యోబు 17 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 “నా ప్రాణం క్రుంగిపోయింది, నా రోజులు కుదించబడ్డాయి. సమాధి నా కోసం ఎదురుచూస్తుంది. 2 ఎగతాళి చేసేవారు నన్ను చుట్టుముట్టారు; నేను చూస్తూ ఉండగానే వారు వివాదం రేపుతున్నారు. 3 “దేవా, మీరే నా కోసం జామీనుగా నిలవండి. ఇంకెవరు నాకు భద్రత ఇవ్వగలరు? 4 గ్రహించకుండా మీరు వారి హృదయాలను మూసివేశారు. కాబట్టి మీరు వారిని విజయం పొందనివ్వరు. 5 స్వలాభం కోసం తమ స్నేహితులను ఎవరైనా మోసం చేస్తే వారి పిల్లల కళ్లు మసకబారతాయి. 6 “దేవుడు నన్ను ప్రజలందరికి ఒక సామెతగా చేశారు, నా ముఖం మీద ప్రజలు ఉమ్మివేస్తారు. 7 దుఃఖంతో నా చూపు మందగించింది. నా అవయవాలు నీడలా మారాయి. 8 యథార్థవంతులు దీనినిచూసి ఆశ్చర్యపడతారు; నిర్దోషులు భక్తిహీనులను చూసి ఆందోళన చెందుతారు. 9 అయితే నీతిమంతులు తమ మార్గాలను విడిచిపెట్టరు, నిరపరాధులు బలాన్ని పొందుకుంటారు. 10 “మీరందరు మరోసారి రండి, మరలా ప్రయత్నించండి! నాకు మీలో జ్ఞానవంతుడు ఒక్కడు కూడా కనిపించలేదు. 11 నా రోజులు గతించిపోయాయి, నా ఆలోచనలు వ్యర్థమయ్యాయి. నా హృదయ వాంఛలు భంగమయ్యాయి. 12 ఈ మనుష్యులు రాత్రిని పగలని, చీకటి కమ్ముకున్నప్పుడు వెలుగు వచ్చిందని వాదిస్తారు. 13 నాకున్న ఆశ ఏంటంటే సమాధి నాకు ఇల్లు అవ్వాలి, చీకటిలో నా పరుపు పరచుకోవాలి. 14 నేను అవినీతితో, ‘నీవే నా తండ్రివి’ అని, పురుగుతో, ‘నా తల్లివి’ లేదా ‘నా సోదరివి’ అని అంటే, 15 అప్పుడు నా నిరీక్షణ ఎక్కడున్నట్టు! నా గురించి ఎవరికైనా నిరీక్షణ ఉంటుందా? 16 అది మరణపు తలుపుల దగ్గరకు దిగిపోతుందా? నాతో పాటు మట్టిలో కలిసిపోదా?” |
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.
Biblica, Inc.