Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

కీర్తన 103 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


కీర్తన 103
దావీదు కీర్తన.

1 నా ప్రాణమా, యెహోవాను స్తుతించు; నాలోని సమస్తమా, ఆయన పవిత్ర నామాన్ని స్తుతించు.

2 నా ప్రాణమా, యెహోవాను స్తుతించు, ఆయన ఉపకారాలలో ఏదీ మరచిపోవద్దు.

3 ఆయన నీ పాపాలను క్షమిస్తారు, నీ రోగాలను స్వస్థపరుస్తారు.

4 నరకంలో నుండి నీ ప్రాణాన్ని విడిపిస్తారు నీ తలపై ప్రేమ వాత్సల్య కిరీటం ధరింపచేస్తారు,

5 నీ యవ్వనం గ్రద్ద యవ్వనంలా క్రొత్తగా ఉండేలా, మంచి ఈవులతో నీ కోరికలను తృప్తిపరుస్తారు.

6 అణగారిన వారికందరికి యెహోవా నీతిని న్యాయాన్ని జరిగిస్తారు.

7 ఆయన మోషేకు తన మార్గాలను, ఇశ్రాయేలీయులకు తన క్రియలను తెలియజేశారు.

8 యెహోవా కృపా కనికరం గలవారు, త్వరగా కోప్పడరు, అపారమైన ప్రేమ గలవారు.

9 ఆయన ఎల్లప్పుడూ మనమీద నేరారోపణ చేయరు, శాశ్వతంగా కోపం పెట్టుకోరు;

10 మన పాపాలకు తగినట్లుగా ఆయన మనతో వ్యవహరించలేదు మన దోషాలకు ప్రతిగా మనకు తిరిగి చెల్లించలేదు.

11 భూమికంటె ఆకాశం ఎంత ఎత్తున ఉందో, తనకు భయపడేవారి పట్ల ఆయన ప్రేమ అంత ఉన్నతం.

12 పడమటికి తూర్పు ఎంత దూరమో, అంత దూరం ఆయన మన అతిక్రమాలను తొలగించారు.

13 తండ్రి తన పిల్లల మీద కనికరం కలిగి ఉన్నట్లు, తనకు భయపడేవారి పట్ల యెహోవా కనికరం కలిగి ఉన్నారు;

14 మనం ఎలా రూపించబడ్డామో ఆయనకు తెలుసు, మనం మట్టి అని ఆయనకు తెలుసు.

15 మానవుల జీవితం గడ్డిలాంటిది, పొలంలో పువ్వు పూసినట్లు పూస్తారు;

16 దాని మీద గాలి వీస్తే అది లేకుండా పోతుంది, దాని చోటుకు అది జ్ఞాపకం కూడా ఉండదు.

17 ఆయనకు భయపడేవారి పట్ల యెహోవా మారని ప్రేమ వారి పిల్లల పట్ల ఆయన నీతి నిత్యం నిలిచి ఉంటుంది,

18 ఆయన నిబంధనను పాటించేవారిపట్ల, ఆయన కట్టడలను అనుసరించేవారి పట్ల ఉంటుంది.

19 యెహోవా పరలోకంలో తన సింహాసనాన్ని సుస్థిరం చేశారు, ఆయన రాజ్యం అందరి మీద పరిపాలన చేస్తున్నారు.

20 యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞలను ఆలకించి, ఆయన మాటలను నెరవేర్చే బలశూరులైన దూతలారా, ఆయనను స్తుతించండి.

21 యెహోవా సైన్యమా, ఆయన చిత్తం నెరవేర్చే సేవకులారా, మీరంతా యెహోవాను స్తుతించండి.

22 ప్రతిచోట ఆయన పరిపాలనలో ఉన్న సర్వ సృష్టి యెహోవాను స్తుతించండి. నా ప్రాణమా, యెహోవాను స్తుతించు.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan