యోబు 37 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 “వీటన్నిబట్టి నా హృదయం వణికిపోతుంది, దాని స్థలం నుండి దూకుతుంది. 2 ఆయన స్వరం గర్జించడం వినండి, ఆయన నోటి నుండి వచ్చే ఉరుమును వినండి. 3 ఆయన తన మెరుపును ఆకాశమంతటి క్రింద విప్పుతారు దానిని భూమి చివర్లకు పంపుతారు. 4 దాని తర్వాత ఆయన గర్జన శబ్దం వినిపిస్తుంది; ఆయన తన గంభీరమైన స్వరంతో ఉరుముతారు. ఆయన స్వరం ప్రతిధ్వనిస్తున్నప్పుడు, ఆయన ఏది వెనుకకు తీసుకోరు. 5 దేవుని స్వరం అద్భుతమైన విధానాల్లో ఉరుముతుంది; మనం గ్రహించలేని గొప్ప వాటిని ఆయన చేస్తారు. 6 ఆయన మంచుతో, ‘భూమిపై పడు’ వాన జల్లుతో, ‘కుండపోత వర్షంగా కురువు’ అని ఆజ్ఞాపిస్తారు. 7 తద్వార మనుష్యులందరు ఆయన కార్యాన్ని తెలుసుకుంటారు, ఆయన ప్రజలందరినీ తమ ప్రయాసం నుండి విరమింపజేస్తారు. 8 జంతువులు వాటి గుహల్లోకి వెళ్లి వాటిలో దాక్కుని అక్కడే నివసిస్తాయి. 9 తుఫాను దాని స్థానం నుండి బయటకు వస్తుంది, వీచే గాలుల నుండి చలి వస్తుంది. 10 దేవుని ఊపిరి మంచును పుట్టిస్తుంది, మహా సముద్ర ఉపరితలాలు గడ్డకడతాయి. 11 ఆయన దట్టమైన మేఘాలను తేమతో నింపుతారు; మేఘాలలో తన మెరుపులను వ్యాపింపజేస్తారు. 12 భూమి అంతటి ఉపరితలం మీద ఆయన ఆజ్ఞాపించిన వాటన్నిటిని చేయడానికి, ఆయన నిర్దేశించిన మార్గంలో అవి చుట్టూ తిరుగుతాయి. 13 ప్రజలను శిక్షించడానికి లేదా తన భూమికి నీళ్లు పోయడానికి, తన ప్రేమను చూపించడానికి ఆయన మేఘాలను రప్పిస్తారు. 14 “యోబూ, ఇది విను; ఆగి దేవుని అద్భుతాలను గురించి ఆలోచించు. 15 దేవుడు మేఘాలను ఎలా అదుపు చేస్తారో తన మెరుపులను ఎలా ప్రకాశింపజేస్తారో నీకు తెలుసా? 16 మేఘాలు ఎలా సమతుల్యంగా వ్రేలాడుతున్నాయో, పరిపూర్ణ జ్ఞానం గలవాని అద్భుతకార్యాలు నీకు తెలుసా? 17 దక్షిణపుగాలికి భూమి ప్రశాంతంగా ఉన్నప్పుడు మీ బట్టలలో మీకు చెమట పడుతుంది, 18 ఇత్తడితో పోతపోసిన అద్దంలా, ఆకాశాలను విస్తరింపజేయడంలో ఆయనతో నీవు జత కలుస్తావా? 19 “మేము ఆయనతో ఏమి మాట్లాడాలో మాకు చెప్పు; మా చీకటిని బట్టి మా వాదనను సరిగా వినిపించలేము. 20 నేను మాట్లాడతాను అని ఆయనకు చెప్పబడాలా? మ్రింగివేయబడటానికి ఎవరైనా అడుగుతారా? 21 గాలి వీచి మేఘాలు తొలగిపోయి తేటగా ఉన్నప్పుడు ఆకాశాల్లో ప్రకాశిస్తున్న సూర్యుడిని ఏ ఒక్కరు చూడలేరు. 22 అలాగే ఉత్తర దిక్కునుండి బంగారు తేజస్సుతో ఆయన వస్తున్నారు; భీకరమైన మహిమతో దేవుడు వస్తున్నారు. 23 సర్వశక్తిమంతుడు మనకు మించినవాడు శక్తిలో ఉన్నతమైనవాడు; తన న్యాయం గొప్ప నీతిని బట్టి, ఆయన అణచివేయడు. 24 కాబట్టి ప్రజలు ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉంటారు, తమకు జ్ఞానముందని అనుకునేవారిని ఆయన లెక్కచేయరు.” |
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.
Biblica, Inc.