యోబు 10 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 “నా బ్రతుకును నేను అసహ్యించుకొంటున్నాను; కాబట్టి నేను స్వేచ్ఛగా ఫిర్యాదు చేస్తాను నా మనస్సులోని బాధను బట్టి మాట్లాడతాను. 2 నేను దేవునితో ఇలా అంటాను: నన్ను దోషిగా భావించకండి, కాని నా మీద మీకున్న ఆరోపణలు నాకు చెప్పండి. 3 నన్ను హింసించడం, మీ చేతిపనిని త్రోసివేయడం, దుర్మార్గుల ప్రణాళికలను చూసి సంతోషించడం మీకు ఇష్టమా? 4 మీ కళ్లు మనుష్యుల కళ్లలాంటివా? మనుష్యులు చూసేటట్లు మీరు చూస్తారా? 5 మీ రోజులు మానవుల రోజుల వంటివా మీ సంవత్సరాలు బలమైన మనుష్యుల సంవత్సరాల వంటివా? 6-7 నేను దోషిని కానని మీ చేతిలో నుండి నన్ను ఎవరూ విడిపించలేరని మీకు తెలిసినప్పటికీ నా అపరాధాలను మీరు వెదకుతున్నారు? నా పాపాలను మీరు పరిశోధిస్తున్నారు? 8 “మీ చేతులు నన్ను రూపొందించి తయారుచేశాయి. ఇప్పుడు మీరు నన్ను తిరిగి నాశనం చేస్తారా? 9 బంకమట్టిలా నన్ను రూపొందించారని జ్ఞాపకం చేసుకోండి, ఇప్పుడు నన్ను తిరిగి మట్టిలా మారుస్తారా? 10 పాలు పోసినట్లు మీరు నన్ను పోయలేదా, జున్నుగడ్డ పేరబెట్టినట్లు నన్ను చేయలేదా, 11 చర్మంతో మాంసంతో నన్ను కప్పి ఎముకలు నరాలతో కలిపి అల్లలేదా? 12 మీరు నాకు జీవాన్ని ఇచ్చి దయ చూపించారు, మీ సంరక్షణతో నా ఆత్మను కాపాడారు. 13 “అయితే ఇది మీ హృదయంలో దాచుకున్నారు, ఇది మీ మనస్సులో ఉన్నదని నాకు తెలుసు: 14 నేను పాపం చేస్తే, మీరు నన్ను చూస్తుంటారు, నా నేరానికి శిక్ష వేయకుండ వదలరు. 15 నేను దోషినైతే నాకు శ్రమ! నేను నిర్దోషినైనప్పటికి నా తల పైకెత్తలేను, ఎందుకంటే నేను అవమానంతో నిండుకొని నా బాధలో మునిగి ఉన్నాను. 16 నా తలను పైకెత్తితే సింహం వలె మీరు నన్ను వేటాడతారు, నాకు వ్యతిరేకంగా మీ మహాబలాన్ని మరలా ప్రదర్శిస్తారు. 17 మీరు నాకు వ్యతిరేకంగా మరలా సాక్షులను తీసుకువస్తారు నా మీద మీకు కోపం పెరిగిపోతుంది; ఒకదాని తర్వాత ఒకటిగా మీ సైన్యాలు నామీదికి వస్తాయి. 18 “అసలు గర్భం నుండి నన్నెందుకు బయటకు తీసుకువచ్చారు? ఎవరు నన్ను చూడకముందే నేను చనిపోయి ఉంటే బాగుండేది. 19 అప్పుడు నేను ఉండేవాడిని కాదు, గర్భం నుండి నేరుగా సమాధికి వెళ్లేవాన్ని. 20 నాకున్న కొన్ని రోజులు దాదాపు ముగియలేదా? నేను సంతోష గడియలు కలిగి ఉండేలా, 21 తిరిగి రాలేని స్థలానికి నేను వెళ్లక ముందు, చీకటి, అంధకారం గల దేశానికి వెళ్లక ముందు నన్ను వదిలేయండి. 22 అంధకారం గల చిమ్మచీకటి గందరగోళంగా ఉండే స్థలానికి నన్ను వెళ్లనివ్వండి, అక్కడ వెలుగు కూడా చీకటిలా ఉంటుంది.” |
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.
Biblica, Inc.