Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

యిర్మీయా 37 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


చెరసాలలో యిర్మీయా

1 యోషీయా కుమారుడైన సిద్కియాను బబులోను రాజైన నెబుకద్నెజరు యూదాకు రాజుగా నియమించాడు. అతడు యెహోయాకీము కుమారుడైన యెహోయాకీను స్థానంలో రాజయ్యాడు.

2 ప్రవక్తయైన యిర్మీయా ద్వారా యెహోవా చెప్పిన మాటలను అతడు గాని, అతని సేవకులు గాని, దేశ ప్రజలు గాని పట్టించుకోలేదు.

3 అయితే రాజైన సిద్కియా, షెలెమ్యా కుమారుడైన యెహుకలును మయశేయా కుమారుడును యాజకుడునైన జెఫన్యాతో పాటు యిర్మీయా ప్రవక్తకు ఈ సందేశాన్ని పంపాడు: “దయచేసి మాకోసం మన దేవుడైన యెహోవాకు ప్రార్థించండి.”

4 అప్పటికి యిర్మీయాను ఇంకా జైలులో పెట్టలేదు కాబట్టి ప్రజలమధ్య స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నాడు.

5 ఫరో సైన్యం ఈజిప్టు నుండి బయలుదేరగా, యెరూషలేమును ముట్టడించిన బబులోనీయులు ఆ వార్త విని యెరూషలేము నుండి వెనుకకు వెళ్లిపోయారు.

6 అప్పుడు యెహోవా వాక్కు యిర్మీయా ప్రవక్తకు వచ్చింది:

7 “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నారు: ‘ఫరో గురించి నన్ను విచారించడానికి నిన్ను పంపిన యూదా రాజుతో చెప్పు. మీకు మద్ధతు ఇవ్వడానికి బయలుదేరిన సైన్యం తిరిగి తన దేశమైన ఈజిప్టుకు వెళ్తుంది.

8 అప్పుడు బబులోనీయులు తిరిగివచ్చి ఈ పట్టణంపై దాడి చేస్తారు; వారు దానిని పట్టుకుని కాల్చివేస్తారు.’

9 “యెహోవా ఇలా అంటున్నారు: ‘బబులోనీయులు మనల్ని విడిచిపెట్టి వెళ్లిపోతారు’ అని మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. వారు వెళ్లరు!

10 మీపై దాడి చేస్తున్న బబులోనీయుల సైన్యం మొత్తాన్ని మీరు ఓడించినా, గాయపడిన మనుష్యులు మాత్రమే తమ గుడారాల్లో మిగిలిపోయినా, వారే బయటకు వచ్చి ఈ పట్టణాన్ని కాల్చివేస్తారు.”

11 ఫరో సైన్యాన్ని బట్టి బబులోనీయుల సైన్యం యెరూషలేము నుండి వెనుకకు వెళ్లిన తర్వాత,

12 యిర్మీయా బెన్యామీను ప్రాంతంలో తన ప్రజల ఆస్తిలో తన వాటాను పొందేందుకు యెరూషలేమును విడిచి అక్కడి వెళ్లడానికి బయలుదేరాడు.

13 అయితే అతడు బెన్యామీను ద్వారం దగ్గరకు చేరుకున్నప్పుడు, హనన్యా కుమారుడైన షెలెమ్యా కుమారుడు ఇరియా అనే కావలివారి దళాధిపతి ప్రవక్తయైన యిర్మీయాను పట్టుకుని, “నీవు బబులోనీయులతో చేరిపోవడానికి వెళ్తున్నావు!” అన్నాడు.

14 “అది నిజం కాదు! నేను బబులోనీయులలో చేరడానికి వెళ్లడం లేదు” అని యిర్మీయా జవాబిచ్చాడు. కాని ఇరియా అతని మాట వినలేదు; పైగా, అతడు యిర్మీయాను బంధించి అధికారుల దగ్గరకు తీసుకువచ్చాడు.

15 వారు యిర్మీయా మీద కోపం తెచ్చుకుని, అతన్ని కొట్టి, కార్యదర్శియైన యోనాతాను ఇంట్లో బంధించి, ఆ ఇంటిని వారు జైలుగా చేశారు.

16 యిర్మీయా సొరంగంలో ఉన్న ఒక చెరసాలలో చాలా రోజులు ఉండిపోయాడు.

17 అప్పుడు రాజైన సిద్కియా అతన్ని పిలిపించి, రాజభవనానికి తీసుకువచ్చి, “యెహోవా నుండి ఏదైనా వాక్కు వచ్చిందా?” అని అడిగాడు. “అవును, నీవు బబులోను రాజు చేతికి అప్పగించబడతావు” అని యిర్మీయా జవాబిచ్చాడు.

18 అప్పుడు యిర్మీయా రాజైన సిద్కియాతో ఇలా అన్నాడు: “నన్ను జైలులో వేయడానికి నేను నీకు గాని నీ సేవకులకు గాని ఈ ప్రజలకు గాని వ్యతిరేకంగా ఏ నేరం చేశాను?

19 ‘బబులోను రాజు మీ మీదా, ఈ దేశం మీదా దాడి చేయడు’ అని మీకు ప్రవచించిన మీ ప్రవక్తలు ఎక్కడ ఉన్నారు?

20 అయితే నా ప్రభువా, రాజా, దయచేసి వినండి. నా విన్నపాన్ని మీ ముందుకు తేనివ్వండి: నన్ను కార్యదర్శియైన యోనాతాను ఇంటికి తిరిగి పంపవద్దు, నేను అక్కడే చనిపోతాను.”

21 రాజైన సిద్కియా యిర్మీయాను కావలివారి ప్రాంగణంలో ఉంచి, పట్టణంలోని రొట్టెలన్నీ పూర్తిగా అయిపోయే వరకు ప్రతిరోజు రొట్టెలు చేసేవారి వీధి నుండి ఒక రొట్టె ఇవ్వమని ఆజ్ఞాపించాడు. కాబట్టి యిర్మీయా కావలివారి ప్రాంగణంలో ఉండిపోయాడు.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan