యోబు 29 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథంయోబు చివరి వాదన 1 యోబు ఇంకా ఈ విధంగా మాట్లాడాడు: 2 “గడచిన నెలల్లో ఉన్నట్లు, దేవుడు నన్ను కాపాడిన రోజుల్లో ఉన్నట్లు నేను ఉంటే ఎంత బాగుండేది, 3 ఆయన దీపం నా తలపై వెలిగినప్పుడు ఆయన వెలుగును బట్టి చీకటిలో నేను నడిచాను! 4 నేను నా అత్యంత ఉత్పాదక సమయంలో ఉన్నాను, దేవుని సన్నిహిత స్నేహం నా ఇంటిని దీవించినప్పుడు, 5 సర్వశక్తిమంతుడు ఇంకా నాతో ఉన్నప్పుడు నా పిల్లలు నా చుట్టూ ఉన్నారు. 6 నా అడుగులు మీగడలో మునిగాయి, బండ నుండి నా కోసం ఒలీవనూనె ప్రవహించేది. 7 “నేను పట్టణ ద్వారం దగ్గరకు వెళ్లినప్పుడు, రాజవీధిలో నా స్థానంలో కూర్చున్నప్పుడు, 8 యువకులు నన్ను చూసి తప్పుకునేవారు వృద్ధులు లేచి నిలబడేవారు; 9 అధికారులు మాట్లాడడం ఆపివేసి, తమ చేతులతో నోటిని కప్పుకునేవారు; 10 ప్రధానులు మౌనంగా ఉండేవారు. వారి నాలుకలు వారి అంగిటికి అంటుకుపోయాయి. 11 నా గురించి విన్న వారు నన్ను ప్రశంసించారు, నన్ను చూసినవారు నా గురించి చెప్పారు, 12 ఎందుకంటే సహాయం కోసం మొరపెట్టిన బీదలను, తమను చూసుకోవడానికి ఎవరూ లేని తండ్రిలేనివారిని నేను రక్షించాను. 13 చనిపోబోతున్నవారు నన్ను దీవించారు; విధవరాండ్ర హృదయాలు సంతోషించేలా చేశాను. 14 నేను నీతిని నా దుస్తులుగా ధరించాను; న్యాయం నాకు వస్త్రం నా తలపాగా అయ్యింది. 15 గ్రుడ్డివారికి నేను కళ్లలా కుంటివారికి పాదాల్లా ఉన్నాను. 16 నిరుపేదలకు నేను తండ్రిగా ఉన్నాను; అపరిచితుల పక్షంగా వాదించడానికి ఒప్పుకున్నాను. 17 దుష్టుల కోరలు విరగ్గొట్టాను వారి పళ్ళ నుండి బాధితులను విడిపించాను. 18 “అప్పుడు నేను ఇలా అనుకున్నాను, ‘నా ఇంట్లోనే నేను చనిపోతాను, నా రోజులు ఇసుక రేణువుల్లా ఉంటాయి. 19 నా వేర్లు నీటిని తాకుతాయి, నా కొమ్మల మీద రాత్రంతా మంచు కురుస్తుంది. 20 నా ఘనత ఎప్పటికీ తగ్గదు; నా చేతిలో నా విల్లు ఎప్పుడూ క్రొత్తదిగానే ఉంటుంది.’ 21 “ప్రజలు నేను చెప్పేది ఆశగా వినేవారు, నా సలహా కోసం మౌనంగా ఎదురు చూసేవారు. 22 నేను మాట్లాడిన తర్వాత, వారికిక ఏమి మాట్లాడలేదు; నా మాటలు మృదువుగా వారి చెవులకు చేరాయి. 23 వర్షం కోసం చూసినట్లు వారు నా కోసం ఎదురు చూశారు, కడవరి వర్షంలా వారు నా మాటలు త్రాగారు. 24 నేను వారిని చూసి నవ్వినప్పుడు; వారు కష్టంగా దాన్ని నమ్మారు; నా ముఖకాంతి వారికి ప్రశస్తమైనది. 25 వారికి నేనే పెద్దగా కూర్చుని వారి కోసం మార్గం ఏర్పరిచాను; సైన్యం మధ్యలో ఉండే రాజులా, దుఃఖంలో ఉన్నవారిని ఆదరించేవానిగా నేనున్నాను. |
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.
Biblica, Inc.