Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

సంఖ్యా 24 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

1 ఇశ్రాయేలును ఆశీర్వదించడం యెహోవాకు ఇష్టమని బిలాము గ్రహించినప్పుడు, అతడు ఇతర సమయాల్లో చేసినట్టు భవిష్యవాణి ఆశ్రయించలేదు, కానీ తన ముఖాన్ని అరణ్యం వైపు త్రిప్పాడు.

2 ఇశ్రాయేలు వారు గోత్రాల ప్రకారం గుడారాలు వేసుకుని ఉండడం బిలాము చూసినప్పుడు, దేవుని ఆత్మ అతని మీదికి వచ్చింది,

3 అతడు ఈ సందేశం ఇచ్చాడు: “బెయోరు కుమారుడైన బిలాము యొక్క ప్రవచనం, స్పష్టంగా చూడగలిగే కన్ను గలవాని ప్రవచనం,

4 దేవుని మాటలు వినే వాని ప్రవచనం, సర్వశక్తిగల దేవుని నుండి దర్శనం చూసేవాడు, సాష్టాంగపడేవాడు, కళ్లు తెరవబడినవాడు:

5 “ఓ యాకోబు, నీ గుడారాలు ఎంత అందంగా ఉన్నాయి, ఓ ఇశ్రాయేలు, నీ నివాస భవనాలు ఎంత రమ్యంగా ఉన్నాయి!

6 “అవి లోయల్లా వ్యాపించాయి, నది ప్రక్కన తోటల్లా ఉన్నాయి, యెహోవా నాటిన అగరు వంటివి, జలాల ప్రక్కన దేవదారు చెట్లలా ఉన్నాయి.

7 వాటి బొక్కెనల నుండి నీళ్లు పారుతున్నాయి; వాటి విత్తనాలకు సమృద్ధిగా నీళ్లుంటాయి. “వారి రాజు అగగు కంటే గొప్పవాడు; వారి రాజ్యం హెచ్చింపబడుతుంది.

8 “దేవుడు ఈజిప్టు నుండి వారిని బయటకు తెచ్చారు; వారు అడవి ఎద్దు బలం కలిగి ఉన్నారు. వారు శత్రు దేశాలను మ్రింగివేస్తారు వారి ఎముకలను తునాతునకలు చేస్తారు; వారి బాణాలతో వారు వారిని గుచ్చుతారు.

9 సింహంలా ఆడు సింహంలా వారు ముడుచుకుని పడుకుంటారు, వారిని ధైర్యంగా ఎవరు లేపగలరు? “ఓ ఇశ్రాయేలు, నిన్ను దీవించే వారు దీవించబడుదురు గాక నిన్ను శపించేవారు శపించబడుదురు గాక!”

10 బిలాము మీద బాలాకుకు కోపం రగులుకుంది. చేతులు చరుస్తూ అతనితో, “నా శత్రువులను శపించమని నిన్ను పిలిపిస్తే, వారిని మూడుసార్లు దీవించావు.

11 ఇప్పుడు ఇక్కడినుండి మీ ఇంటికి పో! నిన్ను ఘనంగా సన్మానిస్తానని నేను అన్నాను కానీ యెహోవా నీకు ఆ సన్మానం లేకుండా చేశారు” అని అన్నాడు.

12 బిలాము బాలాకుతో, “నీవు పంపిన దూతలకు నేను చెప్పలేదా,

13 ‘బాలాకు తన రాజభవనంలో ఉన్న వెండి బంగారం అంతా నాకు ఇచ్చినా సరే, నా సొంతగా నేనేమి చెప్పలేను, మంచిదైనా, చెడ్డదైనా యెహోవా ఆజ్ఞ దాటి ఏమి చెప్పలేను యెహోవా చెప్పిందే నేను చెప్పాలి.’

14 నేనిప్పుడు నా ప్రజల దగ్గరకు తిరిగి వెళ్తున్నాను. కానీ ముందు ఈ ప్రజలు రాబోయే రోజుల్లో మీ ప్రజలకు ఏమి చేస్తారో చెప్తాను.”


బిలాము నాలుగవ సందేశం

15 అప్పుడు బిలాము ఈ సందేశాన్ని ఇచ్చాడు: “బెయోరు కుమారుడైన బిలాము యొక్క ప్రవచనం, స్పష్టంగా చూడగలిగే కన్ను గలవాని ప్రవచనం,

16 దేవుని మాటలు వినే వాని ప్రవచనం, మహోన్నతుని దగ్గర నుండి తెలివి సంపాదించుకున్నవాడు, సర్వశక్తిగల వాడి నుండి దర్శనం చూసేవాడు, సాష్టాంగపడేవాడు, కళ్లు తెరవబడినవాడు:

17 “అతన్ని చూస్తాను, కానీ ఇప్పుడు కాదు; అతన్ని కనిపెడతాను, కానీ సమీపంగా కాదు. యాకోబు నుండి నక్షత్రం వస్తుంది; ఇశ్రాయేలు నుండి రాజదండం లేస్తుంది. అతడు మోయాబు కణతలను నలగ్గొడతాడు, షేతు ప్రజల కపాలాలను చితకగొడతాడు.

18 ఎదోము జయించబడుతుంది; అతని శత్రువైన శేయీరు జయించబడుతుంది. కానీ ఇశ్రాయేలు బలంగా ఎదుగుతుంది.

19 యాకోబు నుండి రాజ్యమేలేవాడు వస్తాడు. అతడు పట్టణంలో మిగిలిన వారిని నాశనం చేస్తాడు.”


బిలాము యొక్క అయిదవ సందేశం

20 అప్పుడు బిలాము, అమాలేకును చూసి ఈ సందేశాన్ని ఇచ్చాడు: “అమాలేకు దేశాల్లో మొదటిది, కానీ దాని అంతం పూర్తి నాశనమే!”


బిలాము యొక్క ఆరవ సందేశం

21 అతడు కెనీయులను చూసి తన సందేశాన్ని ఇచ్చాడు: “మీ నివాసస్థలం భద్రంగా ఉంది, నీ గూడు బండలో ఉంది;

22 అయినా కెనీయులైన మీరు నాశనమవుతారు అష్షూరు మిమ్మల్ని బందీగా పట్టుకెళ్తుంది.”


బిలాము యొక్క ఏడవ సందేశం

23 తర్వాత అతడు తన సందేశాన్ని ఇచ్చాడు: “అయ్యో, దేవుడు ఇలా చేస్తే, ఎవరు జీవించగలరు?

24 కుప్ర తీరం నుండి ఓడలు వస్తాయి; అవి అష్షూరును, ఏబెరును అణచివేస్తాయి, అయితే మీరు కూడా పతనమవుతారు.”

25 తర్వాత బిలాము లేచి తన ఇంటికి వెళ్లాడు, బాలాకు తన దారిన వెళ్లాడు.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan