Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

యెహోషువ 9 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


గిబియోనీయుల మోసం

1 యొర్దానుకు పశ్చిమాన ఉన్న రాజులందరూ అంటే కొండ సీమలోని రాజులు, పడమటి పర్వత ప్రాంతాల్లో, మధ్యధరా సముద్ర తీరప్రాంతంలో లెబానోను వరకు ఉన్న హిత్తీయులు, అమోరీయులు, కనానీయుల, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయుల రాజులు ఈ విషయాలను గురించి విన్నప్పుడు,

2 వారు యెహోషువతో ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయడానికి కలిసి వచ్చారు.

3 అయితే, యెరికోకు, హాయికి యెహోషువ ఏమి చేశాడో గిబియోను ప్రజలు విన్నప్పుడు,

4 వారు ఒక కుయుక్తిని ఆలోచించి, రాయబారులుగా నటిస్తూ తమ గాడిదల మీద చినిగిపోయిన గోనెసంచులు, పాతగిల్లి అతుకు వేసిన ద్రాక్షతిత్తులను పెట్టుకుని వెళ్లారు.

5 తమ కాళ్లకు అరిగిపోయి అతుకులు వేసిన పాత చెప్పులు, పాతబడిన బట్టలు వేసుకున్నారు. వారు తెచ్చుకున్న రొట్టెలన్నీ ఎండిపోయి బూజు పట్టి ఉన్నాయి.

6 వారు గిల్గాలులో శిబిరం దగ్గర ఉన్న యెహోషువ దగ్గరకు వచ్చి అతనితో, ఇశ్రాయేలీయులతో, “మేము దూరదేశం నుండి వచ్చాం; మాతో ఒక సమాధాన ఒడంబడిక” అని అన్నారు.

7 ఇశ్రాయేలీయులు హివ్వీయులతో, “కాని మీరు మా మధ్య నివసిస్తున్న వారిలా ఉన్నారు, మేము మీతో ఎలా సమాధాన ఒడంబడిక చేసుకోగలం?” అని అడిగారు.

8 అందుకు వారు, “మేము మీ దాసులం” అని యెహోషువతో అన్నారు. కాని యెహోషువ, “మీరెవరు, ఎక్కడ నుండి వచ్చారు?” అని వారిని అడిగాడు.

9 అందుకు వారు: “మీ దేవుడైన యెహోవా కీర్తిని గురించి విని, మీ దాసులమైన మేము చాలా దూరదేశం నుండి వచ్చాము. ఆయన ఈజిప్టులో చేసినదంతటిని గురించి,

10 యొర్దాను తూర్పున ఉన్న అమోరీయుల ఇద్దరు రాజులకు అనగా హెష్బోను రాజైన సీహోను, అష్తారోతులో పాలించిన బాషాను రాజైన ఓగులకు చేసిన దాన్ని గురించి విన్నాము.

11 కాబట్టి మా పెద్దలు, మా దేశవాసులంతా మాతో, ‘ప్రయాణానికి అవసరమైన ఆహారం తీసుకుని వెళ్లి వారిని కలిసి వారితో, “మేము మీ దాసులం; మాతో సమాధాన ఒడంబడిక చేయండి” అని చెప్పండి’ అన్నారు.

12 మేము మీ దగ్గరకు రావడానికి బయలుదేరిన రోజు ఇంట్లో చేసినప్పుడు మా ఈ రొట్టెలు వేడిగా ఉన్నాయి. కానీ ఇప్పుడవి ఎండిపోయి బూజు పట్టి ఉన్నాయి చూడండి.

13 ఈ ద్రాక్షరసం తిత్తులు మేము నింపినప్పుడు క్రొత్తవే, కాని ఇప్పుడు చినిగిపోయాయి. చాలా దూరం ప్రయాణం చేయడంతో మా బట్టలు, చెప్పులు అరిగిపోయాయి.”

14 అయితే ఇశ్రాయేలీయులు యెహోవాను అడగకుండానే వారి ఆహారంలో కొంత తీసుకున్నారు.

15 తర్వాత యెహోషువ వారిని బ్రతకనివ్వడానికి వారితో సమాధాన ఒడంబడిక చేశాడు, దానిని సమాజ నాయకులు ప్రమాణం చేసి ఆమోదించారు.

16 గిబియోనీయులతో సమాధాన ఒడంబడిక చేసుకున్న మూడు రోజుల తర్వాత, వారు తమ పొరుగువారని, తమ దగ్గర నివసిస్తున్నారని ఇశ్రాయేలీయులు విన్నారు.

17 కాబట్టి ఇశ్రాయేలీయులు బయలుదేరి మూడవ రోజున వారి పట్టణాలైన గిబియోను, కెఫీరా, బెయేరోతు, కిర్యత్-యారీము చేరుకున్నారు.

18 అయితే ఇశ్రాయేలీయులు వారిపై దాడి చేయలేదు, ఎందుకంటే సమాజ నాయకులు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా పేరున వారితో ప్రమాణం చేశారు. సమాజమంతా నాయకుల మీద సణుగుకొన్నారు.

19 అయితే సమాజ నాయకులంతా, “మనం ఇశ్రాయేలు దేవుడైన యెహోవా పేరున వారికి ప్రమాణం చేశాం కాబట్టి ఇప్పుడు మనం వారిని తాకకూడదు.

20 మనం వారికి చేసిన ప్రమాణం వల్ల మన మీదకి దేవుని ఉగ్రత రాకుండా ఉండేలా వారిని బ్రతుకనిద్దాం” అన్నారు.

21 వారు ఇంకా మాట్లాడుతూ, “వారిని బ్రతుకనివ్వండి, వారు సమాజమంతటికి కట్టెలు కొట్టేవారిగా నీళ్లు తెచ్చేవారిగా ఉంటారు” అని జవాబిచ్చారు. అలా నాయకులు ఇచ్చిన మాట నెరవేరింది.

22 యెహోషువ గిబియోనీయులను పిలిపించి వారితో, “మీరు మా దగ్గరే నివసించే వారైనప్పటికి మేము చాలా దూరంలో ఉంటామని చెప్పి మమ్మల్ని ఎందుకు మోసం చేశారు?

23 అందుకే మీరు శాపానికి గురైయ్యారు. మీరు ఎప్పటికీ నా దేవుని మందిరానికి కట్టెలు కొట్టేవారిగా, నీరు తెచ్చే వారిగానే ఉంటారు” అని చెప్పాడు.

24 అందుకు వారు యెహోషువకు, “మీ దేవుడైన యెహోవా ఈ దేశమంతటిని మీకు ఇవ్వమని, దాని నివాసులందరిని మీ ముందు నుండి తుడిచిపెట్టమని తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించారని మీ దాసులమైన మాకు స్పష్టంగా తెలిసింది. మీ వల్ల మాకు ప్రాణభయం ఉంది, అందుకే ఇలా చేశాము.

25 మేమిప్పుడు మీ చేతుల్లో ఉన్నాము. మా విషయంలో మీకు ఏది మంచిది, ఏది సరియైనది అనిపిస్తే అదే చేయండి” అని జవాబిచ్చారు.

26 కాబట్టి యెహోషువ గిబియోనీయులను ఇశ్రాయేలీయుల నుండి కాపాడి, వారిని చంపకుండా చేశాడు.

27 ఆ రోజు యెహోషువ యెహోవా ఎంచుకున్న స్థలంలో ఉండే బలిపీఠం యొక్క అవసరాలను తీర్చడానికి, గిబియోనీయులను సమాజం కోసం కట్టెలు కొట్టేవారిగా, నీరు తెచ్చేవారిగా చేశాడు. నేటికీ వారు అదే చేస్తున్నారు.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan