Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

లూకా సువార్త 14 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


ఒక పరిసయ్యుని ఇంట్లో యేసు

1 ఒక సబ్బాతు దినాన, అధికారిగా ఉండిన ఒక పరిసయ్యుని ఇంటికి భోజనానికి యేసు వెళ్లినప్పుడు, కొందరు ఆయన ఏమి చేస్తాడా అని ఆయనను గమనిస్తున్నారు.

2 అక్కడ ఆయన ముందు విపరీతమైన వాపుతో బాధపడుతున్న ఒక రోగి ఉన్నాడు.

3 అప్పుడు యేసు, “సబ్బాతు దినాన స్వస్థపరచడం ధర్మశాస్త్రానుసారమా కాదా?” అని పరిసయ్యులను ధర్మశాస్త్ర నిపుణులను అడిగారు.

4 కానీ వారు ఏ జవాబు ఇవ్వలేదు, అప్పుడు యేసు ఆ రోగి చేయి పట్టుకుని వానిని బాగుచేసి పంపించారు.

5 అప్పుడు ఆయన వారితో, “మీలో ఎవరి కుమారుడు గాని లేదా ఎద్దు గాని సబ్బాతు దినాన గుంటలో పడితే వెంటనే దానిని బయటకు తీయకుండా ఉంటారా?” అని అడిగారు.

6 కాని వారు ఆయనకు జవాబు ఇవ్వలేకపోయారు.

7 ఆహ్వానించబడిన వారు భోజనబల్ల దగ్గర గౌరవ స్థానాలను ఎంచుకోవడం గమనించి, ఆయన వారికి ఈ ఉపమానం చెప్పారు:

8 “ఎవరైనా మిమ్మల్ని పెళ్ళి విందుకు ఆహ్వానిస్తే గౌరవ స్థానంలో కూర్చోకండి, ఎందుకంటే ఒకవేళ మీకంటే గొప్ప వ్యక్తిని ఆహ్వానించి ఉండవచ్చు.

9 ఆ అతిథి వచ్చినప్పుడు నిన్ను ఆహ్వానించినవారు నీ దగ్గరకు వచ్చి, ‘మీరు లేచి వీరిని కూర్చోనివ్వండి’ అని అంటే మీరు అవమానంతో ఎక్కడో చివరికి వెళ్లి కూర్చోవలసి వస్తుంది.

10 అలా కాకుండ, మీరు ఆహ్వానించబడినప్పుడు వెళ్లి చివరి స్థానంలో కూర్చోండి అప్పుడు మిమ్మల్ని ఆహ్వానించినవారు వచ్చి మీతో, ‘స్నేహితుడా, నీవు లేచి ముందున్న గౌరవ స్థానంలో కూర్చో’ అని అంటారు. అప్పుడు అక్కడ ఉన్న ఇతర అతిథులందరి ముందు నీవు గౌరవించబడతావు.

11 తమను తాము హెచ్చించుకొనేవారు తగ్గించబడతారు, తమను తాము తగ్గించుకునేవారు హెచ్చింపబడతారు” అన్నారు.

12 తర్వాత యేసు తనను ఆహ్వానించిన వానితో, “నీవు మధ్యాహ్న భోజనం గాని రాత్రి భోజనం గాని పెట్టినప్పుడు, నీ స్నేహితులనే గాని, సహోదరులు లేదా సహోదరీలనే గాని, బంధువులనే గాని, ధనికులైన పొరుగువారినే గాని ఆహ్వానించవద్దు; ఒకవేళ నీవు అలా చేస్తే, వారు కూడా తమ విందులకు నిన్ను ఆహ్వానించి నీ రుణాన్ని తీర్చేసుకుంటారు.

13 అయితే నీవు విందును ఏర్పాటు చేసినప్పుడు పేదలను, కుంటివారిని, గ్రుడ్డివారిని, వికలాంగులను ఆహ్వానించు,

14 అప్పుడు నీవు దీవించబడతావు. పిలువబడిన వారు నీకు తిరిగి ఏమి ఇవ్వలేకపోయినా, నీతిమంతుల పునరుత్థానంలో నీకు తిరిగి ఇవ్వబడుతుంది” అన్నారు.


గొప్ప విందును గురించిన ఉపమానం

15 అది విని వారితో భోజనానికి కూర్చున్నవారిలో ఒకడు విని, యేసుతో, “దేవుని రాజ్య విందులో తినేవాడు ధన్యుడు” అని అన్నాడు.

16 అందుకు యేసు, “ఒకడు గొప్ప విందు సిద్ధపరుస్తూ చాలామంది అతిథులను ఆహ్వానించాడు.

17 విందు సమయంలో విందుకు పిలువబడినవారిని, ‘రండి, విందు సిద్ధంగా ఉంది’ అని చెప్పడానికి అతడు తన సేవకులను పంపించాడు.

18 “కానీ వారందరు ఒకేలా సాకులు చెప్పడం మొదలుపెట్టారు. మొదటివాడు, ‘నేను ఇప్పుడే ఒక పొలం కొన్నాను కాబట్టి దానిని చూడడానికి తప్పక వెళ్లాలి, దయచేసి నన్ను క్షమించండి’ అన్నాడు.

19 “మరొకడు, ‘నేనిప్పుడే అయిదు జతల ఎడ్లను కొన్నాను, ఇప్పుడు వాటిని చూడడానికి వెళ్తున్నాను, దయచేసి నన్ను క్షమించండి’ అన్నాడు.

20 “మరొకడు, ‘నేను ఇప్పుడే పెళ్ళి చేసుకున్నాను, కాబట్టి నేను రాలేనని’ చెప్పి పంపాడు.

21 “ఆ సేవకుడు తిరిగివచ్చి, తన యజమానికి వారి మాటలను తెలియజేశాడు. ఆ యజమాని ఆ మాటలను విని కోప్పడి ఆ సేవకునితో, ‘నీవు వెంటనే వెళ్లి పట్టణ వీధుల్లో, సందుల్లో ఉన్న బీదలను, అంగహీనులను, కుంటివారిని, గ్రుడ్డివారిని తీసుకురా’ అని ఆదేశించాడు.

22 “ఆ సేవకుడు తన యజమానితో, ‘అయ్యా, నీవు చెప్పినట్లే చేశాను, అయినా ఇంకా చాలా ఖాళీ స్థలం ఉంది’ అన్నాడు.

23 “అందుకు ఆ యజమాని తన సేవకునితో, ‘నా ఇంటిని నింపడానికి వీధుల్లో సందులలోన కనిపించిన వారందరిని లోపలికి రమ్మని బలవంతం చేయి.

24 ఆహ్వానించబడిన వారిలో ఒక్కడు కూడ నేను ఏర్పచిన విందును రుచి చూడడని మీతో చెప్తున్నాను’ అని అన్నారు.”


శిష్యునిగా ఉండడానికి మూల్యం

25 పెద్ద జనసమూహాలు యేసుతో కూడా వెళ్తుండగా, ఆయన వారివైపు తిరిగి అన్నారు:

26 “ఎవరైనా, నా శిష్యునిగా ఉండాలనుకుంటే తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, సహోదర సహోదరీలను, చివరికి తన ప్రాణాన్ని సైతం, వదులుకోడానికి సిద్ధంగా లేకపోతే, నా శిష్యులు కాలేరు.

27 తమ సిలువను ఎత్తుకోకుండా నన్ను వెంబడించేవారు నాకు శిష్యులు కాలేరు.

28 “ఉదాహరణకు మీలో ఎవరైనా ఒక గోపురం కట్టించాలని అనుకుంటే దాన్ని పూర్తి చేయడానికి సరిపడే డబ్బు మీ దగ్గర ఉందా లేదా అని ముందుగా చూసుకోరా?

29 ఎందుకంటే ఒకవేళ మీరు పునాది వేసి, దాన్ని పూర్తి చేయలేకపోతే, చూసే ప్రతి ఒక్కరూ మిమ్మల్ని,

30 ‘వీడు కట్టడం మొదలుపెట్టాడు కాని ముగించలేకపోయాడు’ అంటూ ఎగతాళి చేస్తారు.

31 “ఒక రాజు మరొక రాజుపై యుద్ధం చేయబోయేటప్పుడు, ఇరవై వేలమంది సైన్యంతో తన మీదికి వస్తున్న వాన్ని పదివేలమంది సైన్యంతో ఎదిరించగలనా అని అతడు ముందుగానే కూర్చుని ఆలోచించడా?

32 ఒకవేళ అతనికి అది అసాధ్యం అనిపిస్తే, శత్రువు ఇంకా దూరంలో ఉండగానే శాంతి నిబంధనలను చర్చించడానికి అతడు ఒక ప్రతినిధి బృందాన్ని పంపుతాడు.

33 అదే విధంగా, మీరు కూడా మీరు కలిగి ఉన్న ప్రతిదాన్ని వదులుకోనట్లైతే నా శిష్యులు కాలేరు.

34 “ఉప్పు మంచిదే, కాని ఒకవేళ అది తన సారం కోల్పోతే, అది తిరిగి సారవంతం ఎలా చేయబడుతుంది?

35 అది నేలకు గాని ఎరువు కుప్పకు గాని పనికిరాదు; అది బయట పారవేయబడుతుంది. “వినడానికి చెవులుగలవారు విందురు గాక!”

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan