యిర్మీయా 20 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథంయిర్మీయా, పషూరు 1 యిర్మీయా ఈ విషయాలు ప్రవచించడం ఇమ్మేరు కుమారుడు, యాజకుడు, యెహోవా ఆలయానికి అధికారియైన పషూరు విని, 2 అతడు యిర్మీయా ప్రవక్తను కొట్టించి, యెహోవా మందిరం దగ్గర బెన్యామీను ఎగువ ద్వారం దగ్గర ఉన్న కొయ్యకు బంధించాడు. 3 మరుసటిరోజు, పషూరు అతన్ని కొయ్య నుండి విడిపించినప్పుడు, యిర్మీయా అతనితో, “నీకు యెహోవా ఇచ్చిన పేరు పషూరు కాదు, నీ పేరు మాగోర్-మిస్సాబీబు. 4 ఎందుకంటే యెహోవా ఇలా అంటున్నారు: ‘నేను నిన్ను నీకు, నీ స్నేహితులందరికీ భయంగా చేస్తాను; వారు తమ శత్రువుల ఖడ్గం చేత పడిపోవుట నీ కళ్లతో చూస్తావు. నేను యూదా ప్రజలందరినీ బబులోను రాజు చేతికి అప్పగిస్తాను, అతడు వారిని బబులోనుకు తీసుకెళ్తాడు, ఖడ్గంతో హతమారుస్తాడు. 5 నేను ఈ పట్టణంలోని సంపాదనంతటిని అంటే దాని ఉత్పత్తులన్నిటినీ, విలువైన వస్తువులన్నిటినీ, యూదా రాజుల సంపదలన్నిటినీ వాళ్ల శత్రువుల చేతికి అప్పగిస్తాను. వారు దానిని దోచుకుని బబులోనుకు తీసుకెళ్తారు. 6 పషూరు, నీవు, నీ ఇంట్లో నివసించే వారందరూ బబులోనుకు బందీలుగా వెళ్తారు. అక్కడ మీరు, మీ అబద్ధాల ప్రవచనాలతో మీరు మోసగించిన మీ స్నేహితులందరూ చనిపోయి పాతిపెట్టబడతారు.’ ” యిర్మీయా ఫిర్యాదు 7 యెహోవా! మీరే నన్ను మోసగించావు, నేను లోబడ్డాను, మీరు నాకంటే బలవంతులు, మీరే గెలిచారు, రోజంతా అందరు నన్ను చూసి నవ్వుతున్నారు, ఎగతాళి చేస్తున్నారు. 8 నేను మాట్లాడినప్పుడెల్లా ఒకే ప్రవచనం వస్తుంది, హింస, నాశనం అంటూ ఎలుగెత్తి ప్రకటించవలసి వస్తుంది. యెహోవా మాట పలికినందుకు నాకు అవమానం, అపహాస్యం ఎదురయ్యాయి. 9 “దేవుని పేరు నేనెత్తను, ఆయన నామాన్ని బట్టి ప్రకటించను” అని అనుకుంటే, అప్పుడది నా హృదయంలో అగ్నిలా మండుతుంది. నా ఎముకల్లో మూయబడిన అగ్ని! ఎంత కాలమని ఓర్చుకోను? విసుగొస్తుంది, చెప్పకుండా ఉండలేను. 10 చాలామంది గుసగుసలాడడం విన్నాను, “అన్ని వైపుల భయం! అతన్ని ఖండించండి! అతన్ని ఖండిద్దాము.” నా స్నేహితులందరూ నేను జారిపడాలని చూస్తూ ఉన్నారు, “బహుశా అతడు మోసపోవచ్చు; అప్పుడు మనం అతనిపై విజయం సాధించి అతని మీద పగ తీర్చుకుందాము.” 11 అయితే పరాక్రమంగల బలాఢ్యుడైన యెహోవా నాకు తోడు; కాబట్టి నన్ను హింసించేవారు నిలువలేక తడబడతారు, వారు అనుకున్నది సాధించే యుక్తి లేక అవమానపాలవుతారు; వారి అవమానం ఎన్నటికీ మరవబడదు. 12 సైన్యాల యెహోవా! మీరు నీతిమంతులను పరీక్షిస్తారు, అంతరింద్రియాలను, హృదయాలను పరిశీలిస్తారు. నా వాదన మీకే అప్పగిస్తున్నాను, మీరు వారికి ఎలా ప్రతీకారం చేస్తారో నేను చూస్తాను. 13 యెహోవాను కీర్తించండి! యెహోవాను స్తుతించండి! దుష్టుని బారి నుండి దరిద్రుని ప్రాణాన్ని ఆయనే విడిపిస్తారు. 14 నేను పుట్టిన దినం శపితమవును గాక, నా తల్లి నన్ను కనిన దినం దీవించబడకపోవును గాక. 15 “నీకు ఒక కుమారుడు పుట్టాడు!” అని నా తండ్రికి వార్త తెలియజేసి, అతనికి చాలా సంతోషం కలిగించిన వ్యక్తి శాపగ్రస్తుడగును గాక. 16 యెహోవా దయ లేకుండా పడగొట్టిన పట్టణాల్లా ఆ వ్యక్తి ఉండును గాక. అతడు ఉదయాన్నే రోదనను, మధ్యాహ్నం యుద్ధఘోష వినును గాక. 17 ఎందుకంటే అతడు నన్ను గర్భంలో చంపి, నా తల్లినే నాకు సమాధిగా ఉండేలా చేయలేదు, ఆమె గర్భం శాశ్వతంగా ఉండిపోయేలా చేయలేదు. 18 కష్టాన్ని, దుఃఖాన్ని చూసి సిగ్గుతో నా దినాలు ముగించుకోవాలనా నేను గర్భం నుండి బయటకు వచ్చింది? |
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.
Biblica, Inc.