Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

సంఖ్యా 15 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


అనుబంధ అర్పణలు

1 యెహోవా మోషేతో అన్నారు,

2 “ఇశ్రాయేలీయులతో మాట్లాడుతూ ఇలా చెప్పు: మీకు నివాస స్థలంగా ఇస్తున్న దేశంలో ప్రవేశించిన తర్వాత మీరు

3 యెహోవాకు ఇష్టమైన సువాసన కలుగునట్లు మీ మందల నుండి లేదా పశువుల నుండి అర్పణలు అంటే దహనబలులు గాని బలులు గాని, ప్రత్యేకమైన మ్రొక్కుబడులు గాని స్వేచ్ఛార్పణలు గాని, లేదా పండుగ అర్పణలు గాని అర్పించవచ్చు.

4 అప్పుడు అర్పణ తెచ్చే వ్యక్తి ఒక పావు హిన్ నూనెలో ఒక ఓమెరు నాణ్యమైన పిండి కలిపి యెహోవాకు భోజనార్పణ సమర్పించాలి.

5 దహనబలి లేదా బలి కోసం తెచ్చే ప్రతి గొర్రెపిల్లతో పాటు ఒక పావు హిన్ ద్రాక్షరసం పానార్పణంగా తేవాలి.

6 “ ‘భోజనార్పణ కోసం పొట్టేళ్ళతో పాటు రెండు ఓమెర్ల నాణ్యమైన పిండి ఒక హిన్‌లో మూడవ వంతు నూనెతో కలిపి తేవాలి,

7 దానితో పాటు ఒక హిన్‌లో మూడవ వంతు ద్రాక్షరసం పానార్పణం కోసం తేవాలి. యెహోవాకు ఇష్టమైన సువాసన గలదిగా అర్పించాలి.

8 “ ‘యెహోవాకు ప్రత్యేకమైన మ్రొక్కుబడి లేదా సమాధానబలి కోసం దహనబలిగా లేదా బలిగా అర్పించడానికి కోడెను సిద్ధపరిచేటప్పుడు,

9 కోడెతో పాటు అయితే భోజనార్పణగా మూడు ఓమెర్ల నూనె కలిపిన అర హిన్ లో నాణ్యమైన పిండి,

10 దానితో పాటు అర హిన్ ద్రాక్షరసం పానార్పణం కోసం తేవాలి. అది యెహోవాకు ఇష్టమైన సువాసన గలదిగా ఉంటుంది.

11 ప్రతి కోడె లేదా పొట్టేలు, ప్రతి గొర్రెపిల్ల లేదా మగ మేకపిల్ల ఈ విధంగా సిద్ధపరచబడాలి.

12 ఇలా ప్రతి దానిలోకి, మీరు ఎన్ని సిద్ధం చేస్తారో, అన్నిటికి చేయాలి.

13 “ ‘స్వదేశీయులుగా ఉన్న ప్రతి ఒక్కరు యెహోవాకు ఇష్టమైన సువాసనగల హోమబలి అర్పించినప్పుడు ఇలాగే చేయాలి. వారు ఇలాగే విధులను పాటించాలి.

14 వచ్చే తరాలకు కూడా ఇదే నియమం వర్తిస్తుంది. విదేశీయులు లేదా మీ మధ్య నివసించే ఎవరైనా సరే, యెహోవాకు ఇష్టమైన సువాసనగల హోమబలి అర్పించాలనుకుంటే, మీలాగే వారు కూడా చేయాలి.

15 సమాజంలో ఉండే మీరైనా, విదేశీయులైనా ఒకే చట్టం పాటించాలి; ఇది రాబోయే తరాలకు నిత్య కట్టుబాటుగా ఉంటుంది. యెహోవా దృష్టిలో మీరూ విదేశీయులు ఒక్కటే:

16 మీకూ, మీ మధ్య ఉన్న విదేశీయులకు అవే నియమాలు, అవే నిబంధనలు వర్తిస్తాయి.’ ”

17 యెహోవా మోషేతో అన్నారు,

18 “ఇశ్రాయేలీయులతో మాట్లాడుతూ ఇలా చెప్పు: ‘నేను మిమ్మల్ని తీసుకెళ్తున్న దేశంలో ప్రవేశించినప్పుడు,

19 ఆ దేశం ఆహారాన్ని మీరు తినేటప్పుడు, ఒక భాగం యెహోవాకు అర్పణగా సమర్పించాలి.

20 మీరు రుబ్బిన పిండితో చేసిన మొదటి రొట్టెను నూర్పిడి కళ్ళపు అర్పణగా అర్పించాలి.

21 రాబోయే తరాలకు ఇలా మీ మొదటి పిండి ముద్ద నుండి యెహోవాకు అర్పణను అర్పించాలి.


