Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

విలాపవాక్యములు 3 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

1 యెహోవా ఉగ్రత కర్ర చేత నేను బాధను అనుభవించిన వాన్ని.

2 ఆయన నన్ను వెళ్లగొట్టి, వెలుగులో కాకుండా చీకటిలో నడిచేలా చేశారు.

3 నిజానికి, ఆయన రోజంతా మాటిమాటికి నా మీద తన చేయి ఆడిస్తానే ఉన్నారు.

4 ఆయన నా చర్మాన్ని, నా మాంసాన్ని క్షీణించిపోయేలా చేసి నా ఎముకలను విరగ్గొట్టారు.

5 ఆయన నన్ను ముట్టడించి, విషంతో కఠినత్వంతో నన్ను చుట్టుముట్టారు.

6 ఎప్పుడో చనిపోయినవారు పడి ఉన్నట్లుగా ఆయన నన్ను చీకటిలో పడి ఉండేలా చేశారు.

7 నేను తప్పించుకోకుండా ఆయన నా చుట్టూ గోడ కట్టించారు; బరువైన గొలుసులతో ఆయన నన్ను బంధించారు.

8 నేను సహాయం కోసం పిలిచినా, మొరపెట్టినా ఆయన నా ప్రార్థనకు తన చెవులు మూసుకుంటారు.

9 ఆయన రాళ్లను నా దారికి అడ్డుపెట్టారు; ఆయన నా మార్గాలను వంకర చేశారు.

10 పొంచి ఉన్న ఎలుగుబంటిలా, దాక్కున్న సింహంలా,

11 ఆయన నన్ను దారిలో నుండి ఈడ్చుకెళ్లి, నన్ను ముక్కలు చేసి, నిస్సహాయ స్థితిలో వదిలేశారు.

12 ఆయన తన విల్లు తీసి, తన బాణాలకు నన్ను లక్ష్యంగా చేసుకున్నారు.

13 ఆయన తన అంబుల పొదిలోని బాణాలతో, నా గుండెను గుచ్చారు.

14 నేను నా ప్రజలందరికి నవ్వులాటగా మారాను; రోజంతా వారు పాటలో నన్ను హేళన చేస్తున్నారు.

15 ఆయన నాతో చేదు మూలికలు తినిపించారు, త్రాగడానికి చేదు పానీయాన్ని ఇచ్చారు.

16 ఆయన రాళ్లతో నా పళ్లను విరగ్గొట్టారు; నన్ను దుమ్ములో త్రొక్కారు.

17 సమాధానం నాకు దూరమైంది, అభివృద్ధి అంటే ఏంటో మరచిపోయాను.

18 కాబట్టి, “నా వైభవం పోయింది, యెహోవా నుండి నేను ఆశించినవన్నీ పోయాయి” అని నేనన్నాను.

19 నా శ్రమ, నా నిరాశ్రయ స్థితి, నేను త్రాగిన చేదు పానీయం జ్ఞాపకం చేసుకోండి.

20 నేను వాటిని బాగా జ్ఞాపకముంచుకున్నాను, నా ప్రాణం నాలో కృంగి ఉంది.

21 అయినప్పటికీ నేను ఇది జ్ఞాపకం చేసుకుంటాను, కాబట్టి నాకు నిరీక్షణ ఉంది:

22 యెహోవా మహా ప్రేమను బట్టి మనం నాశనం కాలేదు, ఎందుకంటే ఆయన కనికరం ఎన్నటికీ తగ్గదు.

23 ప్రతి ఉదయం అవి క్రొత్తవిగా ఉంటాయి; మీ నమ్మకత్వం గొప్పది.

24 నాలో నేను, “యెహోవా నా స్వాస్థ్యం; కాబట్టి నేను ఆయన కోసం వేచి ఉంటాను” అని అనుకుంటున్నాను.

25 తన మీద నిరీక్షణ కలిగి ఉన్నవారికి, తనను వెదికేవారికి యెహోవా మేలు చేస్తారు;

26 యెహోవా రక్షణ కోసం ఓపికతో వేచి ఉండడం మంచిది.

27 ఒక మనిషి యవ్వన దశలో ఉన్నప్పుడే, కాడి మోయడం అతనికి మేలు.

28 యెహోవాయే దాన్ని అతని మీద ఉంచారు, కాబట్టి అతడు ఒంటరిగా మౌనంగా కూర్చోవాలి.

29 అతడు తన ముఖం ధూళిలో పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇంకా నిరీక్షణ ఉండవచ్చు.

30 తనను కొట్టేవానికి తన చెంపను చూపించి, నిండా అవమానం పాలుకానివ్వు.

31 ఎవ్వరూ ప్రభువుచేత శాశ్వతంగా త్రోసివేయబడరు.

32 ఆయన దుఃఖం కలిగించినప్పటికీ, ఆయన కనికరం చూపుతారు, ఆయన మారని ప్రేమ చాలా గొప్పది.

33 ఆయన ఇష్టపూర్వకంగా ఎవరికీ కష్టాలు గాని దుఃఖం గాని కలుగజేయరు.

34 దేశంలో ఖైదీలందరిని, కాళ్లక్రింద పడేసి త్రొక్కాలని,

35 మహోన్నతుని ఎదుట, ప్రజలు తమ హక్కులను త్రోసిపుచ్చాలని,

36 ఒక వ్యక్తికి న్యాయం జరగకుండా చేయడం, ఇలాంటివి ప్రభువు చూడరా?

37 ప్రభువు శాసించనప్పుడు అది జరిగేలా ఎవరు ఆజ్ఞాపించగలరు?

38 మహోన్నతుని నోటి నుండి వైపరీత్యాలు, అలాగే మంచి విషయాలు రావా?

39 తమ పాపాలను బట్టి శిక్షించబడినప్పుడు సజీవులైన మనుష్యులు ఎందుకు ఫిర్యాదు చేయాలి?

40 మన మార్గాలను పరిశీలించి, వాటిని పరీక్షించి, యెహోవా దగ్గరకు తిరిగి వెళ్దాము.

41 మన హృదయాలను, చేతులను పరలోకంలో ఉన్న దేవుని వైపు ఎత్తి:

42 “మేము పాపం చేశాము, తిరుగుబాటు చేశాము మీరు క్షమించలేదు.

43 “మీరు కోపంతో కప్పుకుని మమ్మల్ని వెంటాడారు; మీరు జాలి లేకుండా చంపారు.

44 ఏ ప్రార్థన ఫలించకుండా, మీరు ఒక మేఘంతో మిమ్మల్ని మీరు కప్పుకున్నారు.

45 దేశాల మధ్య మీరు మమ్మల్ని చెత్తగా చేశారు.

46 “మా శత్రువులందరూ మాకు వ్యతిరేకంగా నోరు తెరిచారు.

47 మేము భయాందోళనలను ఆపదలను ఎదుర్కొన్నాము, పతనము నాశనము.”

48 నా ప్రజలు నాశనమయ్యారు కాబట్టి నా కళ్ళ నుండి కన్నీటి ధారలు ప్రవహిస్తాయి.

49-50 యెహోవా పరలోకం నుండి క్రిందికి వంగి చూసే వరకు, ఉపశమనం లేకుండా, నా కంటి నుండి నీరు ఎడతెగకుండా ప్రవహిస్తుంది.

51 నా నగర స్త్రీలందరి వల్ల నేను చూసేది నా ప్రాణానికి దుఃఖం కలిగిస్తుంది.

52 కారణం లేకుండా నాకు శత్రువులుగా ఉన్నవారు పక్షిలా నన్ను వేటాడారు.

53 వారు గొయ్యిలో వేసి నా ప్రాణం తీయాలని చూశారు, నాపై రాళ్లు విసిరారు;

54 నీరు నా తలపై మూసుకుపోయాయి, నేను నశిస్తానని అనుకున్నాను.

55 యెహోవా, నీ నామమున మొరపెట్టాను, గొయ్యి లోతుల్లో నుండి నీ నామాన్ని పిలిచాను.

56 “మీరు నా మొరను ఆలకించారు, నీ చెవులు మూసుకోకు” అనే నా విన్నపాన్ని మీరు విన్నారు.

57 నేను నిన్ను పిలిచినప్పుడు మీరు దగ్గరికి వచ్చి “భయపడకు” అన్నారు.

58 ప్రభువా, నీవు నా కేసు తీసుకున్నావు. నీవు నా ప్రాణాన్ని విమోచించావు.

59 యెహోవా చూశావు. నా కారణాన్ని సమర్థించండి!

60 వారి ప్రతీకార తీవ్రతను, నాకు వ్యతిరేకంగా వారు పన్నిన కుట్రలన్నీ మీరు చూశారు.

61 యెహోవా, వారి అవమానాలను, నాకు వ్యతిరేకంగా వారు పన్నిన పన్నాగాలన్నీ మీరు విన్నారు.

62 నా శత్రువులు రోజంతా నాకు వ్యతిరేకంగా గుసగుసలాడే గొణుగుతున్నారు.

63 వాటిని చూడు! కూర్చున్నా, నిలబడినా తమ పాటల్లో నన్ను వెక్కిరిస్తారు.

64 యెహోవా వారి క్రియా కలపలను బట్టి, ప్రతీకారం చేస్తావు.

65 వారికి కాఠిన్యమైన హృదయాలు ఇవ్వండి, మీ శాపం వారి మీదికి వచ్చును గాక.

66 కోపంతో వారిని వెంటాడి, యెహోవా ఆకాశాల క్రిందనుండి వారిని నాశనం చేయండి.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan