యెహోషువ 5 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 ఇశ్రాయేలీయులు దాటే వరకు యెహోవా యొర్దానును వారి ముందు ఆరిపోయేలా చేశారని యొర్దానుకు పశ్చిమాన ఉన్న అమోరీయుల రాజులందరూ, మధ్యధరా తీరం వెంబడి నివసించిన కనానీయుల రాజులందరూ విన్నప్పుడు వారి గుండెలు కరిగి నీరై ఇశ్రాయేలు ప్రజలను ఎదుర్కొనే ధైర్యం వారికి లేకపోయింది. గిల్గాలు దగ్గర సున్నతి, పస్కా 2 ఆ సమయంలో యెహోవా యెహోషువతో, “చెకుముకిరాతి కత్తులు చేయించి ఇశ్రాయేలీయులకు మళ్ళీ సున్నతి చేయించు” అని చెప్పారు. 3 కాబట్టి యెహోషువ చెకుముకిరాతి కత్తులు చేయించి గిబియత్ హారలోతు దగ్గర ఇశ్రాయేలీయులకు సున్నతి చేయించాడు. 4 యెహోషువ వారికి సున్నతి చేయించడానికి కారణం ఏంటంటే ఈజిప్టు నుండి బయటకు వచ్చిన వారిలో సైనిక వయస్సుగల పురుషులంతా ఈజిప్టును విడిచిన అరణ్య మార్గంలోనే చనిపోయారు. 5 బయటకు వచ్చిన వారందరూ సున్నతి పొందిన వారే, కానీ ఈజిప్టు నుండి ప్రయాణం చేస్తుండగా అరణ్యమార్గంలో పుట్టిన వారందరూ సున్నతి పొందనివారే. 6 యెహోవా మాట వినలేదు కాబట్టి, ఇశ్రాయేలీయులు ఈజిప్టును విడిచినప్పుడు సైనిక వయస్సులో ఉన్న పురుషులందరు చనిపోయే వరకు వారు నలభై సంవత్సరాలు అరణ్యంలో తిరిగారు. ఎందుకంటే మనకు ఇస్తానని వారి పూర్వికులకు వాగ్దానం చేసిన పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని వారు చూడరని యెహోవా వారితో ప్రమాణం చేశారు. 7 కాబట్టి ఆయన వారి స్థానంలో వారి కుమారులను లేవనెత్తారు, యెహోషువ సున్నతి చేయించింది వీరికే. దారిలో వారికి సున్నతి జరుగలేదు కాబట్టి వారు సున్నతిలేనివారిగానే ఉన్నారు. 8 దేశంలోని మగవారంతా సున్నతి పొందిన తర్వాత, వారు స్వస్థత పొందేవరకు శిబిరంలోనే ఉన్నారు. 9 తర్వాత యెహోవా యెహోషువతో, “ఈ రోజు నేను మీ నుండి ఈజిప్టు అవమానాన్ని తొలగించాను” అని చెప్పారు. అందుకని ఈనాటి వరకు ఆ స్థలాన్ని గిల్గాలు అని పిలువబడుతుంది. 10 యెరికో మైదానాల్లోని గిల్గాలులో బస చేసినప్పుడు ఆ నెల పద్నాలుగవ రోజు సాయంత్రం అక్కడ ఇశ్రాయేలీయులు పస్కాను జరుపుకున్నారు. 11 పస్కా జరిగిన మరుసటి రోజే, వారు భూమిలో పండించిన వాటిలో నుండి పులియని రొట్టె, కాల్చిన ధాన్యం తినడం మొదలుపెట్టారు. 12 వారు భూమి నుండి ఈ ఆహారాన్ని తిన్న మరుసటిరోజు మన్నా ఆగిపోయింది; ఇశ్రాయేలీయులకు ఇకపై మన్నా లేదు, కానీ ఆ సంవత్సరం వారు కనాను పంటను తిన్నారు. యెరికో పతనం 13 యెహోషువ యెరికోకు సమీపంలో ఉన్నప్పుడు, అతడు పైకి చూసినప్పుడు ఒక వ్యక్తి చేతిలో కత్తి పట్టుకుని తన ముందు నిలబడి కనిపించాడు. యెహోషువ అతని దగ్గరకు వెళ్లి, “నీవు మా పక్షమా లేదా మా శత్రువుల పక్షమా?” అని అడిగాడు. 14 “ఎవరి పక్షం కాను, అయితే నేనిప్పుడు యెహోవా సేనాధిపతిగా వచ్చాను” అని ఆ వ్యక్తి జవాబిచ్చాడు. అప్పుడు యెహోషువ భక్తితో నేలమీద బోర్లపడి, “నా ప్రభువు తన సేవకునికి ఏమి సందేశం ఇస్తారు?” అని అడిగాడు. 15 అందుకు యెహోవా సేనాధిపతి యెహోషువతో, “నీవు నిలబడిన స్ధలం పవిత్రమైనది, కాబట్టి నీ చెప్పులు తీసివేయి” అని చెప్పగానే యెహోషువ అలాగే చేశాడు. |
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.
Biblica, Inc.