యోబు 23 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథంయోబు 1 అప్పుడు యోబు ఇచ్చిన జవాబు: 2 ఈ రోజు కూడా నా ఫిర్యాదు తీవ్రంగానే ఉంది; నా మూల్గుల కంటే ఆయన హస్తం నా మీద భారంగా ఉంది. 3 నేను ఆయన నివాసస్థలానికి వెళ్లగలిగేలా; ఆయన ఎక్కడ కనిపిస్తాడో నాకు తెలిస్తే బాగుండేది కదా! 4 ఆయన ఎదుటే నా ఫిర్యాదేమిటో చెప్పుకుంటాను వాదోపవాదాలతో నా నోటిని నింపుకుంటాను. 5 ఆయన నాకు ఏమి జవాబు ఇస్తారో తెలుసుకుంటాను, ఆయన నాకు చెప్పేవాటిని గ్రహిస్తాను. 6 ఆయన తన మహాబలంతో నాతో వాదిస్తారా? లేదు, ఆయన నా మనవి వింటారు. 7 అక్కడ యథార్థవంతులు ఆయన ముందు వాదించగలరు, నేను నా న్యాయాధిపతి నుండి శాశ్వతంగా విడుదల పొందుతాను. 8 కాని నేను తూర్పుకు వెళ్లినా ఆయన అక్కడ లేరు; పడమరకు వెళ్లినా నేను ఆయన ఉన్నట్లు గ్రహించలేదు. 9 ఆయన ఉత్తరాన పని చేస్తున్నప్పుడు అక్కడికి వెళ్లినా నేను ఆయనను చూడలేదు; ఆయన దక్షిణ వైపుకు తిరిగినప్పుడు, నేనాయనను చూడలేదు. 10 కాని నేను నడిచేదారి ఆయనకు తెలుసు; ఆయన నన్ను పరీక్షించినప్పుడు నేను బంగారంలా బయటకు వస్తాను. 11 ఆయన అడుగుజాడల్లోనే నా పాదాలు నడిచాయి; ప్రక్కకు తొలగకుండా ఆయన మార్గాన్నే అనుసరించాను. 12 ఆయన పెదవుల నుండి వచ్చిన ఆజ్ఞలను నేను విడిచిపెట్టలేదు; నేను నా అనుదిన ఆహారం కంటే ఆయన నోటి మాటలకే ఎక్కువ విలువనిచ్చాను. 13 కాని ఆయన మారనివాడు, ఆయనను ఎవరు మార్చగలరు? తనకిష్టమైనదే ఆయన చేస్తారు. 14 నాకు వ్యతిరేకంగా తన శాసనాన్ని ఆయన కొనసాగిస్తారు, ఇలాంటి ఎన్నో ప్రణాళికలు ఆయన దగ్గర ఉన్నాయి. 15 కాబట్టి నేను ఆయన ఎదుట భయపడుతున్నాను, వీటన్నిటిని ఆలోచించినప్పుడు నేను ఆయనకు భయపడుతున్నాను. 16 దేవుడే నా హృదయం క్రుంగిపోయేలా చేశారు; సర్వశక్తిమంతుడు నన్ను భయపెట్టారు. 17 చీకటి నన్ను చుట్టుముట్టినా, దట్టమైన చీకటి నా ముఖాన్ని కమ్మినా నేను నాశనమవ్వలేదు. |
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.
Biblica, Inc.