Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

యోబు 20 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


జోఫరు

1 అప్పుడు నయమాతీయుడైన జోఫరు ఇలా జవాబిచ్చాడు:

2 “నేను చాలా ఆందోళన చెందగా, జవాబివ్వాలని నా ఆలోచనలు నన్ను తొందర చేస్తున్నాయి.

3 నాకు అవమానం కలిగించే నిందను నేను విన్నాను, కాబట్టి నా వివేకం జవాబు చెప్పేలా నన్ను ప్రేరేపిస్తుంది.

4 “అనాది కాలం నుండి ఎలా ఉందో నీకు తెలుసు, భూమి మీద నరుడు ఉంచబడినప్పటి నుండి ఏమి జరుగుతున్నది నీకు తెలుసు.

5 దుర్మార్గుల ఉల్లాసం కొద్దిసేపే అని, భక్తిహీనుల సంతోషం ఒక క్షణమే ఉంటుందని నీకు తెలుసు.

6 భక్తిహీనుల గర్వం ఆకాశాలను అంటినా వారి తల మేఘాలను తాకినా,

7 వారి మలంలా వారు కూడా ఎప్పటికి కనబడకుండా నశిస్తారు; వారిని చూసినవారు, ‘వారెక్కడ ఉన్నారు?’ అని అడుగుతారు.

8 కలలా వారు చెదిరిపోయి కనుమరుగవుతారు, రాత్రి స్వప్నంలా వారు చెదిరిపోతారు.

9 వారిని చూసిన కన్ను మరలా వారిని చూడదు; వారి స్థలం వారిని మరలా చూడదు.

10 వారి పిల్లలు పేదవారి సహాయం అడుగుతారు; వారి చేతులు తమ ఆస్తిని తిరిగి ఇచ్చేస్తాయి.

11 వారి ఎముకల్లో నిండి ఉన్న యవ్వన బలం వారితో పాటు మట్టిపాలవుతుంది.

12 “చెడుతనం వారి నోటికి తీయగా ఉన్నా, నాలుక క్రింద వారు దాన్ని దాచినా,

13 భరించలేకపోయినా దాన్ని విడిచిపెట్టలేదు తమ నోటిలో భద్రం చేసుకున్నారు,

14 వారి ఆహారం వారి కడుపులో పులిసిపోతుంది; అది వారిలో నాగుపాముల విషంలా మారుతుంది.

15 వారు మ్రింగిన ఐశ్వర్యాన్ని కక్కివేస్తారు; దేవుడు వారి కడుపు లోనిది కక్కిస్తారు.

16 వారు నాగుపాముల విషాన్ని పీల్చుకుంటారు; పాము కోరలు వారిని చంపుతాయి.

17 నదిలా ప్రవహించే తేనె మీగడలు చూసి, వారు ఆనందించలేరు.

18 వారు కష్టపడి సంపాదించిన దాన్ని అనుభవించకుండానే తిరిగి ఇచ్చేస్తారు; తమ వ్యాపారంలో వచ్చిన లాభాన్ని వారు ఆస్వాదించరు.

19 ఎందుకంటే వారు పేదలను వేధించి వారిని దిక్కులేనివారిగా చేశారు; తాను కట్టని ఇళ్ళను వారు ఆక్రమించారు.

20 “వారి అత్యాశకు అంతం ఉండదు; వారికున్న సంపదలతో తమను తాము రక్షించుకోలేడు.

21 వారు మ్రింగివేయడానికి వారికి ఏమి మిగల్లేదు; వారి అభివృద్ధి నిలబడదు.

22 వారికి సమృద్ధి కలిగినప్పుడు ఇబ్బందిపడతారు; కష్టాల భారం వారి మీద పడుతుంది.

23 వారు తమ కడుపు నింపుకునేప్పుడు, దేవుడు తన కోపాగ్నిని వారి మీద కురిపిస్తారు, వారి మీద కష్టాలను కురిపిస్తారు.

24 ఇనుప ఆయుధం నుండి వారు తప్పించుకున్నా ఇత్తడి విల్లు నుండి బాణం వారి గుండా దూసుకుపోతుంది.

25 దానిని వెనుక నుండి బయటకు తీయగా మెరుస్తున్న ఆ బాణం అంచు వారి కాలేయాన్ని ముక్కలు చేస్తుంది. మరణభయం వారిని కమ్ముకుంటుంది;

26 వారి సంపదలు చీకటిమయం అవుతాయి, ఎవరూ ఊదకుండానే మంటలు రాజుకొని వారిని దహించి వేసి, వారి గుడారాల్లో మిగిలినదంతా నాశనం చేస్తుంది.

27 ఆకాశాలు వారి అపరాధాన్ని బయటపెడతాయి; భూమి వారి మీదికి లేస్తుంది.

28 దేవుని కోపదినాన ప్రవహించే నీటిలో, వారి ఇళ్ళు కొట్టుకుపోతాయి.

29 దుష్టులకు దేవుడు నియమించిన, వారసత్వం ఇదే.”

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan