Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

మీకా 1 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

1 యోతాము, ఆహాజు, హిజ్కియా అనే యూదా రాజుల పరిపాలన కాలాల్లో మోరెషెతు వాడైన మీకా దగ్గరకు వచ్చిన యెహోవా వాక్కు. సమరయ, యెరూషలేముల గురించి అతడు చూసిన దర్శనం.

2 ప్రజలారా, మీరంతా వినండి, భూమీ, నీవు నీలోని నివాసులందరూ ఆలకించండి, ప్రభువైన యెహోవా మీమీద నేరారోపణ చేయబోతున్నారు, ప్రభువు తన పరిశుద్ధ ఆలయం నుండి మాట్లాడుతున్నారు.


సమరయ యెరూషలేముల మీద తీర్పు

3 చూడండి! యెహోవా తన నివాసస్థలం నుండి వస్తున్నారు; ఆయన దిగి భూమిమీది ఉన్నతస్థలాల మీద నడవబోతున్నారు.

4 అగ్నికి మైనం కరిగినట్లు, వాలు మీద నీరు ప్రవహించినట్లు, ఆయన పాదాల క్రింద పర్వతాలు కరుగుతాయి, లోయలు చీలిపోతాయి.

5 దీనంతటికీ యాకోబు అతిక్రమం, ఇశ్రాయేలు ప్రజల పాపాలే కారణం. యాకోబు అతిక్రమం ఏంటి? అది సమరయ కాదా? యూదా యొక్క క్షేత్రం ఏంటి? అది యెరూషలేము కాదా?

6 “కాబట్టి నేను సమరయను రాళ్ల కుప్పగా చేస్తాను, అది ద్రాక్షతోటలు నాటే స్థలం అవుతుంది. దాని రాళ్లను లోయలో పారవేస్తాను, దాని పునాదులు బయట పడతాయి.

7 దాని విగ్రహాలన్నీ ముక్కలుగా విరగ్గొట్టబడతాయి; దాని గుడి కానుకలన్ని అగ్నితో కాల్చబడతాయి; నేను దాని ప్రతిమలన్నిటినీ నాశనం చేస్తాను. అది వేశ్య సంపాదనతో తన బహుమానాలను పోగుచేసింది కాబట్టి అవి మళ్ళీ వేశ్య జీతంగా ఇవ్వబడతాయి.”


ఏడ్వడం, దుఃఖించడం

8 దీనిని బట్టి నేను ఏడుస్తూ విలపిస్తాను; నేను చెప్పులు లేకుండా, దిగంబరిగా బయట తిరుగుతాను. నేను నక్కలా అరుస్తాను, గుడ్లగూబలాగా మూలుగుతాను.

9 ఎందుకంటే సమరయ తెగులు బాగు చేయలేనిది; అది యూదాకు వ్యాపించింది. అది నా ప్రజల ద్వారాల వరకు, యెరూషలేము వరకు కూడా వ్యాపించింది.

10 ఈ సంగతి గాతు పట్టణంలో చెప్పకండి; ఏమాత్రం ఏడవకండి. బేత్-లీఫ్రాలో నేను ధూళిలో పొర్లాడాను.

11 షాఫీరు వాసులారా, దిగంబరులై సిగ్గు పడుతూ దాటి వెళ్లండి. జయనాను నివాసులు బయటకు రారు. బేత్-ఏజెల్ శోకంలో ఉంది; అది ఇక ఎన్నడు మిమ్మల్ని కాపాడదు.

12 మారోతు వాసులు బాధలో ఉన్నారు, ఉపశమనం కోసం ఎదురు చూస్తున్నారు, ఎందుకంటే, ఎందుకంటే, యెహోవా దగ్గర నుండి కీడు వచ్చింది, అది యెరూషలేము ద్వారం వరకు వచ్చింది.

13 లాకీషులో నివాసులారా, రథాలకు గుర్రాలను కట్టండి. ఇశ్రాయేలు అతిక్రమాలు మీలో కనిపించాయి, సీయోను కుమార్తె పాపానికి ప్రారంభం మీరు.

14 కాబట్టి మీరు మోరెషెత్-గాతుకు వీడుకోలు కానుకలిస్తారు. అక్సీబు పట్టణం ఇశ్రాయేలు రాజులను మోసగిస్తుందని రుజువు అవుతుంది.

15 మరేషా వాసులారా! మీ పట్టణాన్ని స్వాధీనపరచుకునేవారిని పంపుతాను. ఇశ్రాయేలు ఘనులు అదుల్లాముకు పారిపోతారు.

16 మీకు ఇష్టమైన పిల్లల కోసం శోకంలో మీ తలలు గొరిగించుకోండి; రాబందులా బోడితల చేసుకోండి ఎందుకంటే మీ పిల్లలు మీ నుండి బందీలుగా వెళ్తారు.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan