Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

యిర్మీయా 30 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


ఇశ్రాయేలును తిరిగి రప్పిస్తాను

1 యెహోవా నుండి యిర్మీయాకు వచ్చిన వాక్కు ఇది:

2 “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఇలా చెప్తున్నారు, ‘నేను మాట్లాడిన మాటలన్నీ ఒక గ్రంథంలో వ్రాయి.

3 అవి జరుగబోయే రోజులు రాబోతున్నాయి’ అని యెహోవా ప్రకటిస్తున్నారు, ‘నేను నా ప్రజలైన ఇశ్రాయేలును, యూదాను చెరనుండి విడిపించి, వారి పూర్వికులకు నేనిచ్చిన దేశానికి వారిని రప్పిస్తాను, వారు దాన్ని స్వాధీనం చేసుకునే రోజులు రాబోతున్నాయి’ అని యెహోవా చెప్తున్నారు.”

4 ఇశ్రాయేలు, యూదా గురించి యెహోవా చెప్పిన మాటలు:

5 “యెహోవా ఇలా అంటున్నారు: “ ‘భయంతో కూడిన కేకలు వినబడుతున్నాయి, భయమే ఉంది తప్ప, సమాధానం లేదు.

6 ఓ విషయం వారిని అడిగి చూడండి: పురుషుడు పిల్లలు కనగలడా? అలాంటప్పుడు ప్రసవ వేదనలో ఉన్న స్త్రీలా పురుషులందరు ఎందుకు నడుముపై చేతులు పెట్టుకున్నారు? వారి ముఖాలు ఎందుకు వాడిపోయాయి?

7 ఆ రోజు ఎంత భయంకరంగా ఉంటుందో! అలాంటిది మరొకటి ఉండదు. అది యాకోబుకు కష్టకాలం, అయితే వారు దాని నుండి రక్షించబడతారు.

8 సైన్యాల యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “ ‘ఆ రోజు, నేను వారి మెడల మీద ఉన్న కాడిని విరగ్గొడతాను వారి బంధకాలను తెంపివేస్తాను; ఇకపై విదేశీయులు వారిని బానిసలుగా చేయరు.

9 కాని, వారు తమ దేవుడైన యెహోవాకు సేవ చేస్తారు నేను వారికి రాజుగా నియమించే దావీదు రాజును వారు సేవిస్తారు.

10 “ ‘కాబట్టి నా సేవకుడైన యాకోబూ, భయపడకు; ఇశ్రాయేలు, కలవరపడకు’ అని యెహోవా ప్రకటిస్తున్నారు. ‘సుదూర ప్రాంతం నుండి నేను నిన్ను తప్పకుండా రక్షిస్తాను, నీ సంతతిని వారు బందీలుగా ఉన్న దేశం నుండి తప్పకుండా రక్షిస్తాను. యాకోబుకు మళ్ళీ సమాధానం నెమ్మది కలుగుతాయి, ఎవరూ అతన్ని భయపెట్టరు.

11 నేను నీతో ఉన్నాను, నిన్ను రక్షిస్తాను’ అని యెహోవా ప్రకటిస్తున్నారు. ‘నేను నిన్ను చెదరగొట్టిన దేశాలన్నిటిని పూర్తిగా నాశనం చేసినా, నిన్ను మాత్రం పూర్తిగా నాశనం చేయను. కాని నేను నిన్ను తగినంతగా శిక్షిస్తాను; శిక్షించకుండ మాత్రం నిన్ను వదిలిపెట్టను.’

12 “యెహోవా ఇలా అంటున్నారు: “ ‘నీ గాయం నయం కానిది, నీ గాయం తీవ్రమైనది.

13 నీ పక్షంగా వాదించడానికి ఎవరు లేరు, నీ పుండుకు నివారణ లేదు, నీకు స్వస్థత లేదు.

14 నీ స్నేహితులందరు నిన్ను మరచిపోయారు; వారు నీ గురించి ఏమీ పట్టించుకోరు. శత్రువు కొట్టినట్లుగా నేను నిన్ను కొట్టి, క్రూరమైనవానిలా నిన్ను శిక్షించాను, ఎందుకంటే నీ అపరాధం చాలా పెద్దది, నీ పాపాలు చాలా ఎక్కువ.

15 నీ గాయం గురించి, తీరని నీ బాధ గురించి ఎందుకు ఏడుస్తున్నావు? నీ గొప్ప అపరాధం అనేక పాపాల కారణంగా నేను నీకు ఇవన్నీ చేశాను.

16 “ ‘అయితే నిన్ను మ్రింగివేసేవాళ్లంతా మ్రింగివేయబడతారు; నీ శత్రువులందరూ బందీలుగా కొనిపోబడతారు. నిన్ను దోచుకునేవారు దోచుకోబడతారు; నిన్ను పాడుచేసే వారందరిని నేను పాడుచేస్తాను.

17 అయితే నేను నీకు స్వస్థత కలుగజేసి నీ గాయాలను బాగుచేస్తాను’ అని యెహోవా ప్రకటిస్తున్నారు, ఎందుకంటే ‘నీవు వెలివేయబడినవాడవని, సీయోనును ఎవ్వరూ పట్టించుకోరు’ అని నీ గురించి అన్నారు.

18 “యెహోవా ఇలా అంటున్నారు: “ ‘నేను యాకోబు ఇంటివారిని చెర నుండి తిరిగి రప్పించి, అతని నివాసాలపై కనికరం చూపుతాను. పట్టణం దాని శిథిలాల మీద మరలా కట్టబడుతుంది, రాజభవనం దాని స్థలంలోనే ఉంటుంది.

19 వాటినుండి కృతజ్ఞతాగీతాలు ఆనంద ధ్వనులు వస్తాయి. నేను వారి సంఖ్యను తగ్గించకుండ, అధికం చేస్తాను; నేను వారికి ఘనతను తెస్తాను, వారు అసహ్యానికి గురికారు.

20 వారి పిల్లలు పూర్వకాలంలో ఉన్నట్లే ఉంటారు, వారి సంఘం నా ముందు స్థిరపడుతుంది; వారిని హింసించే వారందరినీ నేను శిక్షిస్తాను.

21 వారి నాయకుడు వారిలో ఒకడు; వారి పాలకుడు వారి మధ్య నుండి లేస్తాడు. నేను అతన్ని దగ్గరికి తీసుకువస్తాను, అతడు నా దగ్గరికి వస్తాడు నన్ను సమీపించే సాహసం చేయగల వ్యక్తి ఎవరు?’ అని యెహోవా ప్రకటిస్తున్నారు.

22 ‘కాబట్టి మీరు నా ప్రజలు, నేను మీకు దేవుడను.’ ”

23 చూడండి, యెహోవా ఉగ్రత తుఫానులా విరుచుకుపడుతుంది, అది సుడిగాలిలా వీస్తూ దుష్టుల తలలపైకి తిరుగుతుంది.

24 ఆయన తన హృదయ ఉద్దేశాలను పూర్తిగా నెరవేర్చే వరకు యెహోవా తీవ్రమైన కోపం చల్లారదు. రాబోయే రోజుల్లో మీరు దీన్ని గ్రహిస్తారు.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan