Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

సామెతలు 5 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


వ్యభిచారానికి వ్యతిరేకంగా హెచ్చరిక

1 నా కుమారుడా, జ్ఞానంగల నా మాటలు విను, అంతరార్థం గల నా మాటలకు నీ చెవిని త్రిప్పు,

2 అప్పుడు నీవు విచక్షణ కలిగి ఉంటావు నీ పెదవులు తెలివిని కాపాడతాయి.

3 వ్యభిచారం చేసే స్త్రీ పెదవులు తేనె బిందువులాంటివి, దాని నోరు నూనె కంటే నునుపైనది;

4 కాని చివరకు అది పైత్యరసమంత చేదుగా, రెండంచులు గల ఖడ్గమంత పదునుగా ఉంటుంది.

5 దాని పాదాలు మరణానికి దిగుతాయి; దాని అడుగులు నేరుగా సమాధి వైపుకు వెళ్తాయి.

6 అది జీవన విధానానికి ఎటువంటి ఆలోచన ఇవ్వదు; దాని మార్గాలు లక్ష్యం లేకుండా తిరుగుతాయి, కానీ దానికి ఆ విషయం తెలియదు.

7 నా కుమారులారా, నా మాట ఆలకించండి; నేను చెప్పే వాటినుండి ప్రక్కకు తొలగవద్దు.

8 దానికి దూరంగా ఉన్న దారిలో ఉండండి, దాని ఇంటి తలుపు దగ్గరకు వెళ్లవద్దు,

9 పరులకు మీ వైభవాన్ని ఇవ్వవద్దు, మీ హుందాతనాన్ని క్రూరులకు ఇవ్వవద్దు.

10 అపరిచితులు మీ సంపదను తినివేయకూడదు మీ శ్రమ మరొకరి ఇంటిని సుసంపన్నం చేయకూడదు.

11 మీ జీవితం చివరి దశలో మీ దేహం, మాంసం క్షీణించినప్పుడు మీరు మూల్గుతారు.

12 అప్పుడు మీరంటారు, “నేను క్రమశిక్షణను అసహ్యించుకోవడమేంటి! నా హృదయం దిద్దుబాటును తిరస్కరించడమేంటి!

13 నేను నా బోధకులకు లోబడలేదు, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గ లేదు.

14 సర్వసమాజం మధ్య నేను దాదాపు పతనానికి వచ్చాను అనుకుంటూ బాధపడతారు.”

15 మీ సొంత కుండలోని నీళ్లను త్రాగండి, మీ సొంత బావిలో నుండి వచ్చే నీటినే త్రాగండి.

16 మీ ఊటలు వీధుల్లో పొంగిపోవచ్చునా? వీధుల్లో అవి నీటి కాలువలుగా పారవచ్చునా?

17 వాటిని మీకు మాత్రమే చెందినవిగా ఉండనివ్వండి, అపరిచితులతో ఎన్నడు పంచుకోవద్దు.

18 నీ ఊట ఆశీర్వదించబడును గాక, నీ యవ్వన కాలమందు నీ భార్య యందు సంతోషించు.

19 ఆమె అతి ప్రియమైన లేడి, అందమైన దుప్పి ఆమె రొమ్ములు నీకు ఎల్లప్పుడు తృప్తి కలుగజేయును గాక, ఆమె ప్రేమతో నీవు ఎల్లప్పుడు మత్తులో ఉందువు గాక.

20 ఎందుకు, నా కుమారుడా, మరొకని భార్యతో మత్తులో ఉంటావు? దారితప్పిన స్త్రీ రొమ్ము నీవేల కౌగిలించుకుంటావు?

21 ఎందుకంటే మనుష్యుల మార్గాలు యెహోవా కళ్ళెదుట ఉన్నాయి, ఆయన వారి మార్గాలన్నిటిని పరిశీలిస్తారు.

22 దుష్టుల చెడు క్రియలు వారిని చిక్కుల్లో పెడతాయి; వారి పాపపు త్రాళ్లు వారిని గట్టిగా బిగిస్తాయి.

23 క్రమశిక్షణ లేకపోవడం వల్ల వారు చస్తారు, వారి సొంత అతి మూర్ఖత్వం ద్వార దారి తప్పారు.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan