ఓబద్యా 1 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథంఓబద్యాకు వచ్చిన దర్శనం 1 ఓబద్యాకు వచ్చిన దర్శనం. ప్రభువైన యెహోవా ఎదోము గురించి ఇలా చెప్తున్నారు: మేము యెహోవా నుండి ఒక సందేశం వచ్చింది, “లెండి! ఎదోము మీద యుద్ధానికి వెళ్దాం” అని చెప్పడానికి దేశాలకు ఒక దూత పంపబడ్డాడు. 2 “చూడు, నేను నిన్ను దేశాల్లో అల్పమైన దానిగా చేస్తాను; నీవు పూర్తిగా తృణీకరించబడతావు. 3 నీ హృదయ గర్వం నిన్ను మోసం చేసింది, బండ సందుల్లో నివసించేదానా, కొండ శిఖరాల మీద నివాసం ఏర్పరచుకున్నదానా, ‘నన్ను ఎవరు క్రిందకు పడవేయగలరు?’ అని నీలో నీవనుకుంటావు. 4 నీవు గ్రద్దలా పైకి ఎగిరి, నక్షత్రాలలో నీ గూడు కట్టుకున్నా, అక్కడినుండి నేను నిన్ను క్రిందికి పడవేస్తాను” అని యెహోవా చెప్తున్నారు. 5 “ఒకవేళ నీ మీదికి దొంగలు వస్తే, రాత్రివేళ దొంగలు వస్తే ఎంతగా నాశనం చేస్తారో కదా! వారికి కావలసినంత వారు దోచుకుంటారు కదా? ద్రాక్షలు పోగుచేసుకునేవారు నీ దగ్గరకు వస్తే, వారు కొన్ని ద్రాక్షలు వదిలిపెడతారు కదా? 6 ఏశావు సంతతివారిని పూర్తిగా దోచుకుంటారు, వారు దాచిన నిధులన్నిటిని దోచుకుంటారు! 7 నీతో సంధి చేసుకున్న వారు నిన్ను తమ సరిహద్దు వరకు తరిమివేస్తారు; నీ స్నేహితులు నిన్ను మోసం చేసి నీ మీద గెలుస్తారు; నీ ఆహారం తిన్నవారు నీకోసం ఉచ్చు పెడతారు, నీవు దానిని తెలుసుకోలేవు. 8 “ఆ రోజున, యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, నేను ఎదోము జ్ఞానులను, ఏశావు పర్వతాల్లో వివేకులను నాశనం చేయనా? 9 తేమానూ! నీ వీరులు భయపడతారు, ఏశావు పర్వతాల్లో ఉంటున్న ప్రతి ఒక్కరు, సంహరించబడి కూలిపోతారు. 10 నీ సోదరుడైన యాకోబు మీద చేసిన దౌర్జన్యాన్ని బట్టి, నీకు అవమానం కలుగుతుంది; నీవు ఎప్పటికీ లేకుండా నాశనమవుతావు. 11 అపరిచితులు అతని ఆస్తులను తీసుకెళ్లినప్పుడు, విదేశీయులు అతని గుమ్మాల్లోకి వచ్చి, యెరూషలేము మీద చీట్లు వేసేిన రోజున, నీవు దూరంగా నిలబడ్డావు, నీవు వారిలో ఒకనిగా ఉన్నావు. 12 నీ సోదరునికి దురవస్థ కలిగిన రోజు, నీవు సంతోషించకూడదు, యూదా ప్రజల నాశన దినాన వారిని చూసి ఆనందించకూడదు, వారి శ్రమ దినాన, నీవు గొప్పలు చెప్పుకోవద్దు. 13 నా ప్రజలకు ఆపద సంభవించిన రోజున వారి గుమ్మాల్లో చొరబడకూడదు, వారికి ఆపద కలిగిన రోజున, వారికి వచ్చిన విపత్తును బట్టి సంతోషించకూడదు, వారికి ఆపద వచ్చిన రోజున వారి ఆస్తులను దోచుకోకూడదు. 14 వారిలో తప్పించుక పోయేవారిని చంపడానికి నీవు కూడలిలో ఎదురుచూస్తూ నిలబడకూడదు, వారి శ్రమ దినాన వారిలో మిగిలే వారిని శత్రువులకు అప్పగించకూడదు. 15 “యెహోవా దినం ఆసన్నమైంది, అది అన్ని దేశాల మీదికి వస్తుంది. నీవు చేసినట్టే, నీకు చేయబడుతుంది, నీ క్రియలు నీ తల మీదికి వస్తాయి; 16 మీరు నా పవిత్ర కొండమీద త్రాగినట్టే, ఇతర ప్రజలందరు నిత్యం త్రాగుతారు; వారు ముందెన్నడూ త్రాగలేదన్నట్లు త్రాగుతూనే ఉంటారు. 17 అయితే సీయోను పర్వతం మీద విడుదల ఉంటుంది; అది పవిత్రంగా ఉంటుంది, యాకోబు వారు తన వారసత్వాన్ని స్వాధీనపరచుకుంటారు. 18 యాకోబు అగ్నిలా, యోసేపు మంటలా ఉంటారు; ఏశావు కొయ్యకాలులా ఉంటాడు, వారు అతనికి నిప్పంటించి నాశనం చేస్తారు. ఏశావు వారిలో నుండి ఎవరూ తప్పించుకోలేరు” అని యెహోవా చెప్పారు. 19 దక్షిణ ప్రాంత ప్రజలు ఏశావు పర్వతాలను స్వాధీనం చేసుకుంటారు, దిగువ కొండ ప్రాంత ప్రజలు, ఫిలిష్తీయుల దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు. వారు ఎఫ్రాయిం, సమరయ భూములను స్వాధీనం చేసుకుంటారు, బెన్యామీను వారు గిలాదును స్వాధీనం చేసుకుంటారు. 20 కనానులో బందీలుగా ఉన్న ఇశ్రాయేలీయులు సారెపతు వరకు దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు; సెఫారాదులో ఉన్న యెరూషలేము ప్రవాసులు దక్షిణ ప్రాంత పట్టణాలను స్వాధీనం చేసుకుంటారు. 21 ఏశావు పర్వతాలను పరిపాలించడానికి రక్షకులు సీయోను పర్వతం ఎక్కుతారు, రాజ్యం యెహోవాది అవుతుంది. |
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.
Biblica, Inc.