ఉద్దేశం లేకుండ చేసిన పాపాల కోసం అర్పణ

22 “ ‘సమాజంగా మీరు అనుకోకుండ యెహోవా మోషేకు ఇచ్చిన ఈ ఆజ్ఞలలో దేనినైనా పాటించడంలో ఒకవేళ విఫలమైతే,

23 యెహోవా మోషే ద్వార మీకు ఇచ్చిన ఆజ్ఞలు, యెహోవా వాటిని ఇచ్చిన రోజు నుండి రాబోయే తరాల వరకు కొనసాగిస్తూ,

24 ఒకవేళ తెలియక పొరపాటున మీరితే, అప్పుడు సమాజమంతా యెహోవాకు ఇష్టమైన సువాసనగల దహనబలిగా కోడెను, దానితో పాటు నిర్దేశించిన భోజనార్పణ, పానార్పణలతో, పాపపరిహారబలి కోసం మేకపోతుతో కలిపి అర్పించాలి.

25 యాజకుడు ఇశ్రాయేలు సమాజమంతటి కోసం ప్రాయశ్చిత్తం చేయాలి అప్పుడు వారు క్షమించబడతారు ఎందుకంటే ఆ పాపం ఉద్దేశపూర్వకమైనది కాదు, పైగా వారు పొరపాటున చేసిన తప్పును బట్టి యెహోవాకు వారు హోమబలి పాపపరిహారబలిని అర్పించారు.

26 ప్రజలు అనుకోకుండ తప్పు చేశారు కాబట్టి ఇశ్రాయేలు సర్వసమాజం, వారితో నివసిస్తున్న విదేశీయులు క్షమించబడతారు.

27 “ ‘అయితే ఒక్క వ్యక్తి అనుకోకుండ చేసిన పాపాలకు, ఆ వ్యక్తి పాపపరిహారబలిగా ఏడాది ఆడ మేకను అర్పించాలి.

28 పొరపాటున పాపం చేసిన వారి కోసం యాజకుడు యెహోవా ఎదుట ప్రాయశ్చిత్తం జరిగిస్తాడు, అది జరిగినప్పుడు ఆ వ్యక్తి క్షమించబడతాడు.

29 స్వదేశీయులైన ఇశ్రాయేలీయులైనా వారి మధ్యలో నివసించే విదేశీయులైనా పొరపాటున పాపం చేసినవారందరికి ఒకే చట్టం వర్తిస్తుంది.

30 “ ‘అయితే ఎవరైనా కావాలని పాపం చేస్తే, స్వదేశీయులైనా విదేశీయులైనా వారు యెహోవాను దూషించిన వారు కాబట్టి ఖచ్చితంగా ఇశ్రాయేలీయుల నుండి వారిని తొలగించాలి.

31 వారు యెహోవా మాటను తృణీకరించి, ఆయన ఆజ్ఞలను అతిక్రమించారు, కాబట్టి వారు తప్పక తొలగించబడాలి; వారి అపరాధం వారి మీదే ఉంటుంది.’ ”


సబ్బాతును ఆచరించని వారు చంపబడాలి

32 ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉన్నప్పుడు, ఒక మనుష్యుడు సబ్బాతు దినాన్న కట్టెలు ఏరుకుంటున్నాడు.

33 అది చూసినవారు అతన్ని పట్టుకుని, మోషే అహరోనుల ఎదుట సమాజమందరి ఎదుట నిలబెట్టారు.

34 అతనికి ఏం చేయాలో స్పష్టత లేనందున అతన్ని కావలిలో ఉంచారు.

35 అప్పుడు యెహోవా మోషేతో, “ఆ మనుష్యుడు చావాలి. సమాజమంతా అతన్ని శిబిరం బయటకు తీసుకెళ్లి రాళ్లతో కొట్టాలి.”

36 కాబట్టి యెహోవా మోషేకిచ్చిన ఆజ్ఞ ప్రకారం వారు అతన్ని శిబిరం బయటకు తీసుకెళ్లి రాళ్లతో కొట్టి చంపారు.


వస్త్రాల మీద కుచ్చులు

37 యెహోవా మోషేతో ఇలా అన్నారు,

38 “ఇశ్రాయేలీయులతో మాట్లాడుతూ ఇలా చెప్పు: ‘రాబోయే తరాలన్నిటిలో మీరు మీ వస్త్రాల మూలల్లో నీలం రంగు దారంతో కుచ్చులు తయారుచేయాలి.

39 ఆ కుచ్చులను చూసినప్పుడు యెహోవా ఆజ్ఞలన్నీ మీరు జ్ఞాపకం చేసుకుంటారు, వాటికి లోబడాలని మీ హృదయాభిలాషలు మీ నేత్రాశల వెంటపడుతూ వ్యభిచరించకూడదని జ్ఞాపకం చేసుకుంటారు.

40 అప్పుడు నా ఆజ్ఞలన్నిటికి లోబడాలని జ్ఞాపకం చేసుకుని మీ దేవునికి మీరు ప్రతిష్ఠించుకుంటారు.

41 నేను మీ దేవుడైన యెహోవానై ఉన్నాను, మీకు దేవునిగా ఉండడానికి నేను మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తెచ్చాను. నేను మీ దేవుడైన యెహోవాను.’ ”

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan