లేవీయకాండము 27 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథంయెహోవాకు చెందిన దానిని విడిపించడం 1 యెహోవా మోషేతో అన్నారు, 2 “ఇశ్రాయేలీయులతో మాట్లాడి వారితో చెప్పు: ‘ఒకవేళ సమాన విలువను ఇవ్వడం ద్వారా ఒక వ్యక్తిని యెహోవాకు అంకితం చేయడానికి ఎవరైనా ప్రత్యేక మ్రొక్కుబడి చేస్తే, 3 పురుషులకైతే ఇరవై సంవత్సరాల వయస్సు మొదలుకొని అరవై సంవత్సరాల వయస్సు వరకు పరిశుద్ధాలయ షెకెల్ ప్రకారం యాభై షెకెళ్ళ వెండి, వెల నిర్ణయించాలి; 4 స్త్రీలకు వెల ముప్పై షెకెళ్ళ వెండి నిర్ణయించాలి; 5 అయిదు సంవత్సరాల నుండి ఇరవై సంవత్సరాల లోపు వయస్సుగల వారైతే మగపిల్లవాడికి వెల ఇరవై షెకెళ్ళ వెండి, ఆడపిల్లకు వెల పది షెకెళ్ళ వెండిగా నిర్ణయించాలి; 6 నెల మొదలుకొని అయిదు సంవత్సరాల వయస్సుగల మగపిల్లవాడికి వెల అయిదు షెకెళ్ళ వెండి, ఆడపిల్లకు మూడు షెకెళ్ళ వెండిగా నిర్ణయించాలి; 7 అరవై సంవత్సరాలు మొదలుకొని ఆపై వయస్సుగల పురుషునికి వెల పదిహేను షెకెళ్ళ వెండిగా, స్త్రీకి వెల పది షెకెళ్ళ వెండిగా నిర్ణయించాలి. 8 మ్రొక్కుబడి చేసిన ఎవరైనా నిర్దిష్టమైన మొత్తాన్ని చెల్లించలేనంత పేదవారైతే, ప్రతిష్ఠించబడిన వ్యక్తి యాజకునికి సమర్పించబడాలి, అతడు మ్రొక్కుబడి చేసిన వ్యక్తి స్తోమత ప్రకారం విలువను నిర్ణయిస్తాడు. 9 “ ‘ఒకవేళ వారు ప్రమాణం చేసినది ఒక జంతువై అది యెహోవాకు అంగీకారమైన అర్పణ అయితే, అలాంటి జంతువు యెహోవాకు ఇచ్చినప్పుడు పరిశుద్ధమవుతుంది. 10 వారు దానిని మార్చుకోవడం లేదా ప్రతిమార్పిడి చేయకూడదు లేదా చెడ్డ దానికి బదులుగా మంచిది, లేదా మంచి దాని బదులు చెడ్డ దానిని ప్రతిమార్పిడి చేయకూడదు; ఒకవేళ వారు ఒక జంతువుకు బదులుగా మరొకదానిని ప్రతిమార్పిడి చేయాలనుకుంటే, అప్పుడు ఇది, ప్రతిమార్పిడి చేసినది రెండూ పరిశుద్ధమవుతాయి. 11 ఒకవేళ వారు ప్రమాణం చేసిన జంతువు ఆచారరీత్య అపవిత్రమైనదై ఒక అర్పణగా యెహోవాకు అంగీకారమైంది కానట్లైతే, ఆ జంతువును యాజకునికి సమర్పించాలి, 12 అతడు దాని నాణ్యత మంచిదా లేదా చెడ్డదా అని నిర్ణయిస్తాడు. యాజకుడు ఏ విలువను నిర్ణయిస్తే, అదే అవుతుంది. 13 ఒకవేళ యజమాని జంతువును విడిపించాలనుకుంటే, దాని విలువకు అయిదవ భాగాన్ని కలపాలి. 14 “ ‘ఒకవేళ ఎవరైనా తమ ఇంటిని పరిశుద్ధమైనదిగా యెహోవాకు ప్రతిష్ఠిస్తే, దాని నాణ్యత మంచిదా లేదా చెడ్డదా అని యాజకుడు నిర్ణయిస్తాడు. యాజకుడు అప్పుడు ఏ వెలను నిర్ణయిస్తే అదే ఉంటుంది. 15 ఒకవేళ తమ ఇంటిని ప్రతిష్ఠించినవారు దానిని విడిపించాలనుకుంటే, వారు దాని వెలకు అయిదవ వంతు కలపాలి, ఆ ఇల్లు మళ్ళీ వారిది అవుతుంది. 16 “ ‘ఒకవేళ ఎవరైనా తమ కుటుంబ భూమిలో కొంత భాగాన్ని యెహోవాకు ప్రతిష్ఠిస్తే, దానికి అవసరమయ్యే విత్తన మొత్తాన్ని బట్టి దాని వెల నిర్ణయించబడుతుంది. ఒక హోమెరు యవలు విత్తనాల వెల యాభై షెకెళ్ళ వెండి. 17 యాభైయవ వార్షికోత్సవంలో వారు భూమిని ప్రతిష్ఠిస్తే, నిర్ణయించబడిన వెల కొనసాగుతుంది. 18 కాని ఒకవేళ యాభైయవ వార్షికోత్సవం తర్వాత భూమిని ప్రతిష్ఠిస్తే, మరుసటి వార్షికోత్సవం వరకు మిగిలి ఉన్న సంవత్సరాల ప్రకారం యాజకుడు వెల నిర్ణయిస్తాడు, దాని నిర్ణయించబడిన వెల తగ్గుతుంది. 19 ఒకవేళ భూమిని ప్రతిష్ఠించినవాడు దానిని విడిపించాలనుకుంటే, వారు దాని వెలకు అయిదవ వంతు కలపాలి, అప్పుడు పొలం మళ్ళీ వారిది అవుతుంది. 20 ఒకవేళ, వారు పొలాన్ని విడిపించకపోతే, లేదా వారు దానిని వేరొకరికి అమ్మినట్లయితే, అది ఎప్పటికీ విడిపించబడదు. 21 యాభైయవ వార్షికోత్సవంలో పొలం విడిపించబడినప్పుడు, యెహోవాకు ప్రతిష్ఠించబడిన పొలంలా, అది పరిశుద్ధమవుతుంది; అది యాజకత్వపు ఆస్తి అవుతుంది. 22 “ ‘ఎవరైనా తాము కొనిన తమ కుటుంబ భూమిలో భాగం కానిది, యెహోవాకు అంకితం చేస్తే, 23 యాభైయవ వార్షికోత్సవం వరకు యాజకుడు దాని వెలను నిర్ణయిస్తాడు, యజమాని అది యెహోవాకు చెందిన పరిశుద్ధమైనదిగా దాని వెల ఆ రోజున చెల్లించాలి. 24 యాభైయవ వార్షికోత్సవంలో ఆ పొలం ఎవరినుండి కొనుగోలు చేయబడిందో, అది తిరిగి ఆ వ్యక్తికే అనగా ఆ పొలం ఎవరిదో వారిదే అవుతుంది. 25 ప్రతి వెల పరిశుద్ధాలయ షెకెల్ ప్రకారం నిర్ణయించబడాలి, షెకెల్ ఒకటికి ఇరవై గెరాలు. 26 “ ‘అయినప్పటికీ, జంతువు యొక్క మొదట పుట్టిన సంతానాన్ని ఎవరూ ప్రతిష్ఠించకూడదు, ఎందుకంటే మొదట సంతానం అప్పటికే యెహోవాకు చెందినది; ఒక ఎద్దు అయినా లేదా గొర్రె అయినా, అది యెహోవాదే. 27 ఒకవేళ అది అపవిత్రమైన జంతువుల్లో ఒకటి అయితే, దానికి నిర్ణయించబడిన వెలకు, అయిదవ వంతు కలిపి తిరిగి దానిని కొనవచ్చు. ఒకవేళ అది విడిపించబడకపోతే, దానికి నిర్ణయించబడిన వెలకు అమ్మబడాలి. 28 “ ‘కానీ ఒక వ్యక్తి తనకు చెందిన మనిషైనా జంతువైనా కుటుంబ భూమియైనా యెహోవాకు ప్రతిష్ఠిస్తే దాన్ని అమ్మకూడదు, విడిపించకూడదు; యెహోవాకు ప్రతిష్ఠితమైన ప్రతిదీ అతిపరిశుద్ధము. 29 “ ‘మనుష్యులు నాశనం చేయబడడానికి ప్రతిష్ఠించిన వాటిని విమోచన క్రయధనం చెల్లించి విడిపించకూడదు; వాటిని చంపాల్సిందే. 30 “ ‘భూమి నుండి వచ్చే ప్రతి దానిలో నుండి దశమభాగం, అది భూమి నుండి వచ్చే ధాన్యమైనా లేదా చెట్ల నుండి వచ్చే ఫలాలైనా, యెహోవాకు చెందినది; అది యెహోవాకు పరిశుద్ధమైనది. 31 ఎవరైనా తమ దశమభాగంలో దేనినైన విడిపించుకోవాలంటే దాని వెలకు అయిదవ వంతు కలపాలి. 32 మంద, గొర్రెల మంద నుండి ప్రతీ దశమభాగం అనగా గొర్రెల కాపరి కర్ర క్రిందనుండి వెళ్లే ప్రతి పదవ జంతువు యెహోవాకు పరిశుద్ధంగా ఉంటుంది. 33 చెడు నుండి మంచిని తీసుకోకూడదు లేదా ప్రతిమార్పిడి చేయకూడదు. ఒకవేళ ఎవరైనా ప్రతిమార్పిడి చేస్తే జంతువు, దాని ప్రతిమార్పిడి రెండూ పవిత్రమవుతాయి, అవి విడిపించబడలేవు.’ ” 34 ఇవి సీనాయి పర్వతం దగ్గర యెహోవా ఇశ్రాయేలీయుల కోసం మోషేకు ఇచ్చిన ఆజ్ఞలు. |
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.
Biblica, Inc.