Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

లేవీయకాండము 23 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


నియమించబడిన పండుగలు

1 యెహోవా మోషేతో ఇలా అన్నారు,

2 “ఇశ్రాయేలీయులతో మాట్లాడి ఇలా చెప్పు: ‘నేను నియమించిన పండుగలు, యెహోవాకు నియమించబడిన పండుగలు, మీరు పరిశుద్ధ సమాజంగా చాటాల్సిన పండుగలు ఇవి.


సబ్బాతు

3 “ ‘వారంలో ఆరు రోజులు పని చేయాలి, కాని ఏడవ రోజు సబ్బాతు విశ్రాంతి దినం, పరిశుద్ధ సమాజపు రోజు. అప్పుడు మీరు ఏ పని చేయకూడదు; మీరు ఎక్కడ నివసించినా, అది యెహోవాకు సబ్బాతు దినము.


పస్కా, పులియని రొట్టెల పండుగ

4 “ ‘ఇవి యెహోవాకు నియమించబడిన పండుగలు, వీటిని మీరు పరిశుద్ధ సమాజానికి వాటి నియామక సమయాల్లో ప్రకటించాలి:

5 మొదటి నెల పద్నాలుగవ రోజు సాయంత్రం యెహోవా యొక్క పస్కా పండుగ ప్రారంభము.

6 ఆ నెల పదిహేనవ రోజు యెహోవా యొక్క పులియని రొట్టెల పండుగ మొదలవుతుంది; ఏడు రోజులు మీరు పులియని రొట్టెలు తినాలి.

7 మొదటి రోజు పరిశుద్ధ సభను నిర్వహించాలి, పనులేవీ చేయకూడదు.

8 ఏడు రోజులు యెహోవాకు హోమబలులు అర్పించాలి. ఏడవ రోజు పరిశుద్ధ సభను నిర్వహించాలి, జీవనోపాధి కోసమైన పనులేవీ చేయకూడదు.’ ”


ప్రథమ ఫలాల అర్పణ

9 యెహోవా మోషేతో ఇలా అన్నారు,

10 “ఇశ్రాయేలీయులతో మాట్లాడి వారితో ఇలా చెప్పు: ‘నేను మీకు ఇవ్వబోతున్న దేశంలోకి మీరు ప్రవేశించినప్పుడు మీరు దాని పంటను కోయండి, మీరు పండించిన మొదటి ధాన్యం యొక్క పనను యాజకుని దగ్గరకు తీసుకుని రండి.

11 అతడు యెహోవా ఎదుట ఆ పనను పైకెత్తి దానిని అర్పించాలి తద్వార అది మీ పక్షంగా అంగీకరించబడుతుంది; దానిని యాజకుడు సబ్బాతు తర్వాత రోజున పైకెత్తి ఆడించాలి.

12 పనను పైకెత్తి అర్పించిన రోజు, లోపం లేని ఒక ఏడాది గొర్రెపిల్లను యెహోవాకు దహనబలిగా అర్పించాలి,

13 దాని భోజనార్పణతో పాటు రెండు ఓమెర్ల నాణ్యమైన పిండిని నూనెతో కలిపి యెహోవాకు ఇష్టమైన సువాసనగల హోమబలిగా ఒక పావు హిన్ ద్రాక్షరసాన్ని పానార్పణగా సమర్పించాలి.

14 మీరు ఈ అర్పణను మీ దేవునికి తీసుకువచ్చే రోజు వరకు ఏ రొట్టె గాని, కాల్చిన ధాన్యం గాని లేదా క్రొత్త ధాన్యం గాని తినకూడదు. మీరు ఎక్కడ నివసించినా, రాబోయే తరాలకు ఇది నిత్య కట్టుబాటుగా ఉంటుంది.


వారాల పండుగ

15 “ ‘సబ్బాతు దినం మరుసటి నుండి, మీరు ప్రత్యేక అర్పణ యొక్క పనను తెచ్చిన దినం నుండి, ఏడు వారాలు పూర్తిగా లెక్కించాలి.

16 ఏడవ సబ్బాతు దినానికి సరిగ్గా యాభై రోజులు లెక్కించాలి, అప్పుడు యెహోవాకు క్రొత్త ధాన్య అర్పణ అర్పించాలి.

17 మీరు ఎక్కడ నివసిస్తున్నారో అక్కడినుండి, రెండు ఓమెర్ల నాణ్యమైన పిండితో రెండు రొట్టెలను పులిసిన దానితో కాల్చి, యెహోవాకు అర్పించే ప్రథమ ఫలాల ప్రత్యేక అర్పణగా తీసుకురండి.

18 ఈ రొట్టెతో పాటు లోపం లేని ఏడు ఏడాది మగ గొర్రెపిల్లలను, ఒక చిన్న ఎద్దును, రెండు పొట్టేళ్లను సమర్పించాలి. భోజనార్పణలు, పానార్పణలతో పాటు అవి యెహోవాకు దహనబలిగా ఉంటాయి, అది యెహోవాకు ఇష్టమైన సువాసనగల హోమబలి.

19 పాపపరిహారబలి కోసం మేకపోతును, సమాధానబలిగా రెండు ఏడాది మగ గొర్రెపిల్లను అర్పించాలి.

20 యాజకుడు రెండు గొర్రెపిల్లలను ప్రథమ ఫలాల రొట్టెలతో పాటు యెహోవా ఎదుట పైకెత్తి ప్రత్యేక అర్పణగా అర్పించాలి. అవి యాజకుని కోసం యెహోవాకు అర్పించే పరిశుద్ధ అర్పణలు.

21 అదే రోజు పరిశుద్ధ సభను ప్రకటించాలి, జీవనోపాధి కోసమైన పనులేవీ చేయకూడదు. మీరెక్కడున్నా ఇది రాబోయే తరాలకు నిత్య కట్టుబాటుగా ఉంటుంది.

22 “ ‘మీరు మీ భూమి యొక్క పంటను కోసినప్పుడు, మీ పొలం అంచుల మట్టుకు కోయకండి లేదా మీ పంట కోతలను సేకరించకండి. పేదల కోసం, మీ మధ్య నివసించే విదేశీయుల కోసం వాటిని వదిలేయండి. నేను మీ దేవుడనైన యెహోవాను.’ ”


బూరల పండుగ

23 యెహోవా మోషేతో అన్నారు,

24 “ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు: ‘ఏడవ నెల మొదటి రోజున మీరు సబ్బాతు విశ్రాంతి దినం, బూర ధ్వనితో స్మరించుకుంటూ పరిశుద్ధ సభ నిర్వహించాలి.

25 సాధారణ పని చేయకూడదు కాని యెహోవాకు హోమబలి అర్పించాలి.’ ”


ప్రాయశ్చిత్త దినం

26 యెహోవా మోషేతో అన్నారు,

27 “ఈ ఏడవ నెల పదవ రోజు ప్రాయశ్చిత్త దినము. పరిశుద్ధ సభ నిర్వహించి, మీరు ఉపవాసముండాలి, యెహోవాకు హోమబలి సమర్పించాలి.

28 ఆ రోజు ఎలాంటి పని చేయకూడదు, ఎందుకంటే అది ప్రాయశ్చిత్త దినం, మీ దేవుడైన యెహోవా ఎదుట మీ కోసం ప్రాయశ్చిత్తం చేయబడుతుంది.

29 ఆ రోజున తమను తాము ఉపేక్షించుకొనని వారు తమ ప్రజల నుండి తొలగించబడాలి.

30 ఆ రోజు ఎవరైనా పని చేస్తే, వారని తమ ప్రజల నుండి నిర్మూలం చేస్తాను.

31 మీరు ఏ పని చేయకూడదు. మీరు ఎక్కడున్నా, రాబోయే తరాలకు ఇది నిత్య కట్టుబాటుగా ఉంటుంది.

32 అది మీకు సబ్బాతు విశ్రాంతి దినం, మీరు ఉపవాసముండాలి. ఆ నెల తొమ్మిదవ రోజు సాయంత్రం నుండి మర్నాడు సాయంత్రం వరకు సబ్బాతును ఆచరించాలి.”


గుడారాల పండుగ

33 యెహోవా మోషేతో ఇలా అన్నారు,

34 “ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు: ‘ఏడవ నెల పదిహేనవ రోజున యెహోవా యొక్క గుడారాల పండుగ ప్రారంభమవుతుంది, అది ఏడు రోజులు ఉంటుంది.

35 మొదటి రోజు పరిశుద్ధ సభ నిర్వహించాలి; ఆ రోజు జీవనోపాధి కోసమైన పనులేవీ చేయకూడదు.

36 ఏడు రోజులు యెహోవాకు హోమబలులు అర్పించాలి, ఎనిమిదవ రోజు పరిశుద్ధ సభ నిర్వహించి యెహోవాకు హోమబలి అర్పించాలి. అది ప్రత్యేక సభ ముగింపు; అప్పుడు జీవనోపాధి కోసమైన పనులేవీ చేయకూడదు.

37 “ ‘ఇవి యెహోవా నియమించబడిన పండుగలు, వీటిని యెహోవాకు హోమబలులు, దహనబలులు, భోజనార్పణలు, బలులు, పానార్పణలు తీసుకురావడానికి పరిశుద్ధ సభలుగా మీరు ప్రకటించాలి. ఏ రోజు అర్పణ ఆ రోజు తీసుకురావాలి.

38 ఇవి యెహోవా సబ్బాతులకు, మీ బహుమానాలకు, మ్రొక్కుబడులకు, యెహోవాకు అర్పించే స్వేచ్ఛార్పణలన్నిటికి అధనంగా అర్పించవలసిన అర్పణలు.

39 “ ‘ఏడవ నెల పదిహేనవ రోజు నుండి మీరు పొలం పంట కూర్చుకున్న తర్వాత యెహోవాకు ఏడు రోజుల పండుగ ఆచరించాలి; మొదటి రోజు సబ్బాతు విశ్రాంతి దినం, ఎనిమిదవ రోజు కూడా సబ్బాతు విశ్రాంతి దినము.

40 మొదటి రోజున మీరు మనోహరమైన చెట్ల కొమ్మలు, తాటి మట్టలు, కాలువల ప్రక్కన ఉండే నిరవంజి చెట్ల కొమ్మలు, ఇతర నిరవంజి చెట్ల కొమ్మలను పట్టుకుని మీ దేవుడైన యెహోవా ఎదుట ఏడు రోజులు ఆనందించండి.

41 ప్రతి సంవత్సరం ఈ పండుగ యెహోవా కోసం ఏడు రోజులు మీరు ఆచరించాలి. ఇది రాబోయే తరాలకు నిత్య కట్టుబాటుగా ఉంటుంది; దీనిని ఏడవ నెలలో ఆచరించాలి.

42 ఏడు రోజులు తాత్కాలిక ఆశ్రయాలలో నివసించండి: స్థానికంగా జన్మించిన ఇశ్రాయేలీయులందరు అలాంటి ఆశ్రయాలలో నివసించాలి.

43 తద్వార ఇశ్రాయేలీయులను నేను ఈజిప్టు నుండి బయటకు తెచ్చిన తర్వాత వారిని తాత్కాలిక ఆశ్రయాలలో నివసింపజేశానని మీ సంతతివారు తెలుసుకుంటారు. నేను మీ దేవుడనైన యెహోవాను.’ ”

44 కాబట్టి మోషే ఇశ్రాయేలీయులకు యెహోవా నియమించబడిన పండుగలను ప్రకటించాడు.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan