Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

యోబు 36 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

1 ఎలీహు ఇంకా మాట్లాడుతూ:

2 “ఇంకొంచెం సేపు నన్ను భరించండి దేవుని పక్షాన చెప్పాల్సింది చాలా ఉందని మీకు తెలియజేస్తాను.

3 నేను నా తెలివిని దూరం నుండి పొందాను; నేను నా సృష్టికర్తకు న్యాయం ఆపాదిస్తాను.

4 నా మాటలు అబద్ధం కాదని నమ్మండి; పరిపూర్ణ జ్ఞాని మీతో ఉన్నాడు.

5 “దేవుడు మహాబలవంతుడు, కాని ఎవరిని త్రోసివేయరు; ఆయన శక్తిమంతుడు, తన ఉద్దేశ్యంలో దృఢంగా ఉంటారు.

6 ఆయన దుష్టులను బ్రతకనివ్వరు కాని బాధితులకు న్యాయం చేస్తారు.

7 నీతిమంతులను ఆయన చూడకపోరు; వారిని రాజులతో పాటు సింహాసనంపై కూర్చోబెట్టి నిత్యం వారిని ఘనపరుస్తారు.

8 ప్రజలు గొలుసులతో బంధించబడి, బాధ అనే త్రాళ్లతో కట్టబడి ఉంటే,

9 వారు అహంకారంతో పాపం చేశారని ఆయన వారు చేసిన దానిని వారికి చెప్తారు.

10 దిద్దుబాటును వినేలా చేస్తారు తమ చెడుతనాన్ని గురించి పశ్చాత్తాపపడాలని వారిని ఆజ్ఞాపిస్తారు.

11 ఒకవేళ వారు లోబడి ఆయనను సేవిస్తే, వారు తమ మిగిలిన రోజులు క్షేమంగా తమ సంవత్సరాలు సంతృప్తిగా గడుపుతారు.

12 అయితే వారు వినకపోతే, వారు ఖడ్గం చేత నశిస్తారు జ్ఞానం లేకుండానే చనిపోతారు.

13 “హృదయంలో భక్తిలేనివారు కోపాన్ని ఉంచుకుంటారు; ఆయన వారిని బంధించినప్పుడు వారు సహాయం కోసం మొరపెట్టరు.

14 వారు తమ యవ్వనకాలంలో చనిపోతారు, పుణ్యక్షేత్రాల మగ వ్యభిచారుల మధ్య వారి జీవితం ముగుస్తుంది.

15 బాధపడుతున్నవారిని ఆయన వారి బాధలనుండి విడిపిస్తారు; బాధల్లో ఆయన వారితో మాట్లాడతారు.

16 “ఆయన నిన్ను బాధల్లో నుండి తప్పించి పరిమితి లేని విశాలమైన ప్రదేశానికి, మంచి ఆహారంతో నిండిన బల్ల దగ్గరకు నిన్ను తీసుకువస్తారు.

17 కానీ ఇప్పుడు నీవు దుష్టుల తీర్పుతో నిండి ఉన్నావు; తీర్పు న్యాయం నిన్ను పట్టుకున్నాయి.

18 ధనంతో ఎవరు నిన్ను మభ్యపెట్టకుండ జాగ్రత్తపడు; అధిక లంచం నిన్ను దారి తప్పించకుండ చూసుకో.

19 మీ సంపదలు మీ శక్తివంతమైన ప్రయత్నాలు బాధలో ఉండకుండా మిమ్మల్ని తప్పిస్తాయా?

20 ప్రజలను వారి ఇళ్ళలో నుండి దూరంగా లాగివేయాలని, రాత్రి కోసం ఎదురుచూడవద్దు.

21 చెడు వైపు తిరుగకుండ జాగ్రత్త వహించండి, ఎందుకంటే మీరు బాధల్లో పరీక్షించబడతారు.

22 “దేవుడు శక్తిమంతుడైన గొప్పవాడు. ఆయనలాంటి బోధకుడెవరు?

23 ఆయనకు మార్గాలను ఎవరు నిర్దేశించారు, ‘నీవు తప్పు చేశావు’ అని ఆయనతో ఎవరు చెప్పారు?

24 ప్రజలు పాటలతో కీర్తించిన ఆయన కార్యాలను ఘనపరచాలని నీవు జ్ఞాపకముంచుకో.

25 మనుష్యులందరు వాటిని చూశారు; మనుష్యులు దూరంగా ఉండి వాటిని చూశారు.

26 దేవుడు ఎంత గొప్పవాడో మనం గ్రహించలేము! ఆయన సంవత్సరాలను లెక్కించలేనివి.

27 “అతడు నీటి బిందువులను పైకి తీసుకుంటారు, అవే ప్రవాహాలకు వర్షంలాగా కురుస్తుంది;

28 మేఘాలు వాటి తేమను కురిపిస్తాయి మనుష్యులపై అవి సమృద్ధిగా వర్షాలు కురిపిస్తాయి.

29 ఆయన మేఘాలను ఎలా వ్యాపింప చేస్తారో ఆయన ఆవరణం నుండి ఎలా ఉరుము వస్తుందో ఎవరు గ్రహించగలరు?

30 ఆయన మెరుపులను తన చుట్టూ ఎలా వ్యాపింప చేస్తారో అవి సముద్ర అడుగుభాగాన్ని ఎలా కప్పివేసారో చూడండి.

31 వీటిని బట్టి ఆయన ప్రజలకు తీర్పు తీరుస్తారు సమృద్ధిగా ఆహారం ఇస్తారు.

32 ఆయన తన చేతులతో మెరుపులను పట్టుకుని గురికి తగలాలని వాటికి ఆజ్ఞాపిస్తారు.

33 ఉరుము రాబోయే తుఫానును ప్రకటిస్తుంది; పశువులకు కూడ దాని రాకడ తెలుస్తుంది.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan