యిర్మీయా 27 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథంయూదా నెబుకద్నెజరుకు సేవ చేయాలి 1 యూదా రాజైన యోషీయా కుమారుడైన యెహోయాకీము ఏలుబడిలో, యెహోవా నుండి యిర్మీయాకు ఈ వాక్కు వచ్చింది: 2 యెహోవా నాతో ఇలా అన్నారు: “సంకెళ్లు ఒక కాడిని తయారుచేసి నీ మెడ మీద పెట్టుకో. 3 యూదా రాజైన సిద్కియా దగ్గరకు యెరూషలేముకు వచ్చిన రాయబారులతో ఎదోము, మోయాబు, అమ్మోను, తూరు, సీదోను రాజులకు కబురు పంపించు. 4 తమ యజమానుల తెలియజేయమని వారికి ఈ సందేశం ఇవ్వు, ‘ఇశ్రాయేలు దేవుడైన సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: “మీరు మీ యజమానులకు ఇలా చెప్పండి: 5 నా గొప్ప శక్తితో చాచిన బాహువుతో నేను భూమిని, దాని ప్రజలను దానిపై ఉన్న జంతువులను సృష్టించాను. నేను ఎవరు సరైన వారనుకుంటే వారికి దానిని ఇస్తాను. 6 ఇప్పుడు నేను నీ దేశాలన్నిటిని నా సేవకుడు బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి అప్పగిస్తాను; అడవి జంతువులను కూడా అతనికి లోబడి చేస్తాను. 7 అతని దేశానికి అంతం వచ్చేవరకు అన్ని దేశాలు అతనికి, అతని కుమారునికి, మనుమడికి సేవ చేస్తారు; అప్పుడు అనేక దేశాలు, గొప్ప రాజులు అతన్ని లొంగదీసుకుంటారు. 8 “ ‘ “అయితే, ఏదైనా దేశం గాని రాజ్యం గాని బబులోను రాజైన నెబుకద్నెజరుకు సేవ చేయకపోయినా అతని కాడి క్రింద మెడ వంచకపోయినా, నేను ఆ దేశాన్ని కత్తితో, కరువుతో, తెగులుతో శిక్షిస్తాను, అతని చేతితో దానిని పూర్తిగా నాశనం చేస్తాను అని యెహోవా ప్రకటిస్తున్నారు. 9 కాబట్టి, ‘మీరు బబులోను రాజుకు సేవ చేయరు’ అని మీతో చెప్పే మీ ప్రవక్తలు, భవిష్యవాణి చెప్పేవారు, కలల భావం చెప్పేవారు, మృతుల ఆత్మతో మాట్లాడేవారు, మంత్రగాళ్ల మాటలు మీరు వినవద్దు. 10 మిమ్మల్ని మీ దేశం నుండి దూరం చేయడానికే వారు మీతో అబద్ధాలు ప్రవచిస్తారు; నేను నిన్ను వెళ్లగొడతాను మీరు నశిస్తారు. 11 అయితే ఏ దేశమైనా బబులోను రాజు కాడి క్రింద మెడ వంచి అతనికి సేవ చేస్తే, నేను ఆ దేశాన్ని దాని సొంత దేశంలోనే ఉండి, దానిలో వ్యవసాయం చేయడానికి అక్కడ నివసించడానికి అనుమతిస్తానని యెహోవా ప్రకటిస్తున్నారు.” ’ ” 12 నేను యూదా రాజైన సిద్కియాకు కూడా అదే సందేశం ఇచ్చాను. నేను, “బబులోను రాజు కాడి క్రింద నీ మెడను వంచు; అతనికి అతని ప్రజలకు సేవ చేయండి, మీరు జీవిస్తారు. 13 బబులోను రాజుకు సేవ చేయని ఏ దేశానికైనా యెహోవా హెచ్చరించినట్లు కత్తితో కరువుతో తెగులుతో నీవు, నీ ప్రజలు ఎందుకు చావాలి? 14 ప్రవక్తల మాటలను వినవద్దు, వారు మీతో, ‘నీవు బబులోను రాజుకు సేవ చేయవు’ అని అబద్ధాలు ప్రవచిస్తున్నారు. 15 యెహోవా ఇలా చెప్తున్నారు, ‘నేను వారిని పంపలేదు, నా పేరుతో వారు అబద్ధాలు ప్రవచిస్తున్నారు. కాబట్టి, నేను నిన్ను వెళ్లగొడతాను, మీరూ మీతో పాటు ప్రవచించే ప్రవక్తలు కూడా నశిస్తారు.’ ” 16 అప్పుడు నేను యాజకులతో, ఈ ప్రజలందరితో ఇలా అన్నాను: “యెహోవా ఇలా చెప్తున్నారు: ‘అతిత్వరలో యెహోవా ఆలయ పాత్రలు బబులోను నుండి మళ్ళీ తేబడతాయి’ అని చెప్పే ప్రవక్తల మాటలను మీరు వినవద్దు, వారు మీకు అబద్ధాలు ప్రవచిస్తున్నారు. 17 వారి మాట వినవద్దు. బబులోను రాజును సేవించండి, అప్పుడు మీరు బ్రతుకుతారు. ఈ పట్టణం ఎందుకు నాశనమవ్వాలి? 18 ఒకవేళ వారు ప్రవక్తలైతే వారు యెహోవా మాటలు కలిగి ఉన్నట్లయితే, యెహోవా మందిరంలో, యూదారాజు రాజభవనంలో యెరూషలేములో మిగిలి ఉన్న వస్తువులను బబులోనుకు తీసుకెళ్లవద్దని వారు సైన్యాల యెహోవాను వేడుకోవడం మంచిది. 19 ఎందుకంటే స్తంభాలు, ఇత్తడి నీళ్ల తొట్టె, కదిలే పీటలు ఈ పట్టణంలో మిగిలి ఉన్న ఇతర వస్తువుల గురించి సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు, 20 వేటినైతే యూదా రాజైన యెహోయాకీము కుమారుడైన యెహోయాకీనును, యూదా యెరూషలేము పెద్దలందరిని యెరూషలేము నుండి బబులోనుకు బందీగా తీసుకెళ్లినప్పుడు బబులోను రాజైన నెబుకద్నెజరు తీసుకెళ్లలేదో, 21 యెహోవా మందిరంలో, అలాగే యూదారాజు యొక్క రాజభవనంలో యెరూషలేములోను మిగిలిపోయిన వాటి గురించి ఇశ్రాయేలు దేవుడైన సైన్యాల యెహోవా చెప్పారు: 22 ‘వాటిని బబులోనుకు తీసుకెళ్తారు; నేను వాటిని దర్శించి ఇక్కడికి తీసుకువచ్చి ఈ స్థలంలో పెట్టే వరకు అవి అక్కడే ఉంటాయి’ ” అని యెహోవా ప్రకటిస్తున్నారు. |
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.
Biblica, Inc.