Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

యోబు 6 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


యోబు

1 అప్పుడు యోబు ఇలా జవాబిచ్చాడు:

2 “కేవలం నా వేదనను తూకం వేసి, నా కష్టాలన్నీ త్రాసులో ఉంచి లెక్కిస్తే,

3 సముద్రాల ఇసుక కంటే అవి బరువుగా ఉంటాయి, కాబట్టి నా మాటలు ఉద్వేగభరితంగా ఉండడంలో ఆశ్చర్యం లేదు.

4 సర్వశక్తిమంతుడైన దేవుని బాణాలు నాకు గుచ్చుకున్నాయి, నా ఆత్మ వాటికున్న విషం త్రాగింది; దేవుని భయంకరకార్యాలు నాకు వ్యతిరేకంగా మోహరించి ఉన్నాయి.

5 గడ్డి దొరికితే అడవి గాడిద అరుస్తుందా, మేత దొరికితే ఎద్దు రంకెవేస్తుందా?

6 ఉప్పు లేకుండ రుచిలేని ఆహారం ఎవరైనా తింటారా? గుడ్డులోని తెలుపుకు రుచి ఉంటుందా?

7 నేను దాన్ని తాకను, అలాంటి ఆహారం తింటే నా ఆరోగ్యం పాడవుతుంది.

8 “నా అభ్యర్థన నెరవేరి, దేవుడే నా కోరికను అనుగ్రహించియుంటే బాగుండేది,

9 దేవుడు ఇష్టపూర్వకంగా నన్ను నలిపివేసి, తన చేయి జాడించి నా ప్రాణాన్ని తీసివేస్తే బాగుండేది!

10 అప్పుడు నేను ఈ ఆదరణ కలిగి ఉంటాను, భరించలేని బాధలో ఉన్నప్పటికీ, పరిశుద్ధుని మాటలు నేను తిరస్కరించలేదని ఆనందిస్తాను.

11 “నేను ఇంకా నిరీక్షణ కలిగి ఉండడానికి నాకున్న బలమెంత? నేను ఓపికగా ఉండడానికి నా అంతం ఏపాటిది?

12 రాయికున్నంత బలం నాకుందా? నాదేమైనా ఇత్తడి శరీరమా?

13 నాకు నేను సహాయం చేసుకోగల శక్తి నాలో ఏమైన ఉన్నదా? నా శక్తి నన్ను పూర్తిగా విడిచిపెట్టింది.

14 “స్నేహితునికి దయ చూపనివాడు సర్వశక్తిమంతుడైన దేవుని భయం విడిచిపెట్టినవాడు.

15 కాని నా సహోదరులు నమ్మదగని జలప్రవాహాల్లా ఉన్నారు, ఉప్పొంగే వాగుల్లా ఆధారపడదగనివారుగా ఉన్నారు,

16 అవి కరిగిపోతున్న మంచుగడ్డలతో, వాటి మీద కురిసిన మంచుతో అవి నల్లబారాయి.

17 కాని వేసవికాలంలో వాటి ప్రవాహం ఆగిపోతుంది, వేడికి వాటి స్థలాల్లోనే అవి ఆవిరైపోతాయి.

18 అవి ప్రవహించే మార్గాల నుండి ప్రక్కకు తిరుగుతాయి; అవి బంజరు భూమిలో వెళ్లి నశించిపోతాయి.

19 తేమా వర్తకుల గుంపు నీటి కోసం వెదకుతారు, షేబ వ్యాపారులు వాటికోసం ఆశతో చూస్తారు.

20 వారు నమ్మకంగా ఉన్నందుకు వారు దుఃఖపడుతున్నారు, అక్కడికి వచ్చి వారు నిరాశ చెందారు.

21 ఇప్పుడు మీరు కూడా ఏ సహాయం ఇవ్వలేరని నిరూపించారు; మీరు ఆపదను చూసి భయపడుతున్నారు.

22 నేను ఎప్పుడైనా, ‘నాకేమైనా ఇవ్వండి అని అడిగానా? మీ ఆస్తిలో నుండి నాకేమైనా బహుమానం తెమ్మని అడిగానా?

23 శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించమని, క్రూరుల బారి నుండి నన్ను తప్పించండి’ అని అడిగానా?

24 “నాకు బోధించండి, నేను మౌనంగా ఉంటాను; నా తప్పేంటో నేను గ్రహించేలా నాకు చూపించండి.

25 యథార్థమైన మాటలు ఎంతో బాధాకరమైనవి, కాని మీ వాదనలు ఏమి నిరూపిస్తున్నాయి?

26 నేను చెప్పే మాటలను సరిచేయాలని చూస్తున్నారా, నిరాశతో కూడిన నా మాటలు గాలివంటివే అని అనుకుంటున్నారా?

27 మీరు తండ్రిలేనివారిని కొనడానికి చీట్లు వేస్తారు, మీ స్నేహితుని మీద బేరమాడతారు.

28 “అయితే ఇప్పుడు నన్ను దయతో చూడండి, మీ ముఖాలు చూస్తూ అబద్ధం చెప్పగలనా?

29 పశ్చాత్తాపపడండి, అన్యాయం చేయకండి; మరలా విచారించండి ఎందుకంటే నాలో ఇంకా యథార్థత ఉంది.

30 నా పెదవుల మీద దుష్టత్వం ఉందా? నా నోరు దుర్మార్గాన్ని గ్రహించలేదా?

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan