సామెతలు 31 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథంరాజైన లెమూయేలు సూక్తులు 1 రాజైన లెమూయేలు సూక్తులు; అతని తల్లి అతనికి బోధించిన ప్రేరేపిత మాటలు. 2 నా కుమారుడా! ఆలకించు, నా గర్భంలో మోసిన నా కుమారుడా, ఆలకించు నా మ్రొక్కుబడులకు జవాబైన నా కుమారుడా, ఆలకించు! 3 నీ బలమును ఆడవారి కోసం ఖర్చు చేయవద్దు, రాజులను పతనము చేసేవారి కోసం నీ శక్తిని ఖర్చు చేయవద్దు. 4 లెమూయేలూ, ఇది రాజులకు తగినది కాదు, మద్యపానం సేవించుట రాజులకు తగినది కాదు, పాలకులు మద్యము కోసం ఆరాటపడకూడదు, 5 ఎందుకంటే వారు త్రాగి, నిర్ణయించిన వాటిని మరచిపోతారు, అణగారిన వారందరి హక్కులను హరించివేస్తారు. 6 నశిస్తున్న వారికి సారా, హృదయ వేదనగల వారికి మద్యము. 7 వారు త్రాగి తమ పేదరికమును మరచిపోతారు తమ కష్టాన్ని ఇక తలంచరు. 8 తమ గురించి తాము మాట్లాడలేని వారి కోసం, నిరాశ్రయులందరి హక్కుల కోసం మాట్లాడండి. 9 మాట్లాడండి న్యాయంగా తీర్పు తీర్చండి; దీనుల, అవసరతలో ఉన్న వారి హక్కులను పరిరక్షించండి. ముగింపు: గుణవతియైన భార్య 10 గుణవతియైన భార్య ఎవరు కనుగొనగలరు? ఆమె ముత్యాల కంటే విలువైనది. 11 ఆమె భర్త ఆమెపై పూర్తి నమ్మిక కలిగి ఉంటాడు అతనికి లాభం తక్కువకాదు. 12 ఆమె బ్రతుకు దినాలన్ని, అతనికి మేలు చేస్తుంది గాని కీడు చేయదు. 13 ఆమె గొర్రె ఉన్నిని నారను తెచ్చుకుని, ఆసక్తి కలిగి తన చేతులతో పని చేస్తుంది. 14 ఆమె దూరము నుండి తన ఆహారాన్ని తెచ్చే, వర్తకుల ఓడల లాంటిది. 15 ఆమె ఇంకా చీకటి ఉండగానే లేస్తుంది; తన కుటుంబానికి భోజనము సిద్ధము చేస్తుంది; తన పనికత్తెలకు వారి వాటాను ఇస్తుంది. 16 ఆమె పొలాన్ని చూసి దానిని కొంటుంది; తన సంపాదనల నుండి ఆమె ద్రాక్షతోట ఒకటి నాటుతుంది. 17 ఆమె తన పనిని తీవ్రంగా ప్రారంభిస్తుంది, ఆమె పనులకు తగినట్టుగా ఆమె చేతులు బలమైనవి. 18 ఆమె తన వ్యాపారం లాభదాయకంగా ఉండడం చూస్తుంది, రాత్రివేళ ఆమె దీపం ఆరిపోదు. 19 ఆమె పంటను చేత పట్టుకుంటుంది, తన వ్రేళ్ళతో కదురు పట్టుకుని వడుకుతుంది. 20 పేదవారికి తన చేయి చాపి సహాయం చేస్తుంది, దరిద్రులకు తన చేతులు చాపి సహాయపడుతుంది. 21 మంచు కురిసినప్పుడు ఆమె తన ఇంటివారి గురించి భయపడదు, ఆమె ఇంటివారందరు ఎర్రని రంగు బట్టలు వేసుకున్నవారు. 22 ఆమె పరుపులను తయారుచేసుకుంటుంది, ఆమె బట్టలు సన్నని నారబట్టలు ఎరుపు వస్త్రాలు. 23 ఆమె భర్త పట్టణ ద్వారం దగ్గర గౌరవించబడతాడు, అతడు దేశ పెద్దల మధ్య ఆసీనుడై ఉంటాడు. 24 ఆమె నారబట్టలు నేయించి అమ్ముతుంది, వర్తకులకు నడికట్లను అమ్ముతుంది. 25 బలాన్ని, గౌరవాన్ని ఆమె ధరించి ఉంది; ఆమె రాబోయే రోజుల గురించి నవ్వగలదు. 26 ఆమె జ్ఞానం కలిగి మాట్లాడుతుంది, దయగల ఉపదేశం ఆమె నాలుకపై ఉంటుంది. 27 ఆమె తన ఇంటివారి వ్యవహారాలను చూస్తుంది, పని చేయకుండ ఆమె భోజనం చేయదు. 28 ఆమె పిల్లలు లేచి ఆమెను ధన్యురాలు అని పిలుస్తారు; ఆమె భర్త కూడా, ఆమెను పొగడ్తారు: 29 “చాలామంది స్త్రీలు గొప్ప పనులు చేస్తారు, కాని వారందరినీ నీవు మించినదానవు.” 30 అందం మోసకరం ఆకర్షణ వ్యర్థం; యెహోవాయందు భయభక్తులు గల స్త్రీ పొగడబడుతుంది. 31 చేసే పనిని బట్టి ఆమెకు గుర్తింపు వస్తుంది, ప్రజల ఎదుట ఆమె పనులు ఆమెను పొగడుతాయి. |
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.
Biblica, Inc.