Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

నెహెమ్యా 1 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


నెహెమ్యా ప్రార్థన

1 హకల్యా కుమారుడైన నెహెమ్యా మాటలు: ఇరవయ్యవ సంవత్సరం కిస్లేవు నెలలో నేను షూషను కోటలో ఉన్నప్పుడు,

2 నా సోదరులలో ఒకడైన హనానీ మరి కొంతమందితో కలిసి యూదా నుండి వచ్చారు. అప్పుడు చెరలోకి రాకుండా బయటపడి మిగిలి ఉన్న యూదుల గురించి, యెరూషలేము గురించి నేను వారిని అడిగాను.

3 వారు నాతో, “చెరలో పడకుండ బయటపడ్డవారు మన దేశంలోనే ఉన్న ఎంతో శ్రమను అవమానాన్ని అనుభవిస్తున్నారు. యెరూషలేము గోడ కూలిపోయింది. దాని గుమ్మాలు అగ్నితో కాల్చబడ్డాయి” అని చెప్పారు.

4 ఈ మాటలు విన్నప్పుడు నేను క్రింద కూర్చుని ఏడ్చాను. కొన్ని రోజుల వరకు దుఃఖంతో ఉపవాసముండి పరలోకంలో ఉన్న దేవునికి ప్రార్థించాను.

5 నేను ఆయనకు ఇలా ప్రార్థించాను: “యెహోవా పరలోకపు దేవా, అద్భుతమైన గొప్ప దేవా, మిమ్మల్ని ప్రేమించి మీ ఆజ్ఞలను పాటించేవారిపట్ల మీ ప్రేమ ఒడంబడికను మీరు నెరవేరుస్తారు,

6 మీ సేవకులైన ఇశ్రాయేలు ప్రజల కోసం మీ సేవకుడు పగలు రాత్రి మీ ఎదుట చేస్తున్న ప్రార్థనను వినడానికి మీ చెవిని మీ కళ్లను తెరవండి. నేను, నా తండ్రి కుటుంబంతో సహా ఇశ్రాయేలీయులమైన మేము మీకు వ్యతిరేకంగా చేసిన పాపాలను నేను ఒప్పుకుంటున్నాను.

7 మేము మీ పట్ల ఎంతో దుర్మార్గంగా ప్రవర్తించాము. మీరు మీ సేవకుడైన మోషేకు ఇచ్చిన ఆజ్ఞలకు, శాసనాలకు చట్టాలకు మేము లోబడలేదు.

8 “మీరు మీ సేవకుడైన మోషేకు ఇచ్చిన మాట జ్ఞాపకం చేసుకోండి, మీరేమన్నారంటే, ‘మీరు నా పట్ల నమ్మకద్రోహులుగా ప్రవర్తిస్తే, దేశాల మధ్యలోకి మిమ్మల్ని చెదరగొడతాను,

9 కానీ ఒకవేళ మీరు నా వైపు తిరిగి, నా ఆజ్ఞలను అనుసరిస్తే చెరగొనిపోబడిన మీ ప్రజలు ఎంత దూరంలో ఉన్నా నేను వారిని అక్కడినుండి సమకూర్చి నా పేరు కోసం నేను నివాసంగా ఎంచుకున్న ప్రదేశానికి వారిని తీసుకువస్తాను.’

10 “వారు మీ సేవకులైన మీ ప్రజలు, మీ గొప్ప బలంతో, శక్తిగల మీ హస్తంతో మీరు విమోచించిన ప్రజలు.

11 ప్రభువా, మీ సేవకుడనైన నా ప్రార్థనను మీ నామం పట్ల భయభక్తులు కలిగి ఉండడంలో ఆనందించే నీ సేవకుల ప్రార్థనను మీ చెవులతో శ్రద్ధగా వినండి. ఈ రోజు ఈ వ్యక్తికి నాపై దయ పుట్టించి మీ సేవకుడనైన నాకు విజయం ఇవ్వండి.” ఆ సమయంలో నేను రాజుకు గిన్నె అందించే వానిగా ఉన్నాను.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan