సామెతలు 25 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథంసొలొమోను వ్రాసిన మరిన్ని సామెతలు 1 ఇవి కూడా సొలొమోను యొక్క సామెతలు, యూదా రాజైన హిజ్కియా సేవకులు వీటిని పోగుచేశారు. 2 ఒక విషయాన్ని దాచిపెట్టడం దేవుని గొప్పతనం; ఒక విషయాన్ని బయటకు లాగడం రాజుల గొప్పతనము. 3 ఆకాశాల ఎత్తు భూమి లోతు ఎలా కనుగొనలేమో, అలాగే రాజుల హృదయాలు కూడా శోధించలేనివి. 4 వెండిలోని లోహపు మడ్డిని తీసివేసి, కంసాలివాడు ఒక పాత్రను తయారుచేయగలడు; 5 రాజు ఎదుట నుండి చెడ్డ అధికారులను తొలగించండి, నీతి ద్వారా ఆయన సింహాసనం స్థాపించబడుతుంది. 6 రాజు ఎదుట నిన్ను నీవు హెచ్చించుకోవద్దు, ఆయన దగ్గర ఉండే గొప్పవారి మధ్య చోటు కావాలని కోరవద్దు. 7 సంస్థానాధిపతుల ముందు రాజు నిన్ను అవమానించడం కంటే, “ఇక్కడకు రండి” అని ఆయన నీతో చెప్పడం బాగుంటుంది కదా. మీరు ఏదో చూసిన దానిని బట్టి, 8 తొందరపడి న్యాయస్థానానికి వెళ్లకండి, ఎందుకంటే ఒకవేళ నీ పొరుగువాడు నిన్ను అవమానపరిస్తే తర్వాత నీవేమి చేస్తావు? 9 ఒకవేళ నీవు నీ పొరుగువాన్ని న్యాయస్థానానికి తీసుకెళ్లినా, ఇంకొకరి గుట్టు బయట పెట్టకు. 10 అది వినినవాడు నిన్ను అవమానపరచవచ్చు, అప్పుడు నీకు కలిగిన అపకీర్తి ఎన్నటికి తొలిగిపోదు. 11 సకాలంలో మాట్లాడిన మాట, చిత్రమైన వెండి పళ్ళాల్లో ఉంచబడిన బంగారు ఆపిల్ పళ్ళలాంటిది. 12 బంగారు చెవి పోగు ఎలా ఉంటుందో లేదా మేలిమి బంగారు ఆభరణం ఎలా ఉంటుందో వినే చెవికి జ్ఞానియైన న్యాయమూర్తి యొక్క గద్దింపు అలా ఉంటుంది. 13 నమ్మకమైన పనివాడు తనను పంపువారికి కోతకాలంలో మంచు చల్లదనము వంటివాడు; వాడు తన యజమానుల హృదయాలను తెప్పరిల్లజేస్తాడు. 14 బహుమతి ఇస్తానని వాగ్దానం చేసి ఇవ్వని వ్యక్తి వర్షము కురిపించని మబ్బు గాలి లాంటివాడు. 15 సహనం ద్వారా ఒక పాలకుడిని ఒప్పించవచ్చు, మృదువైన నాలుక ఎముకను విరుగ గొట్ట గలదు. 16 నీకు తేనె దొరికితే సరిపడగా తిను ఎక్కువ తింటే కక్కివేస్తావు. 17 నీ పొరుగువారింటికి మాటిమాటికి వెళ్లకు, వారు నీ వలన విసిగిపోయి నిన్ను ద్వేషించవచ్చు. 18 తన పొరుగువాని మీద అబద్ధసాక్ష్యం చెప్పేవాడు సమ్మెట ఖడ్గము లేదా వాడిగల బాణాన్ని పోలినవాడు. 19 కష్ట సమయంలో నమ్మకద్రోహిని ఆశ్రయించడమంటే విరిగిన పళ్లు లేదా కుంటి పాదం లాంటిది. 20 బాధలోనున్న వానికి పాటలు వినిపించేవాడు, బాగా చలిగా ఉన్నపుడు పై బట్టతీసివేయు వానితోను, పచ్చిపుండు మీద పుల్లని ద్రాక్షరసం పోసేవానితోను సమానము. 21 నీ శత్రువు ఆకలితో ఉంటే, తినడానికి భోజనము పెట్టు; అతడు దాహంతో ఉంటే, త్రాగడానికి నీళ్లు ఇవ్వు. 22 ఇలా చేయడం ద్వారా అతని తలపై మండుతున్న నిప్పులు కుప్పగా పోస్తావు, యెహోవా అందుకు నీకు ప్రతిఫలమిస్తారు. 23 ఊహించని వర్షాన్ని తెచ్చే ఉత్తర గాలిలా కపటమైన నాలుక భయానకంగా కనిపించేలా చేస్తుంది. 24 గయ్యాళియైన భార్యతో పెద్ద ఇంట్లో ఉండడం కంటే మిద్దెమీద ఒక మూలను నివసించడం మేలు. 25 అలసిన ప్రాణానికి చల్లటి నీరు ఎలా ఉంటుందో దూరదేశము నుండి వచ్చిన మంచి వార్త అలా ఉంటుంది. 26 నీతిమంతుడు దుష్టునికి మార్గం ఇవ్వడం ఊటను బురదమయం లేదా బావిని కలుషితం చేయడం లాంటిది. 27 తేనె ఎక్కువగా తినడం మంచిది కాదు, ప్రజలు తమ సొంత కీర్తిని కోరుకోవడం గౌరవప్రదం కాదు. 28 మనస్సు అదుపు చేసుకోలేని వ్యక్తి ప్రాకారాలు కూలిన పట్టణం లాంటివాడు. |
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.
Biblica, Inc.