Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

యిర్మీయా 29 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


బందీలుగా ఉన్నవారికి లేఖ

1 నెబుకద్నెజరు యెరూషలేము నుండి బబులోనుకు బందీలుగా తీసుకువెళ్లిన వారిలో మిగిలి ఉన్న పెద్దలకు, యాజకులకు, ప్రవక్తలకు, ఇతర ప్రజలందరికి యెరూషలేము నుండి యిర్మీయా ప్రవక్త పంపిన ఉత్తరంలోని మాటలు ఇవి.

2 (యెహోయాకీను రాజు, రాజమాత, ఆస్థాన అధికారులు, యూదా, యెరూషలేము నాయకులు, నిపుణులైన పనివారు కళాకారులు యెరూషలేము నుండి బందీలుగా తీసుకువెళ్లిన తర్వాత ఈ ఉత్తరం పంపబడినది.)

3 యూదా రాజైన సిద్కియా బబులోను రాజు నెబుకద్నెజరు దగ్గరకు పంపిన షాఫాను కుమారుడైన ఎల్యాశా, హిల్కీయా కుమారుడైన గెమర్యాలతో అతడు ఈ ఉత్తరాన్ని పంపించాడు. అందులో ఇలా ఉంది:

4 ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా తన ఇష్టప్రకారం యెరూషలేము నుండి బబులోనుకు బందీలుగా తీసుకువెళ్లిన వారందరితో ఇలా అంటున్నారు:

5 “ఇల్లు కట్టుకుని స్థిరపడండి; తోటలు నాటి వాటి పండ్లను తినండి.

6 పెళ్ళి చేసుకుని కుమారులు, కుమార్తెలను కనండి; మీ కుమారులకు భార్యలను తెచ్చుకోండి, మీ కుమార్తెలకు పెళ్ళి చేయండి, వారు కూడా కుమారులు కుమార్తెలను కంటారు. అప్పుడు మీ సంఖ్య తగ్గకుండ అధికమవుతుంది.

7 అలాగే, నేను మిమ్మల్ని బందీలుగా తీసుకువెళ్లిన పట్టణంలో సమాధానం, అభివృద్ధి ఉండాలని కోరుకుని యెహోవాను ప్రార్థించండి, ఎందుకంటే అది అభివృద్ధి చెందితే, మీరు కూడా అభివృద్ధి చెందుతారు.”

8 అవును, ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: “మీ మధ్య ఉన్న ప్రవక్తలు భవిష్యవాణి చెప్పేవారు మిమ్మల్ని మోసగించకుండ చూసుకోండి. మీలో కలలు కనేవారి మాటలు మీరు వినకండి.

9 వారు నా పేరిట అబద్ధాలు ప్రవచిస్తున్నారు. నేను వారిని పంపలేదు” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

10 యెహోవా ఇలా అంటున్నారు: “బబులోనుకు డెబ్బై సంవత్సరాలు పూర్తయినప్పుడు, నేను మిమ్మల్ని దర్శించి నేను చేసిన మంచి వాగ్దానాన్ని నెరవేర్చి మిమ్మల్ని ఈ స్థలానికి తిరిగి రప్పిస్తాను.

11 ఎందుకంటే మీ కోసం నేను ఏర్పరచుకున్న ప్రణాళికలు నాకు తెలుసు” అని యెహోవా అంటున్నారు. “అవి మిమ్మల్ని అభివృద్ధి చేయడానికి, రాబోయే కాలంలో మీకు నిరీక్షణ కలిగించే సమాధానకరమైన ఉద్దేశాలే గాని మీకు హాని కలిగించడానికి కాదు.

12 అప్పుడు మీరు నాకు మొరపెట్టి నాకు ప్రార్థిస్తారు, అప్పుడు నేను మీ మాట వింటాను.

13 మీరు నన్ను వెదకినప్పుడు, మీ పూర్ణహృదయంతో నన్ను వెదికినప్పుడు నన్ను కనుగొంటారు.

14 మీరు నన్ను కనుగొంటారు, మిమ్మల్ని చెర నుండి తిరిగి రప్పిస్తాను. నేను మిమ్మల్ని వెళ్లగొట్టిన అన్ని దేశాల నుండి అన్ని ప్రాంతాల నుండి మిమ్మల్ని సమకూరుస్తాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు, “నేను మిమ్మల్ని వెళ్లగొట్టిన దేశానికి తిరిగి తీసుకువస్తాను.

15 “బబులోనులో యెహోవా మన కోసం ప్రవక్తలను లేవనెత్తారు” అని మీరు అనవచ్చు,

16 అయితే దావీదు సింహాసనం మీద కూర్చున్న రాజు గురించి, మీతో పాటు బందీలుగా వెళ్లకుండా ఈ పట్టణంలో మిగిలిన మీ తోటి సోదరులు ప్రజలందరి గురించి యెహోవా ఇలా అంటున్నారు.

17 సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: “నేను ఖడ్గాన్ని, కరువును, తెగులును వారిపైకి పంపుతాను, వారిని తినడానికి పనికిరాని చెడ్డ అంజూర పండ్లలా చేస్తాను.

18 నేను వారిని ఖడ్గంతో, కరువుతో, తెగుళ్ళతో వెంటాడి, వారిని ఏ దేశాల్లోకి తరుముతానో ఆ భూరాజ్యాలన్నిటికి వారిని అసహ్యమైన వారిగా, శాపంగా, భయానకంగా, హేళనగా నిందగా చేస్తాను.

19 ఎందుకంటే వారు నా మాటలు వినలేదు” అని యెహోవా ప్రకటిస్తున్నారు. “నా సేవకులైన ప్రవక్తల ద్వారా నేను వారికి మళ్ళీ మళ్ళీ పంపిన మాటలు వారు వినలేదు. వారే కాదు బందీలుగా ఉన్న మీరు కూడా వినలేదు” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

20 కాబట్టి నేను యెరూషలేము నుండి బబులోనుకు బందీలుగా పంపినవారలారా, యెహోవా మాట వినండి.

21 ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా, నా పేరిట మీకు అబద్ధాలు ప్రవచిస్తున్న కోలాయా కుమారుడైన అహాబు, మయశేయా కుమారుడైన సిద్కియా గురించి ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: “నేను వారిని బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి అప్పగిస్తాను, అతడు మీ కళ్లముందే వారిని చంపేస్తాడు.

22 వారి కారణంగా, బబులోనులో ఉన్న యూదా నుండి బందీలుగా వెళ్లిన వారందరూ, ‘సిద్కియా, అహాబులను బబులోను రాజు అగ్నిలో కాల్చివేసినట్టుగా, యెహోవా మీకు చేయును గాక’ అని శపిస్తారు.

23 ఎందుకంటే వారు ఇశ్రాయేలులో అవమానకరమైన పనులు చేశారు; వారు తమ పొరుగువారి భార్యలతో వ్యభిచారం చేశారు, నేను ప్రకటించని విషయాలలో వారు నా పేరిట అబద్ధాలు చెప్పారు. అది నాకు తెలుసు, నేనే దానికి సాక్షిని” అని యెహోవా తెలియజేస్తున్నారు.


షెమయాకు సందేశం

24 నెహెలామీయుడైన షెమయాతో ఇలా చెప్పు,

25 “ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: యెరూషలేములో ఉన్న ప్రజలందరికి, మయశేయా కుమారుడు యాజకుడునైన జెఫన్యాకు, ఇతర యాజకులందరికీ నీ పేరిట ఉత్తరాలు పంపి జెఫన్యాతో ఇలా అన్నావు,

26 ‘యెహోవా ఆలయానికి అధిపతిగా ఉండడానికి యెహోయాదా స్థానంలో యెహోవా నిన్ను యాజకునిగా నియమించారు; ప్రవక్తలా ప్రవర్తించే ఉన్మాదిని నీవు ఇనుప సంకెళ్లతో బంధించి కొయ్యకు బిగించాలి.

27 కాబట్టి మీలో ప్రవక్తగా నటిస్తున్న అనాతోతీయుడైన యిర్మీయాను నీవెందుకు గద్దించలేదు?

28 అతడు బబులోనులో ఉన్న మాకు, మీరు చాలా కాలం పాటు ఉంటారు. కాబట్టి ఇల్లు కట్టుకుని స్థిరపడండి; తోటలు వేసి వాటి పండ్లు తినండని సందేశాన్ని పంపాడు.’ ”

29 అయితే యాజకుడైన జెఫన్యా యిర్మీయా ప్రవక్తకు ఆ ఉత్తరాన్ని చదివి వినిపించాడు.

30 అప్పుడు యెహోవా వాక్కు యిర్మీయాకు వచ్చి:

31 “బందీలుగా ఉన్నవారందరికి ఈ సందేశం పంపు, ‘నెహెలామీయుడైన షెమయా గురించి యెహోవా ఇలా అంటున్నారు: నేను అతన్ని పంపలేదు, అయినాసరే షెమయా మీకు ప్రవచించి మీరు ఆ అబద్ధాలను నమ్మేలా చేశాడు.

32 యెహోవా ఇలా అంటున్నారు: నెహెలామీయుడైన షెమయాను, అతని సంతానాన్ని నేను తప్పకుండా శిక్షిస్తాను. నా ప్రజలకు నేను చేయబోయే మేలు అతని సంతతిలో ఎవరూ చూడరు, ఎందుకంటే అతడు నాకు వ్యతిరేకంగా తిరుగుబాటును ప్రకటించాడు’ అని యెహోవా ప్రకటిస్తున్నారు.”

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Lean sinn:



Sanasan