సామెతలు 26 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 వేసవికాలంలో మంచు లేదా కోతకాలంలో వర్షం సరిపడవో, అలాగే బుద్ధిలేని వానికి ఘనత కూడా సరిపడదు. 2 ఎలాగైతే రెపరెపలాడే పిచ్చుక, ఇటు అటు ఎగిరే కోయిల కుదురుగా నిలువవో, కారణం లేని శాపం కూడా నిలువదు. 3 గుర్రానికి కొరడా, గాడిదకు కళ్లెం, బుద్ధిహీనుని వీపుకు బెత్తం! 4 వాని మొండితనం ప్రకారం బుద్ధిహీనునికి జవాబు ఇవ్వవద్దు, ఇచ్చిన ఎడల నీవును వాని వలెనే ఉందువు. 5 వాని మూర్ఖత్వం ప్రకారం బుద్ధిహీనునికి సమాధానం చెప్పాలి, లేకపోతే వాడు తన కళ్లకు తాను జ్ఞానిని అని అనుకుంటాడు. 6 బుద్ధిహీనునిచేత వార్తను పంపేవాడు, కాళ్లు తెగగొట్టుకొని విషం త్రాగిన వానితో సమానుడు. 7 కుంటివానికి కాళ్లు ఉన్నా ప్రయోజనం ఉండదు, అలాగే బుద్ధిహీనుని నోట సామెత ఉన్నా ఉపయోగం ఉండదు. 8 బుద్ధిహీనుని గౌరవించువాడు, వడిసెలలోని రాయి కదలకుండ కట్టు వానితో సమానుడు. 9 బుద్ధిహీనుని నోట సామెత, మత్తుడైన వాని చేతిలో ముల్లు గుచ్చుకొన్నట్లుండును. 10 యాదృచ్ఛికంగా గాయపడిన విలుకాడు వలె బుద్ధిహీనుని వలన కలుగు లాభము నిలువదు కూలికి వానిని పిలిచిన వాడును చెడిపోవును. 11 తన మూర్ఖత్వాన్ని మరల కనుపరచు బుద్ధిహీనుడు తను కక్కిన దానికి తిరిగిన కుక్క వంటివాడు. 12 తన కళ్లకు తాను జ్ఞానియైన వాన్ని చూశావా? వానికన్నా బుద్ధిహీనునికి ఎక్కువ నిరీక్షణ. 13 సోమరి అంటాడు, “దారిలో సింహముంది, వీధుల్లో క్రూర సింహం గర్జిస్తుంది!” 14 కీలుపై తలుపు తిరుగుతుంది అలాగే సోమరి తన పడకపై తిరుగుతాడు. 15 సోమరి పాత్రలో చేయి ముంచునేగాని; తన నోటికి దాని తిరిగి ఎత్తనైనా ఎత్తడు. 16 కారణాలు చూపగల ఏడుగురి కంటే సోమరి తన కళ్ళకు తానే జ్ఞానిని అనుకుంటాడు. 17 తనకు కాని తగాదాను బట్టి తొందర పడేవాడు దాటిపోవుచున్న కుక్కచెవులు పట్టుకొను వానితో సమానుడు. 18-19 తన పొరుగువానిని మోసం చేసి, మరణకరమైన “నేను సరదాగా చేశాను!” అని అనేవాడు మండుతున్న బాణాలు విసిరే ఉన్మాది లాంటివాడు. 20 కట్టెలు లేకపోతే నిప్పు ఆరిపోతుంది; అబద్ధాలు చెప్పేవాడు లేకపోతే తగాదా చల్లారుతుంది. 21 నిప్పు కణాలకు బొగ్గు, అగ్నికి కట్టెలో గొడవలు రేపడానికి గొడవప్రియుడు. 22 పనికిమాలిన మాటలు రుచిగల పదార్థాల్లాంటివి అవి అంతరంగం లోనికి దిగిపోతాయి. 23 చెడు హృదయంతో ప్రేమపూర్వకమైన మాటలు మట్టిపాత్రల మీద వెండి లోహపు మడ్డితో పూసినట్టు ఉంటాయి. 24 పగవారు పెదవులతో మాయ మాటలు చెప్పి హృదయాల్లో కపటాన్ని దాచుకుంటారు. 25 వారి మాటలు ఆహ్లాదకరంగా ఉన్నప్పటికీ, వాటిని నమ్మవద్దు, వారి హృదయాలు ఏడు అసహ్యకరమైన వాటితో నిండి ఉంటాయి. 26 వారి దుర్మార్గం మోసం ద్వారా దాచబడవచ్చు, కాని వారి దుష్టత్వం సమాజం ముందు బయటపడుతుంది. 27 గుంటను త్రవ్వువాడే దానిలో పడతాడు రాతిని దొర్లించేవారి మీదికే అది తిరిగి దొర్లుతుంది. 28 అబద్ధం చెప్పే నాలుక అది గాయపరచిన వారిని ద్వేషిస్తుంది, అలాగే పొగిడే నోరు నాశనం కలిగిస్తుంది. |
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.
Biblica, Inc.