Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

సంఖ్యా 5 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


శిబిరం యొక్క పవిత్రత

1 యెహోవా మోషేతో ఇలా అన్నారు,

2 “ఎవరికైనా అపవిత్రమైన కుష్ఠువ్యాధి ఉన్నా లేదా ఏదైనా స్రావము కలిగి ఉన్నా లేదా శవాన్ని ముట్టుకొని ఆచారరీత్య అపవిత్రమై ఉన్నా, అలాంటి వారిని శిబిరంలో నుండి పంపివేయాలని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించు.

3 పురుషులనైనా స్త్రీలనైనా పంపివేయాలి; నేను ప్రజలమధ్య నివసిస్తాను కాబట్టి వారు శిబిరాన్ని అపవిత్రం చేయకుండేలా వారిని పంపివేయాలి.”

4 ఇశ్రాయేలీయులు అలాగే చేశారు; వారిని శిబిరం బయటకు పంపివేశారు. యెహోవా మోషేకు సూచించిన ప్రకారం వారు చేశారు.


పాపాలకు నష్టపరిహారం

5 యెహోవా మోషేతో ఇలా చెప్పారు,

6 “ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు: ‘ఏ స్త్రీ గాని, పురుషుడు గాని యెహోవా పట్ల ద్రోహులై మనుష్యులు చేసే పాపాల్లో దేనినైనా చేసి అపరాధులైతే,

7 వారు వారి పాపాన్ని ఒప్పుకుని వారు చేసిన అపరాధానికి పూర్ణ ప్రాయశ్చిత్తం చేయాలి, చేసిన తప్పుకు అయిదవ వంతు చేర్చి ఎవరికి విరుద్ధంగా తప్పు చేశారో వారికి ఇవ్వాలి.

8 అయితే ఆ వ్యక్తికి నష్టపరిహారం చెల్లించడానికి సమీపబంధువు లేకపోతే, ఆ నష్టపరిహారం యెహోవాది, అది ప్రాయశ్చిత్త బలిగా ఇవ్వబడే పొట్టేలుతో పాటు యాజకునికి ఇవ్వబడాలి.

9 ఇశ్రాయేలీయులు ఒక యాజకునికి తీసుకొనివచ్చే పవిత్రమైన విరాళాలన్నీ అతనికే చెందుతాయి.

10 పవిత్రమైనవి వాటి యజమానులకు చెందుతాయి, కానీ వారు యాజకునికి ఇచ్చేది యాజకునికే చెందుతుంది.’ ”


నమ్మకద్రోహియైన భార్యకు పరీక్ష

11 యెహోవా మోషేతో ఇలా అన్నారు,

12 “ఇశ్రాయేలీయులతో మాట్లాడి వారికి ఇలా చెప్పు: ‘ఒకవేళ ఒక వ్యక్తి భార్య దారితప్పి అతనికి నమ్మకద్రోహం చేసి,

13 మరొక వ్యక్తి ఆమెతో లైంగిక సంబంధాలు పెట్టుకొని, ఆ విషయం తన భర్తకు తెలియకుండ దాచబడి ఆమె అపవిత్రపరచబడింది అనడానికి సాక్ష్యం లేకపోయినా, ఆమె పట్టుబడకపోయినా,

14 ఒకవేళ అతడు తన భార్య మీద అసూయపడి ఆమెను అనుమానించినప్పుడు, ఆమె నిజంగానే అపవిత్రమైతే, ఒకవేళ ఆమె అపవిత్రం కాకపోయినా అతడు ఆమెను అనుమానిస్తే,

15 అతడు తన భార్యను యాజకుని దగ్గరకు తీసుకెళ్లాలి. అతడు ఆమె పక్షంగా ఒక ఓమెరు యవల పిండి తీసుకురావాలి. దాని మీద ఒలీవనూనె పోయకూడదు ధూపం వేయకూడదు ఎందుకంటే అది అసూయ కోసం అర్పించే భోజనార్పణ, చేసిన తప్పును జ్ఞాపకం చేసే జ్ఞాపక అర్పణ.

16 “ ‘యాజకుడు ఆమెను తీసుకువచ్చి యెహోవా ఎదుట నిలబెట్టాలి.

17 తర్వాత యాజకుడు ఓ మట్టి కూజలో పవిత్ర జలం తీసుకుని సమావేశ గుడారంలోని నేల మట్టిని ఆ నీటిలో వేయాలి.

18 యాజకుడు యెహోవా ఎదుట ఆమెను నిలబెట్టిన తర్వాత, ఆమె జుట్టును విప్పి, శాపాన్ని తెచ్చే చేదు నీటిని యాజకుడు పట్టుకుని, జ్ఞాపక అర్పణను అంటే అనుమానం కొరకైన జ్ఞాపక అర్పణను ఆమె చేతుల్లో పెట్టాలి.

19 తర్వాత యాజకుడు ఆ స్త్రీతో ప్రమాణం చేయించి, “ఏ మనుష్యుడు నీతో లైంగిక సంబంధం లేకపోతే, నీ భర్తతో దాంపత్య సంబంధం కలిగి ఉన్నప్పుడు నీవు త్రోవ తప్పకుండ, అపవిత్రం కాకుండ ఉంటే, శాపం తెచ్చే ఈ చేదు నీళ్ల నుండి నీవు నిర్దోషివి అవుతావు.

20 అయితే నీ భర్తతో పెళ్ళి చేసుకున్న తర్వాత నీవు త్రోవ తప్పి, నీ భర్త కాకుండా వేరొక వ్యక్తితో లైంగిక సంబంధాలు పెట్టుకోవడం ద్వారా నిన్ను నీవు అపవిత్రపరచుకుని ఉంటే,”

21 యాజకుడు ఆమె మీదికి, “యెహోవా నిన్ను నీ ప్రజలమధ్య ఒక శాపంగా చేసి, నీ గర్భం పోవునట్లు, నీ ఉదరం ఉబ్బిపోయేలా చేయును గాక.

22 శాపం తెచ్చే ఈ నీరు నీ శరీరంలోనికి ప్రవేశించి నీ ఉదరం ఉబ్బిపోయేలా లేదా నీ గర్భం పోవునట్లు చేయును గాక” అని శాపం పలుకుతాడు. “ ‘అప్పుడు ఆ స్త్రీ, “ఆమేన్, అలాగే జరుగును గాక” అని అనాలి.

23 “ ‘యాజకుడు ఈ శాపాలను ఒక గ్రంథపుచుట్ట మీద వ్రాసి దానిని చేదు నీటితో కడగాలి.

24 శాపం తెచ్చే ఆ చేదు నీటిని ఆమెతో త్రాగించాలి, అప్పుడు శాపం తెచ్చే ఆ నీరు ఆమెలో చేదు పుట్టిస్తుంది.

25 యాజకుడు ఆమె చేతి నుండి అసూయ కొరకైన భోజనార్పణను తీసుకుని, యెహోవా ఎదుట పైకెత్తి దానిని బలిపీఠం దగ్గరకు తీసుకురావాలి.

26 యాజకుడు ఆ భోజనార్పణలో నుండి పిడికెడు తీసుకుని దాన్ని బలిపీఠం మీద జ్ఞాపకార్థ అర్పణగా దహించాలి; తర్వాత అతడు ఆ స్త్రీతో ఆ నీరు త్రాగించాలి.

27 ఆమె తనను తాను అపవిత్రపరచుకుని ఉంటే, తన భర్తకు నమ్మకద్రోహం చేసి ఉంటే, ఫలితం ఇలా ఉంటుంది: శాపం తెచ్చే ఆ నీళ్లను ఆమె త్రాగినప్పుడు, ఆ నీళ్లు ఆమెలో ప్రవేశించి, ఆమె కడుపు ఉబ్బుతుంది, ఆమె గర్భం పోతుంది ఆమె శాపంగా మారుతుంది.

28 అయితే ఆమె తనను తాను అపవిత్రం చేసుకోకుండ పవిత్రంగా ఉంటే, తాను నిర్దోషిగా ఉండి పిల్లలను కనగలుగుతుంది.

29 “ ‘ఇది అసూయకు సంబంధించిన నియమము. ఒక స్త్రీ తన భర్తతో దాంపత్య సంబంధం కలిగి ఉన్నప్పుడు త్రోవ తప్పి తనను తాను అపవిత్రపరచుకుంటే,

30 లేదా ఒక వ్యక్తి తన భార్య మీద అసూయ పడినప్పుడు వర్తించే న్యాయవిధి. యాజకుడు ఆమెను యెహోవా ఎదుట నిలబెట్టి ఈ నియమాన్ని ఆ స్త్రీకి అన్వయింపచేయాలి.

31 అప్పుడు ఆ భర్త ఏ తప్పు చేసినా నిర్దోషిగా ఉంటాడు. కానీ స్త్రీ తన పాపపు పరిణామాలను భరిస్తుంది.’ ”

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan