Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

కీర్తన 10 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


కీర్తన 10

1 యెహోవా, ఎందుకు దూరంగా నిలిచి ఉన్నారు? నేను కష్టంలో ఉన్నప్పుడు మీరెందుకు దాక్కుంటారు?

2 దుష్టులు తమ అహంకారంలో దీనులను వేటాడతారు, వారు ఇతరుల కోసం పన్నిన కుట్రలో వారే చిక్కుకుంటారు.

3 వారు తమ హృదయ కోరికలను బట్టి అతిశయిస్తారు; వారు అత్యాశపరులను దీవిస్తారు, యెహోవాను దూషిస్తారు.

4 దుష్టులు తమ అహంకారంలో దేవున్ని వెదకరు; వారి ఆలోచనల్లో దేవునికి చోటు లేదు.

5 వారి మార్గాలు ఎప్పటికీ క్షేమంగా ఉంటాయి; వారు మీ న్యాయవిధులను తిరస్కరించారు; వారు తమ శత్రువులందరినీ హేళనగా చూస్తారు.

6 “ఏదీ మమ్మల్ని ఎప్పటికీ కదిలించలేదు ఎవరు మాకు హాని చేయలేరు” అని వారు తమలో తాము అనుకుంటారు.

7 వారి నోటి నిండా శాపాలు, మోసాలు, బెదిరింపులు ఉన్నాయి; ఇబ్బంది, కీడు వారి నాలుక క్రింద ఉంటాయి.

8 వారు గ్రామాల సమీపంలో పొంచి ఉంటారు; చాటైన స్థలాల్లో వారు నిర్దోషులను చంపుతారు. నిస్సహాయులైన వారి కోసం వారి కళ్లు వెదకుతాయి;

9 గుహలో సింహంలా వారు వేచి ఉంటారు. నిస్సహాయులను పట్టుకోడానికి వారు ఎదురుచూస్తూ ఉంటారు; వారు నిస్సహాయులను తమ వలలోనికి లాగి పట్టుకుంటారు.

10 బాధితులు నలిగి కుప్పకూలిపోతారు; వారు వారి బలత్కారం వల్ల పతనమవుతారు.

11 “దేవుడు ఎప్పటికీ గమనించరు; ఆయన తన ముఖాన్ని కప్పుకున్నారు ఇక ఎప్పుడు చూడరు” అని వారు తమలో తాము అనుకుంటారు.

12 యెహోవా, లెండి! ఓ దేవా, మీ చేయి పైకెత్తండి. నిస్సహాయులను మరువకండి.

13 దుష్టులు ఎందుకు దేవున్ని దూషిస్తారు? “దేవుడు నన్ను లెక్క అడగరు” అని వారు తమలో తాము ఎందుకు అనుకుంటారు?

14 దేవా, మీరైతే బాధితుల ఇబ్బందిని చూస్తారు; వారి దుఃఖాన్ని మీరు లక్ష్యపెట్టి బాధ్యత తీసుకుంటారు. నిస్సహాయులు మిమ్మల్ని ఆశ్రయిస్తారు; తండ్రిలేనివారికి మీరే సహాయకులు.

15 దుష్టుల చేతిని విరగ్గొట్టండి. కీడు చేసేవారిని వారి దుష్టత్వాన్ని బట్టి లెక్క అడగండి ఒక్కడు మిగులకుండ వారిని వెంటాడి నిర్మూలం చేయండి.

16 యెహోవా నిరంతరం రాజై ఉన్నారు; దేశాల ప్రజలు ఆయన భూభాగంలో నుండి నశిస్తారు.

17 యెహోవా, మీరు బాధపడేవారి కోరిక విన్నారు; మీరు వారి ప్రార్థనను ఆలకించి వారిని ప్రోత్సహిస్తారు.

18 తండ్రిలేనివారిని అణచివేయబడిన వారిని మీరు రక్షిస్తారు, అప్పుడు మానవులెవ్వరు ఎన్నడు భయాన్ని కలిగించరు.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan