Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

యెహోషువ 1 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


యెహోషువను నాయకునిగా నియమించుట

1 యెహోవా సేవకుడైన మోషే చనిపోయిన తర్వాత యెహోవా నూను కుమారుడు, మోషే సహాయకుడైన యెహోషువతో ఇలా అన్నారు:

2 “నా సేవకుడైన మోషే చనిపోయాడు. కాబట్టి నీవు, నీతో పాటు ఈ ప్రజలందరూ బయలుదేరి యొర్దాను నదిని దాటి, నేను ఇశ్రాయేలీయులకు ఇవ్వబోతున్న దేశానికి వెళ్లడానికి సిద్ధపడండి.

3 నేను మోషేకు వాగ్దానం చేసినట్లు, మీరు అడుగుపెట్టే ప్రతి స్థలాన్ని మీకిస్తాను.

4 మీ భూభాగం ఎడారి నుండి లెబానోను వరకు యూఫ్రటీసు అనే గొప్ప నది నుండి హిత్తీయుల దేశం అంతా, పశ్చిమాన మధ్యధరా సముద్రం వరకు విస్తరిస్తుంది.

5 నీ జీవితకాలమంతా ఎవ్వరూ నీకు వ్యతిరేకంగా నీ ముందు నిలబడలేరు, నేను మోషేతో ఉన్నట్లు నీతో కూడా ఉంటాను; నేను నిన్ను విడువను ఎడబాయను.

6 దృఢంగా, ధైర్యంగా ఉండు, ఎందుకంటే నేను వారసత్వంగా ఇస్తానని వారి పూర్వికులతో ప్రమాణం చేసిన దేశానికి నీవు వారిని నడిపిస్తావు.

7 “నీవు నిబ్బరంగా, ధైర్యంగా ఉండు. నా సేవకుడైన మోషే నీకు ఇచ్చిన ధర్మశాస్త్రమంతటిని జాగ్రత్తగా పాటించాలి, నీవు వెళ్లే ప్రతి మార్గంలో నీవు విజయం పొందేలా దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తిరుగవద్దు.

8 ఈ ధర్మశాస్త్ర గ్రంథం ఎప్పుడు నీ పెదాల మీద ఉండాలి; పగలు రాత్రి దానిని ధ్యానించాలి, తద్వార నీవు దానిలో వ్రాయబడి ఉన్న ప్రతిదీ శ్రద్ధగా చేయగలవు. అప్పుడు నీవు విజయవంతంగా వర్ధిల్లుతావు.

9 బలంగా ధైర్యంగా ఉండమని నేను నీకు ఆజ్ఞాపించలేదా? భయపడవద్దు; నిరుత్సాహపడవద్దు; ఎందుకంటే నీవు ఎక్కడికి వెళ్లినా నీ దేవుడైన యెహోవా నీతో ఉంటారు.”

10 కాబట్టి యెహోషువ ప్రజల అధికారులకు ఇలా ఆజ్ఞాపించాడు:

11 “మీరు శిబిరం గుండా వెళ్తూ ప్రజలతో, ‘మీ దేవుడైన యెహోవా స్వాస్థ్యంగా మీకిస్తున్న దేశాన్ని స్వాధీనపరచుకోడానికి మీరు మూడు రోజుల్లో యొర్దాను నదిని దాటాలి కాబట్టి భోజన ఏర్పాట్లు చేసుకోండి’ అని చెప్పండి.”

12 అయితే రూబేనీయులకు, గాదీయులకు, మనష్షే అర్థగోత్రానికి, యెహోషువ ఇలా చెప్పాడు,

13 “యెహోవా సేవకుడైన మోషే, ‘మీ దేవుడైన యెహోవా ఈ దేశాన్ని మీకు ఇచ్చి మీకు విశ్రాంతిని ఇస్తాడు’ అని మీకిచ్చిన ఆజ్ఞను జ్ఞాపకముంచుకోండి.

14 మీ భార్యలు, మీ పిల్లలు, మీ పశువులు యొర్దానుకు తూర్పున మోషే మీకిచ్చిన ప్రదేశంలో ఉండవచ్చు, అయితే యుద్ధానికి సిద్ధంగా ఉన్న మీ పోరాట పురుషులంతా, మీ తోటి ఇశ్రాయేలీయులకంటె ముందుగా దాటాలి.

15 యెహోవా మీకు సహాయం చేసినట్టు, ఆయన వారికి విశ్రాంతినిచ్చే వరకు, వారు కూడా మీ దేవుడైన యెహోవా వారికి ఇస్తున్న దేశాన్ని స్వాధీనపరచుకునే వరకు, మీరు కూడా వారికి సహాయం చేయాలి. ఆ తర్వాత, మీరు తిరిగివెళ్లి, యెహోవా సేవకుడైన మోషే యొర్దానుకు తూర్పున సూర్యోదయం వైపున మీకిచ్చిన మీ స్వాస్థ్యాన్ని మీరు ఆక్రమించుకోవచ్చు.”

16 అప్పుడు వారు యెహోషువకు ఇలా జవాబిచ్చారు, “నీవు మాకాజ్ఞాపించినదంతా మేము చేస్తాము. మమ్మల్ని ఎక్కడికి పంపితే అక్కడికి వెళ్తాము.

17 అన్ని విషయాల్లో మోషే మాటకు ఎలా పూర్తిగా లోబడినామో మీ మాటకు అలాగే లోబడతాము. నీ దేవుడైన యెహోవా మోషేతో ఉన్నట్లే నీతో కూడా ఉండును గాక.

18 నీ మాటకు తిరుగుబాటు చేసేవారు, నీ ఆజ్ఞలను లోబడనివారు చంపబడతారు. నీవు మాత్రం దృఢంగా ధైర్యంగా ఉండాలి!”

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan