Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

సంఖ్యా 22 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


బాలాకు బిలామును ఆహ్వానించుట

1 తర్వాత ఇశ్రాయేలీయులు మోయాబు సమతల మైదానాల వైపు ప్రయాణం చేసి యొర్దాను నది తూర్పుగా, యెరికో వైపు దిగారు.

2 ఇశ్రాయేలు అమోరీయులకు చేసినదంతా సిప్పోరు కుమారుడైన బాలాకు చూశాడు,

3 చాలామంది ఉన్నందున మోయాబు భయపడింది. నిజానికి, ఇశ్రాయేలీయుల వల్ల మోయాబు భయంతో నిండిపోయింది.

4 మోయాబీయులు మిద్యాను పెద్దలతో, “ఈ దండు, ఒక ఎద్దు పొలం లోని గడ్డిని లాక్కున్నట్లు, మన చుట్టూ ఉన్న సమస్తాన్ని లాక్కుంటుంది” అని అన్నారు. కాబట్టి ఆ సమయంలో మోయాబు రాజైన సిప్పోరు కుమారుడైన బాలాకు,

5 యూఫ్రటీసు నదికి సమీపంలో ఉన్న పెతోరు దగ్గర ఉన్న బెయోరు కుమారుడైన బిలామును తన స్వదేశంలో పిలువడానికి దూతలను పంపాడు. బాలాకు అన్నాడు: “ఈజిప్టు నుండి ప్రజలు వచ్చారు; వారు భూ ముఖాన్ని కప్పి, నా ప్రక్కన స్థిరపడ్డారు.

6 నీవు వచ్చి వీరిని శపించాలి, ఎందుకంటే వారు నా శక్తికి మించి ఉన్నారు. బహుశా అప్పుడు నేను వీరిని ఓడించి ఈ స్థలం నుండి తరిమివేయగలుగుతాను. నీవు ఎవరిని దీవిస్తే వారు దీవించబడతారని, నీవు ఎవరిని శపిస్తే వారు శపించబడతారని నాకు తెలుసు.”

7 మోయాబు మిద్యాను పెద్దలు, భవిష్యవాణికి రుసుము తీసుకెళ్లారు. వారు బిలాము దగ్గరకు వచ్చి, బాలాకు చెప్పింది అతనికి చెప్పారు.

8 బిలాము వారితో, “ఈ రాత్రికి ఇక్కడ ఉండండి, యెహోవా నాకు చెప్పేది నేను మీకు తెలియజేస్తాను” అని అన్నాడు. కాబట్టి మోయాబు అధికారులు ఆ రాత్రి అతనితో ఉన్నారు.

9 ఆ రాత్రి దేవుడు వచ్చి బిలామును, “నీతో ఉన్న వీళ్ళు ఎవరు?” అని ప్రశ్నించారు.

10 బిలాము దేవునితో, “సిప్పోరు కుమారుడు, మోయాబు రాజైన బాలాకు, నాకు ఈ సందేశం పంపాడు:

11 ‘ఈజిప్టు నుండి వచ్చిన ఒక ప్రజల గుంపు భూమినంతా కప్పుతుంది. నా కోసం వారిని శపించు. బహుశ అప్పుడు నేను వారితో యుద్ధం చేసి తరిమివేస్తాను.’ ”

12 అయితే దేవుడు బిలాముతో, “నీవు వారితో వెళ్లొద్దు. వారు దీవించబడినవారు కాబట్టి నీవు వారిని శపించకూడదు” అని అన్నారు.

13 మర్నాడు ఉదయం బిలాము బాలాకు అధికారులతో, “మీ సొంత దేశానికి వెళ్లిపొండి, నేను మీతో వెళ్లడానికి యెహోవా నిరాకరించారు” అని చెప్పాడు.

14 కాబట్టి మోయాబు అధికారులు బాలాకు దగ్గరకు తిరిగివెళ్లి, “బిలాము మాతో రావడానికి ఒప్పుకోలేదు” అని చెప్పారు.

15 అప్పుడు బాలాకు ఇతర అధికారులను, మొదటిసారి కన్నా ఇంకా ఎక్కువ మంది ప్రముఖులను, పంపాడు.

16 వారు బిలాము దగ్గరకు వచ్చి అన్నారు: “సిప్పోరు కుమారుడైన బాలాకు ఇలా చెప్తున్నాడు: నా దగ్గరకు రాకుండ ఏది కూడా మిమ్మల్ని ఆపనివ్వకండి,

17 ఎందుకంటే నేను నిన్ను గొప్పగా గౌరవిస్తాను, నీవు నాకు ఏది చెబితే అది చేస్తాను. వచ్చి నా కోసం ఈ ప్రజలపై శాపం పెట్టండి.”

18 అయితే బిలాము వారితో, “బాలాకు తన రాజభవనంలో ఉన్న వెండి బంగారమంతా ఇచ్చినా సరే, నా దేవుడైన యెహోవా ఆజ్ఞకు మించి ఎక్కువ గాని తక్కువ గాని చేయలేను.

19 మీరు రాత్రి ఇక్కడ గడపండి, యెహోవా నాకేమి చెప్తారు తెలుసుకుంటాను” అని చెప్పాడు.

20 ఆ రాత్రి దేవుడు బిలాముతో, “ఈ మనుష్యులు నిన్ను పిలువడానికి వచ్చారు కాబట్టి నీవు వారితో వెళ్లు కానీ నేను చెప్పేది మాత్రమే చేయు” అని అన్నారు.


బిలాము యొక్క గాడిద

21 మర్నాడు ఉదయం బిలాము తన గాడిదకు సీను కట్టుకుని మోయాబు అధికారులతో వెళ్లాడు.

22 కాని బిలాము వెళ్తునప్పుడు దేవుని కోపం రగులుకుంది. యెహోవా దూత మార్గంలో బిలామును అడ్డుకోడానికి నిలబడ్డాడు. బిలాము గాడిద మీద వెళ్తున్నాడు, అతనితో తన ఇద్దరు సేవకులు ఉన్నారు.

23 యెహోవా దూత కత్తి దూసి చేతపట్టుకుని త్రోవలో నిలిచి ఉండడం చూసి గాడిద దారి విడిచి పొలంలోకి వెళ్లింది. అది మార్గంలోకి రావాలని బిలాము దాన్ని కొట్టాడు.

24 అప్పుడు యెహోవా దూత రెండు ద్రాక్షతోటల మధ్య రెండు వైపుల గోడలు ఉన్నచోట నిలబడ్డాడు.

25 యెహోవా దూతను చూసి ఆ గాడిద గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమింది కాబట్టి అతడు గాడిదను మళ్ళీ కొట్టాడు.

26 తర్వాత యెహోవా దూత కొంచెం ముందుకు వెళ్లి, గాడిద కుడివైపు కానీ, ఎడమవైపు కానీ తిరుగకుండునట్లు ఇరుకు స్థలంలో నిలబడ్డాడు.

27 యెహోవా దూతను చూసి గాడిద బిలాము క్రింద నేల మీద పడి ఉన్నది. బిలాము కోపంతో తన చేతికర్రతో గాడిదను కొట్టాడు.

28 అప్పుడు యెహోవా ఆ గాడిద నోరు తెరిచారు, అది బిలాముతో మాట్లాడుతూ, “నేను నీకు ఏమి చేశానని నన్ను మూడుసార్లు కొట్టావు?” అని అన్నది.

29 బిలాము గాడిదకు, “నీవు నన్ను మూర్ఖునిగా ఎంచావు. నా చేతిలో ఖడ్గం ఉండి ఉంటే నిన్ను ఇప్పుడే చంపేసే వాన్ని” అని జవాబిచ్చాడు.

30 గాడిద బిలాముతో, “ఈ రోజు వరకు ప్రతిసారి స్వారీ చేసిన మీ సొంత గాడిదను నేను కాదా? ఇలా ఎప్పుడైనా చేశానా?” అని అడిగింది. “లేదు” అని అతడు అన్నాడు.

31 అప్పుడు యెహోవా బిలాము కళ్లు తెరిచారు, దూసిన ఖడ్గం చేతితో పట్టుకుని దారికి అడ్డుగా ఉన్న యెహోవా దూతను అతడు చూశాడు. బిలాము తలవంచి సాష్టాంగపడ్డాడు.

32 యెహోవా దూత, “నీవెందుకు నీ గాడిదను ఈ మూడుసార్లు కొట్టావు? నీ మార్గం నాశనకరమైనది కాబట్టి నిన్ను అడ్డుకోడానికి వచ్చాను.

33 మూడుసార్లు గాడిద నన్ను చూసి తొలగిపోయింది. ఒకవేళ అది తిరగకపోయి ఉంటే, ఈపాటికి నేను తప్పకుండా నిన్ను చంపేసి గాడిదను వదిలేసేవాన్ని” అని అతనితో అన్నాడు.

34 బిలాము యెహోవా దూతతో, “నేను పాపం చేశాను. నన్ను ఎదుర్కోడానికి నీవు దారికి అడ్డుగా నిలబడ్డావని నేను గ్రహించలేదు. ఇప్పుడు నీకు ఇష్టం లేకపోతే నేను తిరిగి ఇంటికి వెళ్లిపోతాను” అని అన్నాడు.

35 యెహోవా దూత బిలాముతో, “వారితో వెళ్లు కానీ నేను చెప్పేదే నీవు పలకాలి” అని అన్నాడు. కాబట్టి బిలాము బాలాకు అధికారులతో వెళ్లాడు.

36 బిలాము వస్తున్నాడని విని బాలాకు అర్నోను నది సరిహద్దులో ఉన్న మోయాబు పట్టణం పొలిమేరలో అతన్ని కలసుకోడానికి వెళ్లాడు.

37 బాలాకు బిలాముతో, “నిన్ను త్వరగా రమ్మని చెప్పలేదా? నా దగ్గరకు ఎందుకు రాలేదు? నేను నీకు ఘనత ఇవ్వలేనా?” అని అన్నాడు.

38 “ఇప్పుడు నీ దగ్గరకు వచ్చాను కదా” అని బిలాము జవాబిచ్చాడు. “కానీ నాకిష్టమైనది నేను చెప్పలేను. దేవుడు నా నోట్లో పెట్టిందే నేను చెప్పాలి” అని బాలాకుతో అన్నాడు.

39 తర్వాత బిలాము బాలాకు వెంట కిర్యత్-హుచ్చోతుకు వెళ్లాడు.

40 అక్కడ బాలాకు ఎద్దులను గొర్రెలను బలి ఇచ్చాడు, బిలాముకు, అతనితో ఉన్న అధికారులకు కొంత ఇచ్చాడు.

41 మర్నాడు ఉదయం బాలాకు బిలామును బామోత్ బయలుకు తీసుకెళ్లాడు, అక్కడినుండి ఇశ్రాయేలు శిబిరం యొక్క చివరలను చూడగలిగాడు.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan