Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

సామెతలు 10 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


సొలొమోను యొక్క సామెతలు

1 సొలొమోను యొక్క సామెతలు: జ్ఞానం కలిగిన పిల్లలు తండ్రికి ఆనందం కలిగిస్తారు, కాని మూర్ఖపు పిల్లలు తమ తల్లికి దుఃఖాన్ని కలిగిస్తారు.

2 అన్యాయపు ధనం యొక్క విలువ నిలువదు, అయితే నీతి చావు నుండి విడిపిస్తుంది.

3 యెహోవా నీతిమంతులను ఆకలి గొననివ్వడు, కాని దుష్టుల కోరికను ఆయన పాడుచేస్తారు.

4 సోమరి చేతులు దరిద్రత తెస్తాయి, కాని శ్రద్ధగా పని చేసేవారి చేతులు ధనాన్ని తెస్తాయి.

5 వేసవిలో పంటను కూర్చేవారు వివేకంగల పిల్లలు, అయితే కోతకాలంలో నిద్రించేవారు అవమానాన్ని తెచ్చే పిల్లలు.

6 నీతిమంతుల తల మీదికి ఆశీర్వాదాలు వస్తాయి, కాని దుర్మార్గుల నోరు హింసను దాచిపెడుతుంది.

7 నీతిమంతుల పేరు ఆశీర్వాదాలలో వాడబడుతుంది, కాని దుర్మార్గుల పేరు కుళ్ళిపోతుంది.

8 జ్ఞానంగలవారు ఉపదేశాన్ని అంగీకరిస్తారు, మూర్ఖులు తమకు తానే కష్టాన్ని తెచ్చుకుని నశిస్తారు.

9 యథార్థంగా ప్రవర్తించేవారు క్షేమంగా జీవిస్తారు, కానీ మోసం చేసేవారు పట్టుబడతారు.

10 కళ్లతో సైగ చేసేవారు దుఃఖాన్ని కలిగిస్తారు, వ్యర్థ కబుర్లు చెప్పే మూర్ఖులు నాశనమవుతారు.

11 నీతిమంతుల నోరు జీవపుఊట, కాని దుష్టుల నోరు హింసను దాచిపెడుతుంది.

12 పగ తగాదాలను కలుగజేస్తుంది, ప్రేమ దోషాలన్నిటిని కప్పుతుంది.

13 వివేచన గలవారి పెదవుల మీద జ్ఞానం కనబడుతుంది, కాని తెలివిలేని వారి వీపు మీద బెత్తంతో కొట్టబడతారు.

14 జ్ఞానులు తెలివిని సంపాదించుకుంటారు, బుద్ధిహీనుల నాశనాన్ని ఆహ్వానిస్తుంది.

15 ధనవంతుల ఆస్తి వారి యొక్క కోటగోడలు గల పట్టణం, కాని దరిద్రత పేదవారి నాశనం.

16 నీతిమంతుల కష్టార్జితం జీవం, కాని దుష్టుల సంపాదన పాపం, మరణం.

17 క్రమశిక్షణ పాటించేవారు జీవితానికి మార్గం చూపుతారు, కాని దిద్దుబాటును పట్టించుకోనివారు ఇతరులను దారి తప్పిస్తారు.

18 పగను దాచిపెట్టేవారు అబద్ధికులు, ఇతరుల మీద నిందలు వేసేవారు మూర్ఖులు.

19 విస్తారమైన మాటల్లో పాపానికి అంతం ఉండదు, కాని వివేకులు నాలుకను అదుపులో పెడతారు.

20 నీతిమంతుల నాలుక విలువైన వెండి వంటిది, కాని దుష్టుల హృదయం విలువలేనిది.

21 నీతిమంతుల పెదవులు అనేకులకు మేలు చేస్తాయి, కాని బుద్ధిహీనులు తెలివిలేక చస్తారు.

22 యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని తెస్తుంది, బాధ దుఃఖం దానికి జోడించబడవు.

23 బుద్ధిహీనులు దుష్ట పన్నాగాల్లో ఆనందిస్తారు, కాని వివేకంగలవారు జ్ఞానాన్నిబట్టి ఆనందిస్తారు.

24 దుష్టులు దేనికి భయపడతారో అదే వారి మీదికి వస్తుంది, నీతిమంతులు ఆశించిందే వారికి ఇవ్వబడుతుంది.

25 సుడిగాలి వచ్చినపుడు దుష్టులు లేకుండా పోతారు, కానీ నీతిమంతులు దృఢంగా నిలిచి ఉంటారు.

26 పళ్ళకు పులిసిన ద్రాక్షరసంలా కళ్లకు పొగలా, తమను పంపినవారికి సోమరివారు అలా ఉంటారు.

27 యెహోవాయందలి భయం దీర్ఘాయువును ఇస్తుంది, కాని దుష్టుల సంవత్సరాలు కుదించబడతాయి.

28 నీతిమంతుల ఆశలు ఆనందాన్నిస్తాయి కాని దుష్టుల ఆశలు ఫలించవు.

29 నింద లేనివారికి యెహోవా మార్గం ఒక ఆశ్రయం, కాని కీడు చేసేవారికి అది పతనము.

30 నీతిమంతులు ఎన్నడు కదిలించబడరు, కాని దుష్టులు దేశంలో ఉండరు.

31 నీతిమంతుల నోటి నుండి జ్ఞాన ఫలం వస్తుంది, అయితే వక్ర బుద్ధిగల నాలుక మూసివేయబడుతుంది.

32 నీతిమంతుల నోటికి దయ పొందడం తెలుసు, కాని దుష్టుల నోటికి వక్ర మాటలే తెలుసు.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan