Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

యిర్మీయా 3 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

1 “ఒక పురుషుడు తన భార్యకు విడాకులు ఇచ్చి, ఆమె అతన్ని విడిచిపెట్టి మరొక వ్యక్తిని పెళ్ళి చేసుకుంటే, అతడు మళ్ళీ ఆమె దగ్గరకు వెళ్లాలా? దేశమంతా పూర్తిగా అపవిత్రమవదా? అయితే నీవు చాలామంది ప్రేమికులతో వేశ్యగా జీవించావు, ఇప్పుడు నా దగ్గరకు తిరిగి వస్తావా?” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

2 “కళ్లు పైకెత్తి ఆ బంజరు కొండలను చూడు. నీవు అత్యాచారానికి గురి కాని ప్రదేశం ఏదైనా ఉందా? ప్రేమికుల కోసం రోడ్డు ప్రక్కన ఎదురుచూస్తూ కూర్చున్నావు, ఎడారిలో అరబీయునిగా కూర్చున్నావు. నీ వ్యభిచారంతో, దుర్మార్గంతో దేశాన్ని అపవిత్రం చేశావు.

3 కాబట్టి వాన జల్లులు ఆగిపోయాయి, వసంత వర్షాలు కురవలేదు. అయినా నీవు వేశ్యలా సిగ్గుపడడానికి తిరస్కరిస్తున్నావు; నీవు సిగ్గుపడడానికి నిరాకరిస్తున్నావు.

4 నీవు ఇప్పుడే నన్ను పిలిచి: ‘నా తండ్రీ, నా చిన్నప్పటి నుండి నా స్నేహితుడవు,

5 నీవు ఎప్పటికీ కోపంగా ఉంటావా? నీ ఉగ్రత ఎప్పటికీ ఉంటుందా?’ నీవు ఇలా మాట్లాడతావు, కానీ నీవు చేయగలిగిన కీడంతా చేస్తావు.”


నమ్మకద్రోహియైన ఇశ్రాయేలు

6 యోషీయా రాజు పాలనలో యెహోవా నాతో ఇలా అన్నారు, “నమ్మకద్రోహియైన ఇశ్రాయేలు ఏమి చేసిందో చూశావా? ఆమె ఎత్తైన ప్రతి కొండ మీదికి, పచ్చని ప్రతి చెట్టు క్రిందికి వెళ్లి, వ్యభిచారం చేసింది.

7 ఇదంతా చేసిన తర్వాత ఆమె నా దగ్గరకు తిరిగి వస్తుందని నేను అనుకున్నాను, కానీ ఆమె అలా చేయలేదు, ఆమె నమ్మకద్రోహియైన సోదరి యూదా దానిని చూసింది.

8 నేను విశ్వాసంలేని ఇశ్రాయేలుకు తన విడాకుల ధృవీకరణ పత్రాన్ని ఇచ్చి, ఆమె చేసిన వ్యభిచారాలన్నిటిని బట్టి ఆమెను పంపివేసాను. అయినప్పటికీ నమ్మకద్రోహియైన ఆమె సహోదరి యూదాకు భయం లేదని నేను చూశాను; ఆమె కూడా బయటకు వెళ్లి వ్యభిచారం చేసింది.

9 ఇశ్రాయేలు అనైతికత ఆమె దృష్టికి చాలా తక్కువ కాబట్టి, ఆమె దేశాన్ని అపవిత్రం చేసింది, రాయితో, కలపతో వ్యభిచారం చేసింది.

10 ఇంత జరిగినా, నమ్మకద్రోహియైన తన సహోదరి యూదా తన పూర్ణహృదయంతో నా వైపు తిరగలేదు, కేవలం నటించింది” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

11 యెహోవా నాతో ఇలా అన్నారు: “ద్రోహియైన యూదా కంటే విశ్వాసంలేని ఇశ్రాయేలు నీతిమంతురాలు.

12 నీవు వెళ్లి, ఉత్తరాన ఈ సందేశం ప్రకటించాలి: “ ‘ద్రోహియైన ఇశ్రాయేలూ, తిరిగి రా’ అని యెహోవా ప్రకటిస్తున్నారు, ‘ఇకపై నేను నీవైపు కన్నెత్తి చూడను, ఎందుకంటే నేను నమ్మకస్థుడను’ అని యెహోవా ప్రకటిస్తున్నారు, ‘నేను నిత్యం కోపంగా ఉండను.

13 నీ అపరాధాన్ని ఒప్పుకో నీ దేవుడైన యెహోవా మీద నీవు తిరుగుబాటు చేశావు, నీవు ప్రతి మహా వృక్షం క్రింద పరదేశి దేవుళ్ళకు నీ ఇష్టాన్ని పంచుకున్నావు, నాకు విధేయత చూపలేదు’ ” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

14 “విశ్వాసంలేని ప్రజలారా, తిరిగి రండి” అని యెహోవా ప్రకటిస్తున్నారు, “నేను నీ భర్తను కాబట్టి నేను నిన్ను ఎంచుకుంటాను ఒక పట్టణం నుండి ఒకనిగా, ఒక వంశం నుండి ఇద్దరినిగా నిన్ను సీయోనుకు తీసుకువస్తాను.

15 అప్పుడు నేను నీకు నా హృదయానికి చాలా దగ్గరి వారైన కాపరులను ఇస్తాను, వారు జ్ఞానంతో, అవగాహనతో మిమ్మల్ని నడిపిస్తారు.

16 ఆ రోజుల్లో దేశంలో మీ సంఖ్య బాగా పెరిగినప్పుడు” అని యెహోవా ప్రకటిస్తున్నారు, “ప్రజలు ఇకపై, ‘యెహోవా నిబంధన మందసం’ అని అనరు. అది ఎప్పటికీ వారి మనస్సులోకి ఎక్కదు, జ్ఞాపకంలో ఉండదు; అది తప్పిపోదు, మరొకటి తయారుచేయబడదు.

17 ఆ సమయంలో వారు యెరూషలేమును యెహోవా యొక్క సింహాసనం అని పిలుస్తారు, యెహోవా నామాన్ని గౌరవించడానికి అన్ని దేశాలు యెరూషలేములో సమకూడుతాయి. ఇకపై వారు తమ దుష్ట హృదయాల మొండితనాన్ని అనుసరించరు.

18 ఆ రోజుల్లో యూదా ప్రజలు ఇశ్రాయేలు ప్రజలతో కలిసి ఉంటారు, వారు కలిసి ఉత్తర దేశం నుండి నేను మీ పూర్వికులకు వారసత్వంగా ఇచ్చిన దేశానికి వస్తారు.

19 “నేను నేనే ఇలా అన్నాను, “ ‘మిమ్మల్ని నా పిల్లల్లా చూసుకుంటాను మీకు ఆహ్లాదకరమైన భూమిని, ఏ జాతికి చెందనంత అందమైన వారసత్వాన్ని ఇస్తాను.’ ‘తండ్రీ’ అని నీవు నన్ను పిలుస్తావని అనుకున్నాను నన్ను అనుసరించకుండ దూరంగా వెళ్లవని అనుకున్నాను.

20 కానీ తన భర్తకు ద్రోహం చేసిన స్త్రీలా ఇశ్రాయేలూ, నీవు నాకు నమ్మకద్రోహం చేశావు,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

21 ఇశ్రాయేలు ప్రజలు తమ మార్గాలను తప్పుదారి పట్టించి తమ దేవుడైన యెహోవాను మరచిపోయారు కాబట్టి, బంజరు కొండలమీద ఇశ్రాయేలు ప్రజల ఏడ్పులు, విన్నపాలు, వినబడుతున్నాయి.

22 “విశ్వాసంలేని ప్రజలారా, తిరిగి రండి. మీ విశ్వాసభ్రష్టత్వాన్ని నేను నయం చేస్తాను.” “అవును, మేము మీ దగ్గరకు వస్తాము, ఎందుకంటే మీరే మా దేవుడైన యెహోవా.

23 నిశ్చయంగా కొండలు, పర్వతాలమీద జరుగుతున్న విగ్రహారాధన అల్లకల్లోలం మోసమే; ఖచ్చితంగా మన దేవుడైన యెహోవాలో ఇశ్రాయేలు రక్షణ.

24 మన పూర్వికుల శ్రమ ఫలాలను వారి గొర్రెలను, మందలను, వారి కుమారులు, కుమార్తెలను మా యవ్వనం నుండి సిగ్గుమాలిన దేవతలు తినివేశాయి.

25 మనం అవమానంలో పడి ఉందాం, మన అవమానాన్ని మనల్ని కప్పివేయనిద్దాము. మన దేవుడైన యెహోవాకు వ్యతిరేకంగా మనం పాపం చేశాము, మనమూ, మన పూర్వికులు; మా యవ్వనం నుండి నేటి వరకు మనం మన దేవుడైన యెహోవా మాటకు లోబడలేదు.”

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan