Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

యిర్మీయా 9 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

1 అయ్యో, నా తల నీటి బావి నా కళ్లు కన్నీటి ఊట అయి ఉంటే బాగుండేది! చంపబడిన నా ప్రజల కోసం నేను పగలు రాత్రి ఏడ్చే వాన్ని.

2 అయ్యో, అరణ్యంలో నాకు యాత్రికులు బసచేసే స్థలం ఒకటి ఉంటే బాగుండేది! నా ప్రజలను వదిలి వారికి దూరంగా వెళ్లి అక్కడ ఉండేవాన్ని; ఎందుకంటే వారంతా వ్యభిచారులు, వారిది ఒక నమ్మకద్రోహుల సమూహము.

3 “ఒక విలుకాడు బాణాలు వేయడానికి విల్లును సిద్ధం చేసుకున్నట్లు వారు అబద్ధాలు చెప్పడానికి తమ నాలుకను సిద్ధం చేసుకుంటారు; వారి అబద్ధం వల్లనే వారు దేశంలో బలవంతులయ్యారు కాని నాకు నమ్మకస్థులుగా ఉండి కాదు. వారు ఒక పాపం తర్వాత మరొక పాపం చేస్తారు; వారు నన్ను గుర్తించరు,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

4 “ప్రతి ఒక్కరూ తన పొరుగువారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి; బంధువుల్లో ఎవరినీ కూడా నమ్మవద్దు, ఎందుకంటే వారిలో ప్రతివాడు ఒక మోసగాడు, స్నేహితుడు స్నేహితుని మీద అపనిందలు వేస్తాడు.

5 స్నేహితుడు స్నేహితుడిని మోసం చేస్తాడు, ఎవరూ సత్యం మాట్లాడరు. వారు అబద్ధాలు చెప్పడానికి తమ నాలుకలకు శిక్షణ ఇచ్చారు; వారు పాపం చేసి తమను తాము అలసటకు గురిచేసుకుంటారు.

6 నీవు మోసం మధ్య జీవిస్తున్నావు; వారి మోసాన్ని బట్టి వారు నన్ను తెలుసుకోవడానికి నిరాకరిస్తున్నారు,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

7 కాబట్టి సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: “చూడండి, నేను వారిని శుద్ధి చేసి పరీక్షిస్తాను, నా ప్రజల పాపాన్ని బట్టి అంతకన్నా నేనేం చేయగలను?

8 వారి నాలుక మరణకరమైన బాణం; అది మోసపూరితంగా మాట్లాడుతుంది. వారంతా తమ పొరుగువారితో సమాధానంగానే మాట్లాడతారు, కాని తమ హృదయాల్లో వారి కోసం ఉచ్చులు బిగిస్తారు.

9 అందుకు నేను వారిని శిక్షించకూడదా? ఇలాంటి దేశంపై నేను ప్రతీకారం తీర్చుకోకూడదా?” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

10 నేను పర్వతాల కోసం ఏడుస్తాను, రోదిస్తాను, అరణ్య పచ్చగడ్డి ఉన్న స్థలాల గురించి విలపిస్తాను. అవి నిర్జనమైనవి, ప్రయాణం చేయలేనివి, పశువుల అరుపులు వినబడవు. పక్షులన్నీ పారిపోయాయి జంతువులు వెళ్లిపోయాయి.

11 “నేను యెరూషలేమును శిథిలాల కుప్పగా, నక్కల విహారంగా చేస్తాను. నేను యూదా పట్టణాలను నాశనం చేస్తాను, అక్కడ ఎవరూ నివసించలేరు.”

12 దీనిని గ్రహించగల జ్ఞాని ఎవరు? యెహోవా నుండి ఉపదేశం పొందుకొని దాన్ని వివరించగల వారెవరు? దేశం ఎందుకు శిథిలమై ఎవరు దాటలేని ఎడారిలా పాడైంది?

13 యెహోవా ఇలా అన్నాడు, “నేను వారి ముందుంచిన నా ధర్మశాస్త్రాన్ని వారు విడిచిపెట్టారు; వారు నాకు విధేయత చూపలేదు, నా ధర్మశాస్త్రాన్ని అనుసరించలేదు.

14 దానికి బదులు, వారు తమ హృదయాల మొండితనాన్ని అనుసరించారు; వారి పూర్వికులు వారికి బోధించినట్లుగా వారు బయలును అనుసరించారు.”

15 కాబట్టి ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు: “చూడండి, నేను ఈ ప్రజలను చేదు ఆహారం తినేలా, విషపూరితమైన నీళ్లు త్రాగేలా చేస్తాను.

16 వారికి గాని వారి పూర్వికులకు గాని తెలియని దేశాల మధ్య వారిని చెదరగొట్టి, వారిని అంతం చేసే వరకు ఖడ్గంతో వారిని వెంటాడుతాను.”

17 సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: “ఇప్పుడు ఆలోచించండి! విలపించే స్త్రీలను పిలిపించండి; వారిలో అత్యంత నైపుణ్యం ఉన్న వారి కోసం పంపండి.

18 వారు త్వరగా వచ్చి మన కళ్ల నుండి కన్నీరు పొర్లిపారే వరకు మా కనురెప్పల నుండి నీటి ధారలు వచ్చేవరకు మనల్ని చూసి ఏడుస్తారు.

19 సీయోను నుండి రోదిస్తున్న శబ్దం వినబడుతుంది: ‘మనం పూర్తిగా పతనం అయ్యాము! మన ఘోరంగా అవమానపరచబడ్డాము! మన ఇల్లు శిథిలావస్థలో ఉన్నాయి కాబట్టి మనం మన దేశాన్ని వదిలిపెట్టాలి.’ ”

20 స్త్రీలారా, యెహోవా మాట వినండి; ఆయన నోటి మాటలకు మీ చెవులు తెరవండి. ఏడ్వడం ఎలాగో మీ కుమార్తెలకు నేర్పండి; ఒకరికొకరు ఎలా విలపించాలో బోధించండి.

21 మరణం మన కిటికీల గుండా ఎక్కి మన కోటల్లోకి ప్రవేశించింది; అది వీధుల్లో పిల్లలు లేకుండ బహిరంగ కూడళ్లలో యువకులు లేకుండ నాశనం చేస్తుంది.

22 ఇలా చెప్పు, “యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు: “ ‘మృతదేహాలు బహిర్భూమిలో పెంటలా, కోత కోసేవాని వెనుక పడి ఉన్న పనల్లా, వాటిని సేకరించడానికి ఎవరూ ఉండరు.’ ”

23 యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు: “జ్ఞానులు తమ జ్ఞానాన్ని గురించి గొప్పలు చెప్పుకోకూడదు బలవంతులు తమ బలం గురించి గొప్పలు చెప్పుకోకూడదు ధనవంతులు తమ ఐశ్వర్యం గురించి గొప్పలు చెప్పుకోకూడదు,

24 అయితే గర్వించేవారు దీనిని గురించి గర్వించాలి: నన్ను తెలుసుకునే జ్ఞానం వారికి ఉందని, నేనే యెహోవానని, భూమిపై దయను, న్యాయాన్ని నీతిని అమలు చేసేవాడినని, ఎందుకంటే వీటిని బట్టి నేను సంతోషిస్తున్నాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

25 “కేవలం శరీర సంబంధంగా మాత్రమే సున్నతి పొందిన వారందరినీ నేను శిక్షించే రోజులు రాబోతున్నాయి” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

26 “ఈజిప్టు, యూదా, ఎదోము, అమ్మోను, మోయాబు అరణ్యంలో, సుదూర ప్రాంతాల్లో నివసించే వారందరినీ నేను శిక్షించే రోజులు వస్తున్నాయి. ఎందుకంటే ఈ దేశాలన్నీ నిజంగా సున్నతి పొందలేదు, ఇశ్రాయేలు ఇంటివారందరు కూడా హృదయంలో సున్నతి పొందలేదు.”

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan