విలాపవాక్యములు 4 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 బంగారం తన మెరుపును ఎలా కోల్పోయింది, మంచి బంగారం ఎలా మొద్దుబారిపోయింది! ప్రతి వీధి మూలలో ప్రశస్తమైన రాళ్ల వంటి రత్నాలు చెల్లాచెదురుగా ఉన్నాయి. 2 ప్రశస్తమైన సీయోను పిల్లలు ఎలా అయిపోయారు, ఒకప్పుడు వారి విలువ బంగారంతో తూగేది, ఇప్పుడు మట్టి కుండలుగా, కుమ్మరి చేతి పనిగా పరిగణించబడుతున్నారు! 3 నక్కలు కూడా తమ పిల్లలకు పాలివ్వడానికి తమ రొమ్ములిస్తాయి, కానీ నా ప్రజలు ఎడారిలో నిప్పుకోడిలా హృదయం లేనివారయ్యారు. 4 దాహం వల్ల పసివారి నాలుక నోటి అంగిటికి అంటుకుపోతుంది; పిల్లలు ఆహారం కోసం వేడుకుంటారు, కానీ ఎవరూ వారికి ఇవ్వరు. 5 ఒకప్పుడు రుచికరమైన పదార్ధాలు తిన్నవారు వీధుల్లో నిరుపేదలు. రాజ ఊదా రంగులో పెరిగిన ఇప్పుడు బూడిద కుప్పల మీద పడుకున్నారు. 6 సొదొమ శిక్ష కంటే నా ప్రజల శిక్ష గొప్పది, ఆమెకు సహాయం చేయడానికి చేయి లేకుండానే క్షణాల్లో పడగొట్టబడింది. 7 అందలి అధిపతులు మంచుకంటే స్వచ్ఛమైన వారు, పాలకంటే తెల్లని వారు. శరీరాలు పగడాలకంటే ఎర్రగా ఉన్నాయి, వారి దేహకాంతి నీలమణి లాంటిది. 8 అలాంటివారి ఆకారం బొగ్గు కంటే నలుపుగా అయింది, వీధుల్లో వారిని చూసి వారిని గుర్తు పట్టలేదు. వారి చర్మం వారి ఎముకలకు అంటుకుపోయి ఎండిన కర్రలా అయింది. 9 కరువు వారిని దెబ్బతీసింది, పంటలు పండవు. ఈ బాధకు క్షీణించిపోయారు, ఇంతకంటే ఖడ్గం చేత చావడం మహా భాగ్యం అనిపిస్తుంది. 10 కనికరంగల స్త్రీలు తమ సొంత చేతులతో తమ పిల్లలను వండుకున్నారు, నా ప్రజలు నాశనమైనప్పుడు, వారికి ఆహారం అయ్యారు. 11 యెహోవా తన కోపాన్ని పూర్తిగా చల్లార్చారు. ఆయన తన తీవ్రమైన కోపాన్ని కుమ్మరించాడు. ఆయన సీయోనులో అగ్నిని రప్పించారు, అది దాని పునాదులను దహించివేసింది. 12 శత్రువులు, శత్రువులు యెరూషలేము గుమ్మాల్లోకి ప్రవేశించవచ్చని భూరాజులు నమ్మలేదు, ప్రపంచంలోని జనాంగలెవరూ నమ్మలేదు. 13 అయితే అది ఎందువల్ల జరిగిందంటే, నీతిమంతుల రక్తాన్ని చిందించిన దాని ప్రవక్తల పాపాల వల్ల, దాని యాజకుల దోషాల వల్ల జరిగింది. 14 ఇప్పుడు వారు గ్రుడ్డివారిలా వీధుల్లో తడుముతూ తిరుగుతున్నారు. వారు రక్తంతో ఎంతగా అపవిత్రం అయ్యారంటే, వారి వస్త్రాలను తాకడానికి ఎవరూ సాహసించరు. 15 “వెళ్లిపొండి! మీరు అపవిత్రులు!” అని ప్రజలు గట్టిగా వారిమీద అరుస్తారు. “దూరం! దూరం! మమ్మల్ని తాకవద్దు!” అని వారు పారిపోయి, తిరుగులాడుతున్నప్పుడు, దేశాల్లో ఉన్న ప్రజలు, “వారు ఇకపై ఇక్కడ ఉండడానికి వీల్లేదు” అని అంటారు. 16 యెహోవా తానే వారిని చెదరగొట్టారు; ఆయన ఇకపై వారిని పట్టించుకోరు. యాజకుల పట్ల ఇక గౌరవం చూపించరు, పెద్దల పట్ల దయ చూపించరు. 17 పైగా, సహాయం కోసం వ్యర్థంగా, మేము మా గోపురాల నుండి; మమ్మల్ని రక్షించలేని దేశం కోసం ఎదురుచూస్తూ మా కళ్లు క్షీణించిపోయాయి. 18 ప్రజలు అడుగడుగునా మమ్మల్ని పొంచి ఉన్నారు, మేము మా వీధుల్లో నడవలేకపోయాము. మా అంతం దగ్గరపడింది, మా రోజులు లెక్కించబడ్డాయి, మా అంతం వచ్చింది. 19 మమ్మల్ని వెంటాడుతున్నవారు ఆకాశంలో ఎగిరే గ్రద్ద కంటే వేగంగా ఉన్నారు; పర్వతాల మీదుగా మమల్ని వెంబడించి ఎడారిలో మాకోసం వేచి ఉన్నారు. 20 యెహోవా అభిషిక్తుడు, మన ప్రాణానికి ఊపిరి. వారి ఉచ్చులో చిక్కుకున్నాడు. ఆయన నీడలో మనం ప్రజలమధ్య జీవిస్తాం అని అనుకున్నాము. 21 ఎదోము కుమారీ, ఊజు దేశంలో నివసిస్తున్నదానా, ఆనందించి సంతోషించు. అయితే గిన్నె మీకు కూడా పంపబడుతుంది; నీవు త్రాగి మత్తెక్కి వస్త్రాలు ఊడిపోయి నగ్నంగా ఉంటావు. 22 సీయోను కుమారీ, నీ శిక్ష పూర్తి కాబోతుంది; ఆయన మీ చెరను పొడిగించరు. కానీ ఎదోము కుమారీ, ఆయన నీ పాపాన్ని శిక్షిస్తారు, నీ దుర్మార్గాన్ని బట్టబయలు చేస్తారు. |
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.
Biblica, Inc.