సంఖ్యా 3 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథంలేవీయులు 1 యెహోవా మోషేతో సీనాయి కొండమీద మాట్లాడిన సమయంలో ఉన్న అహరోను మోషేల వంశావళి ఇదే. 2 అహరోను కుమారుల పేర్లు: మొదటి సంతానమైన నాదాబు, అబీహు, ఎలియాజరు ఈతామారు. 3 అవి అహరోను కుమారుల పేర్లు; వీరు అభిషేకించబడిన యాజకులు; వీరు యాజకులుగా సేవ చేయడానికి ప్రతిష్ఠించబడ్డారు. 4 నాదాబు అబీహులు సీనాయి అరణ్యంలో యెహోవా ఎదుట అనధికార అగ్నితో అర్పణ అర్పించినందుకు ఆయన ఎదుటే చనిపోయారు. వారికి కుమారులు లేరు కాబట్టి అహరోను జీవితకాలమంతా, తన కుమారులైన ఎలియాజరు, ఈతామారు యాజకులుగా సేవ చేశారు. 5 యెహోవా మోషేతో ఇలా చెప్పారు, 6 “లేవీ గోత్రం వారిని తీసుకువచ్చి యాజకుడైన అహరోనుకు సహాయం చేయడానికి అతని ఎదుట నిలబెట్టు. 7 వారు సమావేశ గుడారపు సేవ చేస్తూ సమావేశ గుడారం దగ్గర అతని తరపున సమాజమంతటి తరపున విధులు నిర్వర్తిస్తారు. 8 ప్రత్యక్ష గుడారపు పని చేయడం ద్వారా ఇశ్రాయేలీయుల బాధ్యతలను నెరవేరుస్తూ, వారు సమావేశ గుడారపు సామాగ్రి అంతా చూసుకోవాలి. 9 లేవీయులను అహరోనుకు అతని కుమారులకు అప్పగించు; వారు సంపూర్ణంగా అతని స్వాధీనం చేయబడిన ఇశ్రాయేలీయులు. 10 యాజకులుగా సేవ చేయడానికి అహరోనును, అతని కుమారులను నియమించు; ఎవరైనా పరిశుద్ధాలయం దగ్గరకు వస్తే వారికి మరణశిక్ష విధించబడుతుంది.” 11 యెహోవా మోషేతో ఇలా కూడా చెప్పారు, 12 “ఇశ్రాయేలు ప్రజల్లో తొలి మగ సంతానం స్థానంలో నేను లేవీయులను తీసుకున్నాను. లేవీయులు నావారు, 13 ఎందుకంటే తొలిసంతానమంతా నావారు. ఈజిప్టు తొలిసంతానాన్ని నేను మొత్తినప్పుడు, ఇశ్రాయేలీయులలో మనుష్యుల్లో, పశువుల్లో ప్రతి తొలిసంతానాన్ని, నా కోసం ప్రత్యేకపరచుకున్నాను. వారు నా వారిగా ఉండాలి. నేనే యెహోవాను.” 14 సీనాయి ఎడారిలో యెహోవా మోషేతో ఇలా అన్నారు. 15 “లేవీయులను వారి కుటుంబాలు వంశాల ప్రకారం లెక్కించు. ఒక నెల మొదలుకొని ఆపై వయస్సున్న మగవారినందరిని లెక్కించు.” 16 కాబట్టి యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం మోషే వారిని లెక్కించాడు. 17 లేవీ కుమారుల పేర్లు ఇవి: గెర్షోను, కహాతు, మెరారి. 18 గెర్షోను వంశస్థుల పేర్లు ఇవి: లిబ్నీ, షిమీ. 19 కహాతు వంశస్థుల పేర్లు ఇవి: అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు. 20 మెరారి వంశస్థులు: మహలి, మూషి. వీరు వారి వారి కుటుంబాల ప్రకారం లేవీ వంశస్థులు. 21 లిబ్నీయులు, షిమీయులు వంశస్థులు గెర్షోనుకు చెందినవారు; వీరు గెర్షోను వంశస్థులు. 22 వీరిలో ఒక నెల మొదలుకొని ఆపై వయస్సున్న మగవారందరి సంఖ్య 7,500. 23 గెర్షోను వంశస్థులు సమావేశ గుడారం వెనుక పశ్చిమ వైపు దిగాలి. 24 లాయేలు కుమారుడైన ఎలీయాసాపు గెర్షోను కుటుంబాల నాయకుడు. 25 గెర్షోనీయులు కాపాడవలసినవి: సమావేశ గుడారం, గుడారం, దాని పైకప్పు, సమావేశ గుడార ద్వారం యొక్క తెర, 26 ఆవరణం యొక్క తెరలు, గుడారం బలిపీఠం చుట్టూ ఉన్న ద్వారపు తెర, దాని త్రాళ్లు, వాటికి ఉపయోగించబడే ప్రతి వస్తువు. 27 అమ్రామీయులు, ఇస్హారీయులు, హెబ్రోనీయులు, ఉజ్జీయేలీయులు కహాతుకు చెందినవారు; వీరు కహాతు వంశస్థులు. 28 ఒక నెల ఆపై వయస్సున్న మగవారందరు 8,600 మంది. పరిశుద్ధాలయాన్ని కాపాడే బాధ్యత కహాతీయులది. 29 కహాతు వంశస్థులు సమావేశ గుడారం యొక్క దక్షిణ వైపు దిగాలి. 30 ఉజ్జీయేలు కుమారుడైన ఎలీషాపాను కహాతు వంశస్థుల కుటుంబాల నాయకుడు. 31 వారు మందసం, బల్ల, దీపస్తంభం, బలిపీఠాలు, పరిచర్య కోసం పరిశుద్ధాలయం లోని వస్తువులు, తెర వాటికి ఉపయోగించబడే ప్రతి వస్తువు విషయం బాధ్యత వహించాలి. 32 యాజకుడును అహరోను కుమారుడునైన ఎలియాజరు లేవీయుల ప్రధాన నాయకుడు. పరిశుద్ధాలయాన్ని కాపాడే వారి మీద ఇతడు ముఖ్య నాయకునిగా నియమించబడ్డాడు. 33 మహలీయులు, మూషీయుల వంశస్థులు మెరారికి చెందినవారు. వీరు మెరారి వంశస్థులు. 34 ఒక నెల ఆపై వయస్సున్న మగవారందరి సంఖ్య 6,200. 35 అబీహయిలు కుమారుడైన సూరీయేలు మెరారి వంశస్థుల కుటుంబాల నాయకుడు. వీరు సమావేశ గుడారం యొక్క ఉత్తర వైపున దిగాలి. 36 మెరారీయులు సమావేశ గుడారం యొక్క పలకలు, దాని అడ్డకర్రలు, స్తంభాలు, దిమ్మలు, దాని ప్రతి ఉపకరణాలు వాటికి సంబంధించినవన్నీ, 37 అలాగే ఆవరణం చుట్టూ ఉన్న ప్రాకార స్తంభాలు, వాటి దిమ్మలు, వాటి మేకులు త్రాళ్లను కాపాడడానికి నియమింపబడ్డారు. 38 మోషే, అహరోను, అతని కుమారులు సమావేశ గుడారానికి తూర్పున, అనగా సూర్యుడు ఉదయించే వైపున సమావేశ గుడారానికి ఎదురుగా ఉండాలి. ఇశ్రాయేలీయుల పక్షంగా పరిశుద్ధాలయాన్ని కాపాడే బాధ్యత వీరిది. ఇతరులెవరైనా పరిశుద్ధాలయాన్ని సమీపిస్తే వారికి మరణశిక్ష. 39 యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం మోషే అహరోనుల ద్వారా లెక్కించబడిన లేవీయులు, వారి వారి వంశాల ప్రకారం ఒక నెల ఆపై వయస్సున్న మగవారందరి సంఖ్య 22,000. 40 యెహోవా మోషేతో, “ఒక నెల లేదా ఆపై వయస్సున్న ఇశ్రాయేలీయుల తొలిసంతానమైన మగవారిని లెక్కించండి, వారి పేర్ల జాబితాను తయారుచేయండి. 41 ఇశ్రాయేలీయుల్లోని తొలిసంతానానికి బదులు లేవీయులను, ఇశ్రాయేలీయుల పశువుల్లో తొలిసంతానానికి బదులు లేవీయుల పశువులను నా కోసం తీసుకోవాలి. నేను యెహోవానై యున్నాను.” 42 కాబట్టి మోషే యెహోవా ఆజ్ఞ ప్రకారం ఇశ్రాయేలీయులలో తొలిసంతానాన్ని లెక్కించాడు. 43 ఒక నెల లేదా ఆ పైబడి వయస్సుగల మొదటి సంతానమైన మగవారందరు 22,273 మంది. 44 యెహోవా మోషేకు ఇలా కూడా చెప్పారు. 45 “ఇశ్రాయేలీయుల తొలి సంతానమంతటికి బదులు లేవీయులను, వారి పశువుల్లో తొలిసంతానానికి బదులు లేవీయుల పశువులను నా కోసం తీసుకో. లేవీయులు నా వారిగా ఉండాలి. నేనే యెహోవాను. 46 లేవీయుల కంటే ఇశ్రాయేలీయులు 273 మంది ఎక్కువ ఉన్నారు. వీరిని విడిపించడానికి, 47 పరిశుద్ధాలయం యొక్క షెకెల్ చొప్పున, ఒక్క షెకెల్ అంటే ఇరవై గెరాలు, ఒక్కొక్కరికి అయిదు షెకెళ్ళ వెండి తీసుకోవాలి. 48 ఆ మిగిలిన ఇశ్రాయేలీయుల విమోచన కోసం అహరోనుకు అతని కుమారులకు ఆ డబ్బు ఇవ్వాలి.” 49 కాబట్టి మోషే లేవీయుల ద్వారా విడిపించబడిన వారికంటే ఎక్కువగా ఉన్న వారి నుండి విమోచన డబ్బు తీసుకున్నాడు. 50 ఇశ్రాయేలీయులలో తొలిసంతానం నుండి పరిశుద్ధాలయ షెకెల్ ప్రకారం మోషే 1,365 షెకెళ్ళ వెండి తీసుకున్నాడు. 51 యెహోవా తనకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం మోషే విమోచన డబ్బును అహరోను అతని కుమారులకు ఇచ్చాడు. |
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.
Biblica, Inc.