2 యెహోవా యొక్క గొప్ప కార్యాలను ఎవరు ప్రచురించగలరు? ఆయన స్తుతిని సంపూర్ణంగా ఎవరు ప్రకటిస్తారు?

3 న్యాయంగా ప్రవర్తించేవారు ధన్యులు, వారు ఎల్లప్పుడు సరియైనది చేస్తారు.

4 యెహోవా, మీ ప్రజలపై మీరు దయ చూపినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి, మీరు వారిని రక్షించినప్పుడు నాకు సాయం చేయడానికి రండి,

5 మీరు ఏర్పరచుకున్న వారి అభివృద్ధిని నేను ఆస్వాదించగలను, మీ దేశము యొక్క ఆనందంలో పాలుపంచుకోగలను మిమ్మల్ని స్తుతించడంలో మీ వారసులతో చేరతాను.

6 మా పూర్వికుల్లాగే మేమూ పాపాలు చేశాము; మేము తప్పు చేశాం దుష్టత్వంతో ప్రవర్తించాం.

7 మా పూర్వికులు ఈజిప్టులో ఉన్నప్పుడు నేను చేసిన అద్భుతాలను గ్రహించలేదు; మీ దయాసమృద్ధిని వారు తలపోయ లేదు, ఎర్ర సముద్రం దగ్గర తిరుగుబాటు చేశారు.

8 అయినా ఆయన తన బలప్రభావాలను తెలియపరచడానికి, తన పేరు కోసం వారిని రక్షించాడు.

9 ఎర్ర సముద్రాన్ని గద్దించాడు. అది ఎండిపోయింది; ఎడారిలో నడిచినట్లే జలాగాధంలో వారు నడిచారు. దేవుడు వారిని నడిపించాడు.

10 పగవారి బారి నుండి దేవుడే వారిని తప్పించాడు; విడుదల ప్రసాదించాడు.

11 విరోధులంతా నీటిలో మునిగి చచ్చారు. ఒక్కడూ మిగల్లేదు.

12 ఇశ్రాయేలీయులు అప్పుడు కాని దేవుని మాట నమ్మలేదు. స్తుతిస్తూ పాటలు పాడారు.

13 దేవుని క్రియలు వారు త్వరలోనే మరచిపోయారు. ఆయన సలహాలను వారు లక్ష్యపెట్టు వారు కారు.

14 ఎడారిలో పేరాశకు లోనయ్యారు; పాడు ప్రదేశమది. దేవుడిని శోధించారు.

15 దేవుడు వారి కోరిక తీర్చాడు, అయినా వారి ప్రాణాలు క్షీణించిపోయాయి.

16 దండులో మోషే మీద, యెహోవాకు పరిశుద్ధుడైన, అహరోను మీద అసూయ ఏర్పడింది.

17 భూమి నోరు తెరిచి దాతానును మ్రింగివేసింది; అబీరాము గుంపును కప్పేసింది.

18 వారి అనుచరులలో మంటలు చెలరేగాయి; ఒక జ్వాల దుష్టులను కాల్చివేసింది.

19 హోరేబు పర్వతం దగ్గర వారు దూడ విగ్రహం చేయించుకున్నారు. పోత విగ్రహం ముందు విగ్రహారాధన చేశారు.

20 వారు మహిమగల దేవునికి బదులు తుక్కు మేసే ఎద్దు బొమ్మను ఉంచారు.

21 వారిని రక్షించిన దేవున్ని, ఈజిప్టులో ఆయన చేసిన గొప్ప కార్యాలను వారు మరచిపోయారు,

22 హాము దేశంలో అద్భుతకార్యాలు ఎర్ర సముద్రం ఒడ్డున ఆయన చేసిన భీకర క్రియలు.

23 “వీరిని నాశనం చేస్తాను” అన్నాడు దేవుడు. మోషే దేవుడు ఎన్నుకున్న వ్యక్తి. ఆయన వచ్చి దేవుని ఎదుట సందులో నిలిచి విజ్ఞాపన చేస్తే ఆయన ఉగ్రత వారిని ధ్వంసం చేయకుండా ఆపింది.

24 మనోహరమైన దేశాన్ని వారు తిరస్కరించారు; వారాయన మాట నమ్మలేదు.

25 యెహోవా మాట వినక, డేరాలలో సణగ సాగారు.

26 కాబట్టి ఆయన తన చేయెత్తి, వారిని ఎడారిలో పతనమయ్యేలా చేస్తాను,

27 వారి సంతతివారిని దేశాల మధ్య పతనమయ్యేలా చేస్తాను, దేశాలకు వారిని చెదరగొడతాను, అని ప్రమాణం చేశారు.

28 వారు బయల్-పెయోరు దగ్గరి విగ్రహం దగ్గర చేరారు. నిర్జీవ విగ్రహాలకు పెట్టిన నైవేద్య బలులు తిన్నారు.

29 తమ దుష్ట చర్యల చేత వారు దేవునికి కోపం రేపారు. అందుకు వారి మధ్యకు తెగులు మొదలైంది.

30 ఫీనెహాసు నిలిచి, న్యాయం చెప్పాడు. అపరాధులను శిక్షించాడు. తెగులు ఆగిపోయింది.

31 అది అంతులేని తరాలకు అతనికి నీతిగా ఎంచబడింది.

32 మెరీబా నీళ్ల దగ్గర వారంతా దేవుని కోపాగ్ని రేపారు, వారి మూలంగా మోషేకు బాధ.

33 వారు దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు, అతని పెదవుల వెంట కాని మాటలు వచ్చాయి.

34 యెహోవా నాశనం చేస్తానన్న జాతులను వీరు విడిచిపెట్టారు.

35 ఇతర జనాంగాలలో కలిసిపోయి, వారి జీవిత విధానాలు నేర్చుకున్నారు.

36 వారి విగ్రహాలను పూజించారు. అవే వారికి ఉరి అయ్యాయి.

37 తమ కుమారులను, కుమార్తెలను దయ్యానికి బలి ఇచ్చారు.

38 నిరపరాధుల రక్తం, తమ కుమారుల రక్తం, కుమార్తెల రక్తం వారు చిందించారు. కనాను దేశపు విగ్రహాలకు తమ సొంత పిల్లల్ని బలి ఇచ్చారు. ఈ రక్తపాతం చేత దేశమంతా అపవిత్రమైనది.

39 వారు తమ దుష్ట క్రియల చేత అపవిత్రులయ్యారు; విగ్రహాల మీద వారికి గల ప్రేమ యెహోవా దృష్టిలో వ్యభిచారము చేశారు.

40 యెహోవా కోపం వారి మీదికి వచ్చింది, తన వారసత్వం తన ప్రజలు అయినా వారంటే ఆయనకు అసహ్యం వేసింది.

41 ఇతర దేశాలకు వారిని అప్పగించాడు. అయినా వారి మీద ప్రభుత్వం చేశారు.

42 శత్రువులే వారిని అణగద్రొక్కారు వారి చేతి క్రింద తల వొగ్గారు.

43 చాలాసార్లు ఆయన విడిపించాడు, అయినా వారి తిరుగుబాటు ఆలోచనలు కార్యరూపం దాల్చాయి. తిరగబడి, అపరాధులై, దురవస్థ చెందారు.

44 అయినా వారు మొరపెట్టగానే ఆయన విన్నాడు. వారి కష్టంను చూచాడు.

45 దేవుడు తన నిబంధనను తలచుకొన్నాడు. వారి నిమిత్తం జ్ఞాపకం చేసుకున్నాడు. తన మారని ప్రేమను బట్టి వారిని కనికరించాడు.

46 చెరపట్టిన వారికి వీరి మీద జాలి కలిగింది. అది దైవనిర్ణయమే.

47 మా దేవా యెహోవా, మమ్మల్ని రక్షించండి; ఇతర దేశాల మధ్య నుండి మమ్మల్ని సమకూర్చండి, అప్పుడు మేము మీ పరిశుద్ధ నామానికి కృతజ్ఞతలు చెల్లిస్తాం, మిమ్మల్ని స్తుతించడంలో అతిశయిస్తాం.

48 ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు స్తుతి కలుగును గాక! ప్రజలంతా, “ఆమేన్!” అనాలి. యెహోవాను స్తుతించండి!

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan